ఆ సినిమా ఎలా ఆడిందో ఇప్పటికీ అర్థం కావడంలేదు!!
తెలుగు సినీ పరిశ్రమలో ఏ సినిమా ఎప్పుడు ఆడుతుందో, ఏ సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవుతుందో ఎవరికీ అర్థం కాదు. కొన్ని కొన్ని విషయాలు చాలా చిత్రంగా జరిగిపోతుంటాయి. ఇలాంటి కోవలోకే వస్తుంది.. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించి రూ.300 కోట్ల వసూల్లు రాబట్టింది. సీనియర్ హీరోల్లో రూ.300 కోట్లు అందుకున్న తొలి హీరోగా వెంకీమామ రికార్డు సృష్టించాడు. దర్శకుడు అనిల్ రావిపూడి దీన్ని కేవలం 72 రోజుల్లో చుట్టేశారు.
డైలాగు, పాట, సరసం
సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాకు కుటుంబ ప్రేక్షకులు మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఎందుకంటే.. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్ తన పాత తరహాలో కుటుంబ కథా చిత్రం చేశారు. సినిమాను దర్శకుడు ఎలా తీర్చిదిద్దాడంటే.. గతంలో మాస్ డైరెక్టర్లు పెద్ద పెద్ద హీరోలకు ఒక పాట, ఒక ఫైట్, ఒక భారీ డైలాగ్ తో సినిమా తీసేవారు. అది హిట్ అయ్యేది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కూడా బుల్లిరాజు డైలాగులు, హీరో డాబా మీదకు వెళ్లి భార్యతో సరసాలు, చిన్న భావోద్వేగం, ఓ పాట, ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లతో డ్రామా... చాలా సింపుల్.. అనిల్ రావిపూడి సినిమాను ఇలాగే తీశాడు. సినిమా కూడా అలాగే ఆడింది.

ఇప్పటికీ సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతుంటారు
మన టైం బాగుంటే పాము కూడా పూలదండై మెడలో పడుతుందన్నట్లుగా గేమ్ ఛేంజర్ తో దాదాపు రోడ్డుమీదకు వచ్చేసిన దిల్ రాజును ఈ సినిమా ఆదుకుంది. కాకపోతే చాలామంది సినీ విశ్లేషకులకు ఇప్పటికీ ఈ సినిమా అలా ఎలా ఆడింది? అంటూ ఆశ్చర్యపోతూనే ఉంటారు. చెప్పుకోవడానికి, గుర్తుంచుకోవడానికి సరైన సన్నివేశం లేకపోయినా సంక్రాంతి సీజన్ కలిసిరావడంతోపాటు వెంకటేష్ ను కుటుంబ ప్రేక్షకులు ఎలా ఇష్టపడతారో అనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో హాస్యాన్ని జోడించి సినిమా తీస్తే వెంకీకి తిరుగుండదు అనేది మరోసారి పరిశ్రమకు తెలిసివచ్చింది.












Click it and Unblock the Notifications