ఈ ఫోటోలో దాగున్న చిరుతను 10 సెకన్లలో గుర్తించగలరా?
ప్రకృతి తన ఒడిలో ఎన్నో వింతలను దాచుకుంటుంది. ముఖ్యంగా 'పర్వతాల ఆత్మ'గా పిలవబడే "మంచు చిరుతపులి (Snow Leopard)"ని చూడటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తాజాగా ఐరిష్ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ డేవిడ్ 'బాజ్' జెంకిన్స్ తీసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మెదడుకు పని చెపుతోంది. మంచు కొండల మధ్య, రాళ్ల రంగులో కలిసిపోయిన ఒక చిరుతపులి ఈ చిత్రంలో దాగి ఉంది. దానిని గుర్తించడం పదునైన చూపు ఉన్నవారికి కూడా ఒక సవాలుగా మారింది.
మైనస్ 4 డిగ్రీల చలిలో రెండు వారాల వేట..
ఈ అరుదైన దృశ్యాన్ని బంధించడానికి 41 ఏళ్ల జెంకిన్స్ సామాన్యమైన కష్టపడలేదు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో మైనస్ 4 డిగ్రీల ఫారెన్‌హీట్ అత్యల్ప ఉష్ణోగ్రతలో, గడ్డకట్టే చలిని తట్టుకుంటూ ఏకధాటిగా రెండు వారాల పాటు నిరీక్షించారు. ఎటువంటి రిమోట్ కెమెరా ట్రాప్‌లు వాడకుండా, నేరుగా తన లెన్స్‌తో ఆ మంచు చిరుతను బంధించడం తన 20 ఏళ్ల కెరీర్‌లోనే అత్యంత కష్టమైన పని అని ఆయన పేర్కొన్నారు.

వైల్డ్‌క్యాట్ కన్జర్వేషన్ సొసైటీ ప్రకారం.. ఈ చిరుతలకు ప్రకృతి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది. వాటి ఒంటిపై ఉండే దట్టమైన బూడిద-తెలుపు బొచ్చు, పర్వతాలలోని రాళ్లు, మంచు రంగుతో ఇట్టే కలిసిపోతుంది. అందుకే వీటిని 'ఘోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్' (పర్వతాల దెయ్యాలు) అని పిలుస్తారు. ఇవి ఎక్కువగా సంధ్యా సమయంలో, తెల్లవారుజామున మాత్రమే వేటకు వస్తాయి. పక్కనే ఉన్నా కంటికి చిక్కని వీటి నైపుణ్యమే వీటిని వేటాడే ఇతర జంతువుల నుండి కాపాడుతుంది.
అంతరించిపోతున్న అపురూప జీవి..
వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (WWF) గణాంకాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేవలం 7,000 కంటే తక్కువ మంచు చిరుతపులులు మాత్రమే అడవుల్లో జీవిస్తున్నాయి. పర్యావరణ మార్పులు, వేటగాళ్ల ముప్పు కారణంగా ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. జెంకిన్స్ తీసిన ఈ ఫోటోలు కేవలం ఒక పజిల్ మాత్రమే కాదు, ఈ అరుదైన జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా మనకు గుర్తు చేస్తున్నాయి.
మీరు గుర్తించారా?
ఈ ఫోటోలో చిరుతను గుర్తించడానికి ప్రయత్నించండి. అది కొండ అంచున ఉన్న రాళ్ల మధ్య నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఒకవేళ మీరు దానిని 10 సెకన్లలోపు గుర్తిస్తే, మీ చూపు నిజంగా డేగ కళ్లంత షార్ప్ అని అర్థం.












Click it and Unblock the Notifications