భారతీయుడు2: గుండెల్లో గునపాన్ని దించిన శంకర్
శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన భారతీయుడు2 చిత్రం ఈరోజు విడుదలైంది. 28 సంవత్సరాల క్రితం భారతీయుడు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అందులోని ప్రతి సన్నివేశం, ప్రతి పాట అద్భుతంగా వచ్చాయి. సంగీతం ఇప్పుడు వింటున్నా కొత్తగానే అనిపిస్తుంది. అంతటి మ్యాజిక్ ను ఆ చిత్రం చేసింది. కానీ భారతీయుడు2 మాత్రం అటువంటి వేవీ చేయలేకపోయింది. పాటలు బాగోలేదు. సంగీతం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. జైలర్ కు సంగీతం ఇచ్చిన అనిరుధ్ దీనికి సంగీతం ఇచ్చాడా? అని ఆశ్చర్యపోవడమే.
లైవ్ లోనే చంపేస్తుంటాడు..
భారీగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. సినిమా చూసినవారంతా సోషల్ మీడియాద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. అందరూ 1.5, 2, 2.25కు మించి ఎవరూ ఇవ్వడంలేదు. కమల్ సినిమా మొదలైన అరగంట వరకు రాడు. వచ్చిన తర్వాత సేనాపతి వచ్చాడనే భావన ప్రేక్షకుల్లో కలగలేదు. రకరకాల గెటప్పుల్లో వచ్చి అవినీతికి పాల్పడేవారిని కమల్ చంపుతుంటాడు. ఈ సినిమాలో అంతకుమించిన వేరే పని కూడా హీరోకు లేకుండా చేశాడు శంకర్. ఈ సినిమాలో మర్మకళను ఇష్టం వచ్చినట్లు దర్శకుడు ఉపయోగించారు.

భారతీయుడు పరువు తీశారు
శంకర్ సినిమాల్లో ఉండే ఎమోషన్ కూడా లేదు. సినిమా కథను రెండు భాగాలుగా కాకుండా ఒక భాగంలోనే చెబితే బాగుండేది. పార్ట్ 3 కోసం పార్ట్ 2 తీసినట్లుగా అనిపిస్తోంది. సినిమా చూసే ప్రేక్షకులకు ఎక్కడా సినిమా చూడాలనే ఆసక్తే కలగదు. కమల్ కంటే బాగా నటించాలని సిద్ధార్థ్ తాపత్రయపడ్డాడేకానీ ఆయన ముందు ఈయన నటన ఎంత?. సూర్య.. ఇలా కనపడి అలా మాయమయ్యాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర సహాయపాత్రకు తక్కువ అన్నట్లుగా ఉంది.
హీరోను పట్టుకోవడానికి బాబీసింహా ప్రయత్నించి విఫలమవుతుంటాడు. లైవ్ లో కమల్ అందరినీ చంపేస్తుంటే సీబీఐ గుడ్లప్పగించి చూస్తుంటుంది. వేలమంది జూనియర్ ఆర్టిస్టులను పెట్టి భారీగా సన్నివేశాలు తీశాడు. ఖర్చు దేనికి పెట్టారు? ఎంత పెట్టారు? అన్న ప్రశ్నలకు శంకర్ దగ్గర కూడా సమాధానం ఉండదు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. అద్భుతమైన కళాఖండం లాంటి సినిమాకు సీక్వెల్ అని ఆ సినిమాకు ఉన్న పేరును చెడగొట్టారు.












Click it and Unblock the Notifications