'పోకిరి' సినిమా వదులుకున్న హీరో
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వచ్చిన చిత్రం పోకిరి. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 2006లోనే ఈ సినిమా రూ.70 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, రూ.40 కోట్ల నెట్ ను రాబట్టి రికార్డు సృష్టించింది. మహేష్ బాబు కెరీర్ మొత్తంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోవడమేకాదు.. తిరుగులేని ఇమేజ్ ను, క్రేజ్ ను సాధించి పెట్టింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు మహేష్ బాబు.
ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ
వాస్తవానికి పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథను బద్రి సినిమాకు ముందే రాసుకున్నారు. ఆ సినిమా తీసిని తర్వాత హీరోలు రవితేజ, పవన్ కల్యాణ్.. వీరిద్దరిలో ఒకరితో తీయాలనుకున్నారు. రవితేజను ఖరారుచేసుకొని సినిమా చేద్దామని అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈలోపు తమిళంలో సూపర్ హిట్ అయిన ఆటోగ్రాఫ్ చిత్రం రీమేక్ చేసే అవకాశం వచ్చింది. అద్భుతమైన సినిమా కావడంతో పోకిరిని కాదనుకొని ఆటోగ్రాఫ్ కు సిద్ధమై ఆ సినిమా చేశారు రవితేజ. దీంతో అటుతిరిగి.. ఇటు తిరిగి ఈ కథ చివరకు మహేష్ బాబు వద్దకు చేరింది. అప్పుడు పోకిరికి పూరీ అనుకున్న పేరు ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్యనారాయణ.

సిక్కు బ్యాగ్రౌండ్ ను తీసేయమన్నారు
పంజాబ్ బ్యాగ్రౌండ్ ను తీసేసి స్థానికంగా ఉండే బ్యాగ్రౌండ్ పెట్టమని మహేష్ బాబు సూచించడంతో పూరీ అలాగే చేశారు. తర్వాత సినిమా పట్టాలెక్కింది. హీరోయిన్ గా ముందు ఆయేషా టకియాను అనుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఆమె దీన్ని వదులుకుంది. దీంతో కంగనా రనౌత్ ను అనుకున్నారు. ముంబయిలో గ్యాంగ్ స్టర్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంటే దీంతోపాటు పోకిరి ఆడిషన్స్ కు కూడా హాజరైంది. రెండు సినిమాలకు ఎంపిక కావడంతో పోకిరి వద్దనుకొని గ్యాంగ్ స్టర్ కు ఓటేసింది. దీంతో చివరకు ఇలియానాను తీసుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు - ఇలియానా జంట, వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రవితేజతోకానీ, పవన్ కల్యాణ్ తోకానీ తీసుంటే దానికి నిర్మాతగా నాగబాబును అనుకున్నారు. అయితే వారితో కుదరకపోవడంతో నాగబాబుకు కూడా అవకాశం చేజారింది. రవితేజ ఆటోగ్రాఫ్ చేయడంతో సోనూసూద్ తో తీద్దామని పూరీ అనుకున్నప్పటికీ బాక్సాఫీస్ లెక్కలు కుదరకపోవడంతో మహేష్ బాబు వద్దకే కథ చేరింది. అదృష్టం ఉంటే అలాగే ఉంటుంది.












Click it and Unblock the Notifications