సంక్రాంతి రేసులో మెగా ఫ్యామిలీ సపోర్ట్- ఆ సినిమాకే
Hanu Man: యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం మైథలాజికల్ ఫాంటసీ మూవీ.. హనుమాన్. సంక్రాంతి పండగ కానుకగా శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనే టాక్‌ను సొంతం చేసుకుంది.
తేజా సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ఇదే. సోలో హీరోగా జాంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం సినిమాల్లో నటించాడు తేజా. అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత హను మాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదరగొట్టాడు.

అమృత నాయర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్రీమియర్ షోస్ పడిన అన్ని థియేటర్ల నుంచీ పాజిటివ్ టాక్ వస్తోంది.
ఇదే రోజున మహేష్ బాబు నటించిన గుంటూరు కారం విడుదల అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక- వెంకటేష్ నటించిన సైంధవ్, అక్కినేని నాగార్జున-అల్లరి నరేష్-రాజ్ తరుణ్ కాంబోలో తెరకెక్కిన నా సామిరంగా 13, 14 తేదీల్లో విడుదల కానున్నాయి.
ఈ సినిమాల రేసులో మెగా కుటుంబం హనుమాన్ మూవీకి సపోర్ట్ చేసింది. తేజా సజ్జాను అభినందిస్తూ ప్రముఖ నిర్మాత, నటుడు నాగబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. ఊహ తెలియని వయసులోనే చూడాలనివుందిలో నటనతో అందరని ఆలరించాడని, అప్పట్లోనే మెగా ఫ్యాన్‌గా కనిపించాడని అన్నారు.

బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడని, అదే పంధాలో హీరోగా మొదటి సినిమా జాంబి రెడ్డితోనే విభిన్న కథనంతో విజయాన్ని సాధించాడని అభినందించారు. మైథలాజికల్ ఫాంటసీ జానర్‌తో వచ్చిన హనుమాన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ట్రైలర్, విజువల్స్‌తోనే ఈ సినిమా విజయం ఖాయమనిపించిందని వ్యాఖ్యానించారు.
హీరోగా చిత్ర పరిశ్రమలో తేజా సజ్జా ప్రయాణం ఎన్నో మైలు రాళ్లను అధిగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్నారు నాగబాబు. హనుమాన్ సినిమా కోసం ఉత్కంఠతగా ఎదరు చూస్తున్నానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications