దమ్ము చూపించిన 'దేవర'... ఏపీలో సంచలన రికార్డు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఇప్పటికే 27 రోజులను పూర్తిచేసుకుంది. ఇప్పటికీ మంచి కలెక్షన్లతో నడుస్తోంది. పోటీగా ఎటువంటి సినిమాలు లేకపోవడంతో మినిమం కలెక్షన్లను రాబడుతోంది. విడుదల రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, సినిమాపై వ్యతిరేక ప్రచారం నడిచినప్పటికీ తారక్ తన క్రేజ్ ద్వారా సినిమాను బ్లాక్ బస్టర్ చేసి రూ.550 కోట్ల కలెక్షన్లు రాబట్టేలా చూశాడు. అతనికి తోడు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంత తోడ్పడింది. ఆ తర్వాతే కొరటాల శివ దర్శకత్వ ప్రతిభ మూడోస్థానంలో నిలబడింది.
ఏపీలో సంచలన రికార్డు
తాజాగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జూనియర్ ఎన్టీఆర్ దేవర సంచలన రికార్డును నెలకొల్పింది. ఇప్పటివరకు జీఎస్టీ కలుపుకొని రూ.100 కోట్ల షేర్ రాబట్టిన మూడోసినిమాగా నిలిచింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ మొదటి రెండు సినిమాలు. దేవరకు సినిమా చాలా బాగుంది అనే టాక్ వచ్చివుంటే సులువుగా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టేవారిమని తారక్ అభిమానులు అంటున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా మహారాష్ట్రలోని సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పటికీ ప్రదర్శింపబడుతూనే ఉంది.

హిందీలో రూ.60 కోట్ల గ్రాస్
ప్రస్తుతానికి హిందీలో ఈ సినిమా రూ.60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకురావడం విశేషం. ఏ ఒక్కరూ నష్టపోలేదు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేస్తున్న తారక్ దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తీయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది పూర్తయిన తర్వాత దేవర2 చేసే అవకాశం ఉంది. కొరటాల శివ ఈలోగా మోహన్ లాల్ తనయుడితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రాలేదు. ఆచార్య ఫ్లాప్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమాతో కొరటాల శివ తనను తాను నిరూపించుకోవడంతో స్టార్ హీరోలెవరైనా తనతో సినిమా చేయడానికి ముందుకు వస్తారేమో చూడాలి.












Click it and Unblock the Notifications