'హనుమాన్' బ్లాస్టింగ్ రికార్డ్... ఏ స్టార్ హీరోకు సాధ్యం కాదు?
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన హనుమాన్ చిత్రం నాలుగు రోజులగా సంచలన రికార్డులు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ సినిమా రోజులు గడిచేకద్దీ కొత్త రికార్డులు నెలకొల్పేందుకు పరుగులు తీస్తోంది. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
ఓవర్సీస్ లో ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసి నిర్మాతలు, బయ్యర్లపై మరింత డాలర్ల వర్షం కురిపించనుంది. విదేశాల్లో మిలియన్ డాలర్ కలెక్షన్ సాధించడమే ఒక రికార్డుగా భావిస్తారు. అటువంటిది స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా, వారి సినిమాలను మించి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ సాహో, ఆదిపురుష్, మహేష్ బాబు భరత్ అనే నేను, రామ్ చరణ్ రంగస్థలం, అల్లు అర్జున్ అల వైకుంఠపురం లాంటి సినిమాలే లాంగ్ రన్ లో మూడు, మూడున్నర మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించాయి.

అయితే హనుమాన్ నాలుగు రోజుల్లోనే మూడు మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో బాహుబలి2 ఉంది. ఈ సినిమా మొత్తంమీద విదేశాల్లో 20.76 మిలియన్ డాలర్లు, ఆర్ఆర్ఆర్ 14.83 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాయి. ఇటీవలే విడుదలైన సలార్ చిత్రం 8.90 మిలియన్ డాలర్లను సాధించింది. నాలుగురోజులకే హనుమాన్ ఇంత కలెక్షన్లు సాధించడంతో లాంగ్ రన్ లో భీభత్సమైన వసూళ్లు కురిపించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ రికార్డును అధిగమించడం భవిష్యత్తులో ఏ స్టార్ హీరోవల్ల సాధ్యమయ్యే పరిస్థితి కనపడటంలేదని విశ్లేషకులు అంటున్నారు. రానున్న రోజుల్లో హనుమాన్ కలెక్షన్లు ఏ రేంజ్ కు వెళతాయో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications