చెప్పు తీసుకు కొడతా... తమాషాగా ఉందా: స్టార్ హీరోపై ఖుష్‌బూ ఫైర్
ప్రముఖ సీనియర్ నటి ఖుష్ బూ గురించి దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో కూడా తెలియనివారుండరు. తెలుగు పరిశ్రమకు కలియుగ పాండవులు సినిమాద్వారా పరిచయం అయింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటించారు. వెంకీ మొదటి చిత్రం కూడా ఇదే. క్రమేణా హీరోయిన్ పాత్రల తర్వాత తల్లి, వదిన, అక్క పాత్రలు చేయడం ప్రారంభించింది. ఇటీవలే కొంతకాలం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించింది. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న ఖుష్ బూ సమాజంలో జరుగుతున్న అరాచకాలను, మహిళలపై జరిగే ఆకృత్యాలను తరుచుగా ప్రశ్నిస్తుంటారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తుంటారు.
నాకు ఏదైనా ఛాన్స్ ఉంద? అని అడిగాడు
గోవాలోని పణాజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) వేడుక జరుగుతోంది. తొలిరోజు కార్యక్రమానికి ఖుష్ బూ హాజరై సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ గురించి మాట్లాడారు. మహిళలకు ఇబ్బందులు లేని రంగమంటూ ఏదీ లేదన్నారు. దీన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ రంగంలో హీరోయిన్ గా తనకు ఎదురైన చేదు అనుభవాలను ఖుష్ బూ వివరించారు. ఓరోజు సినిమా షూటింగ్ లో భాగంగా సెట్ లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో తన దగ్గరకు వచ్చి 'నాకు ఏదైనా ఛాన్స్ ఉందా?' అని అడిగాడు. వెంటనే తాను తన చెప్పుల సైజు 41 అని, సెట్ లోనే నీ చెంప పగలగొట్టనా? లేదంటే అందరిముందు పగలగొట్టమంటావా? అని అడగాను. ఆ తర్వాత అతనేమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడని ఖుష్ బూ చెప్పింది.

సమానత్వం విషయంలో రాజీపడకూడదు
సినీ పరిశ్రమద్వారా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో తాను ఈ రంగాన్ని ఎంచుకున్నానని, మహిళలకు గౌరవం దక్కే విషయంలో, పురుషులతో సమానంగా సమానత్వం లభించే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదు అనేదే తన సిద్ధాంతం అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఖుష్ బూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ హీరో ఎవరా? అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఏ సమయంలో జరిగింది? ఏ సినిమా షూటింగ్ సమయంలో? తెలుగు, తమిళమా? లేదంటే ఇతర భాషల్లోనా? అనే ప్రశ్నలు నెటిజన్లు వేస్తున్నారు. సినీ రంగంలో మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయని, కాస్టింగ్ కౌచ్ ఉందంటూ మళయాళ పరిశ్రమలో హేమ కమిటీ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అనేక సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఎక్కువగా మళయాళ పరిశ్రమకు సంబంధించిన కాస్టింగ్ కౌచ్ విషయాలే వెల్లడవుతున్నాయి. ఇటువంటివి ఇతర భాషల్లోను ఉన్నాయనేది హీరోయిన్ల ఆరోపణ.












Click it and Unblock the Notifications