ఎన్టీఆర్‌ను మైమరిపించేలా 'జూనియర్'
గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ఎంట్రీపై ఆసక్తి మొదట 'వైరల్ వయ్యారి' సాంగ్‌తో పెరిగింది. శ్రీలీల పక్కన కిరీటి కత్తిలా డ్యాన్స్ చేయడంతో, మహేష్ బాబు సైతం మెచ్చుకున్న శ్రీలీలతో సమానంగా అదరగొట్టాడని టాక్ వచ్చింది. ఈ సాంగ్‌తోనే ఆగిపోలేదో, 'జూనియర్' సినిమాతో ఈ 'గాలి' వారసుడు టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే, దాదాపు 13 ఏళ్ల తర్వాత జెనీలియా కూడా ఈ సినిమాతో బలమైన రీఎంట్రీ ఇచ్చింది.
కథ: విజయనగరం నేపథ్యంలోని ఓ ఎమోషనల్ ప్రయాణం ఇది. లేటు వయసులో తల్లిదండ్రులు కాబోతున్న కోదండపాణి (వి. రవిచంద్రన్), శ్యామల దంపతులకు సమాజం నుంచి వెక్కిరింపులు ఎదురవుతాయి. పల్లెటూరు వదిలి వెళ్లే క్రమంలో శ్యామల చనిపోవడంతో, కోదండపాణి తన కొడుకు అభి (కిరీటి రెడ్డి)ని అన్నీ తానై పెంచుతాడు. తండ్రి అతి ప్రేమను బరువుగా భావించే అభి, స్వేచ్ఛ కోసం సిటీకి వచ్చి కాలేజీలో చేరతాడు. అక్కడ స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడి, ఆమె పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ కంపెనీ సీఈఓ విజయ సౌజన్య (జెనీలియా)తో అభికి మొదట విభేదాలు ఉంటాయి. కొన్ని పరిస్థితుల కారణంగా విజయ, తన టీమ్‌తో కలిసి విజయనగరం రావాల్సి వస్తుంది. అసలు ఆ ఊరుతో విజయకు ఉన్న సంబంధం ఏంటి? అభి-విజయల బంధం ఎలా మారుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

బలాలు: ఈ సినిమా టీజర్, ట్రైలర్ రొటీన్‌గా అనిపించినా, అంచనాల్ని దాటి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా, ప్రచార చిత్రాల్లో కనిపించని బలమైన ఎమోషన్ ఈ సినిమాకి ప్రధాన బలం. తండ్రి-కొడుకు, తండ్రి-కూతురు మధ్య సన్నివేశాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం, అక్కడి అభివృద్ధి సీన్లు సినిమా గ్రాఫ్‌ను పెంచాయి. తండ్రి ప్రేమ వెనుక ఉన్న నిజం తెలిశాక హీరోలో వచ్చే మార్పు, క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు అదనపు బలం.
నటన: కిరీటి రెడ్డి డ్యాన్స్ విషయంలో అదరగొట్టేశాడు. 'వైరల్ వయ్యారి' పాటలో శ్రీలీలకు గట్టి పోటీనిచ్చాడు. డ్యాన్సులతో పాటు, ఎమోషనల్ సన్నివేశాల్లోనూ పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. యాక్షన్ సీక్వెన్సుల్లో కూడా చాలా బాగా కనిపించాడు. జూ.ఎన్టీఆర్‌ను అనుకరించినట్లు కొన్నిచోట్ల అనిపిస్తుంది. ఖచ్చితంగా కిరీటి రాబోయే రోజుల్లో ప్రామిసింగ్ హీరో అవుతాడనడంలో సందేహం లేదు. జెనీలియా తన బలమైన పాత్రకు పూర్తి న్యాయం చేసింది, మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకుంది. వి. రవిచంద్రన్ కోదండపాణి పాత్రలో అద్భుతంగా నటించారు. రావు రమేష్, వైవా హర్ష, సత్య, సుమన్ శెట్టి తమ పాత్రల్లో మెప్పించారు. శ్రీలీల పాత్రకు గ్లామర్, డ్యాన్సులకే పరిమితమైంది.
సాంకేతిక వర్గం: దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్లలో డీఎస్పీ బీజీఎం సినిమాకు గొప్ప ఇంపాక్ట్ ఇచ్చింది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపించింది.
ఓవరాల్‌గా చెప్పాలంటే, 'జూనియర్' సినిమాతో 'గాలి' వారసుడు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక డెబ్యూ హీరో సినిమాకి తగ్గట్టుగానే కాకుండా, ఇది ఒక మంచి ఎమోషనల్ రైడ్‌ను అందిస్తుంది.
రేటింగ్: 3/5












Click it and Unblock the Notifications