నాగార్జున అన్నపూర్ణ స్టూడియో విలువ ఎంతో తెలుసా?
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యంత ఖరీదైన, రిచెస్ట్ హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నుంచి వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియోను ప్రస్తుతం ఆయనే నిర్వహిస్తున్నారు. 1976వ సంవత్సరంలో నాగేశ్వరరావు ఈ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఒకప్పుడు తెలుగువారిని కూడా మదరాసీలుగానే పిలిచేవారనే సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషలన్నింటికీ అప్పటి మద్రాసు కేంద్రంగా ఉండేది. అయితే మన తెలుగులో అగ్ర నటులుగా కొనసాగుతున్న తారక రామారావు, నాగేశ్వరరావు మాత్రం అక్కడి నుంచి తెలుగు పరిశ్రమను హైదరాబాద్ తీసుకువచ్చేందుకు కృషిచేశారు.
తెలుగు నటుల పోరాటం
సినిమాలకు సంబంధించిన పరిజ్ఞానం మొత్తం మద్రాసులోనే ఉండేది. అలా కాకుండా తెలుగుకు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంలో తెలుగులోని అగ్ర నటులంతా పోరాటం చేసి 1970లో పరిశ్రమకు హైదరాబాద్ లో పునాది వేశారు. 1973లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చొరవ తీసుకొని పరిశ్రమకు హైదరాబాద్ లో స్థలం కేటాయించారు. దీంతో నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది హైదరాబాద్ నగరం నడిబొడ్డున 22 ఎకరాల స్థలంలో ఉంది. నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైంది.

హైదరాబాద్ అలవాటైంది
క్రమేణా తెలుగు సినిమాలన్నీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోవడానికి అలవాటుపడ్డాయి. చిన్న చిన్నగా ప్రారంభమై చివరకు తెలుగు పరిశ్రమ మొత్తం హైదరాబాద్ కు చేరిపోయింది. కొన్ని దశాబ్దాల నుంచి అన్నపూర్ణ స్టూడియో అవుట్‌డోర్ సెట్‌లు, అంతస్తులు, సెట్ నిర్మాణం, డిజిటల్ ఇంటర్మీడియట్, డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగ్, నియర్ ఫీల్డ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్-లాట్‌లు, డేటా స్టోరేజ్, సౌండ్ ఎఫెక్ట్స్, డబ్బింగ్ , ఎడిటింగ్, డాల్బీ విజన్, హెచ్‌డిఆర్, స్క్రీనింగ్ థియేటర్స్, స్టీరియో... ఇలా ఎన్నో సేవలను అన్నపూర్ణ స్టూడియో అందిస్తోంది. 2011లో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను నాగార్జున ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ స్టూడియో విలువ రూ.750 కోట్లుగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. నాగార్జున ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. దీనిద్వారానే ఆయన వేల కోట్లరూపాయల విలువైన ఆస్తులను కూడబెట్టారు












Click it and Unblock the Notifications