'పుష్ప2': తుసుక్ మనిపించిన 'కిస్సిక్' సాంగ్?
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప2'. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో 11,500 స్క్రీన్లలో విడుదల కాబోతోంది. మైత్రీమూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలందించారు. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. సుకుమార్ సినిమా అనగానే కచ్చితంగా ప్రత్యేక గీతం ఉంటుంది. పుష్ప1లో సమంత నటించిన ఊ అంటావా మావా పాట దేశాన్ని ఓ ఊపు ఊపేసిందని చెప్పొచ్చు. సమంత హావభావాలు కూడా ఆ పాటకు బాగా కలిసివచ్చాయి. అలాగే 'పుష్ప2'లో ఐటం సాంగ్ శ్రీలీలతో చేయించారు.
24 గంటల వ్యవధిలో 42 మిలియన్ల వ్యూస్
కిస్సిక్ సాంగ్ పేరుతో ఈ పాట ట్రెండింగ్ లో నిలుస్తోందికానీ అనుకున్నంతస్థాయిలో హిట్ కాలేదని సినీ విశ్లేషకులు, సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. ఊ అంటావా మావా పాట 'వైల్డ్ ఫైర్' అయితే 'కిస్సిక్' పాట కేవలం 'ఫైర్' మాత్రమేనని, పుష్ప1లోని ఐటంసాంగ్ కు పుష్ప2లోని ఐటంసాంగ్ దరిదాపుల్లో కూడా లేదనే అభిప్రాయం నెటిజన్ల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఈ పాటకు వచ్చిన స్పందన అంతంతమాత్రంగానే ఉంది. చెన్నైలో జరిగిన వేడుకలో దేవిశ్రీప్రసాద్ పరోక్షంగా ఫైరయ్యాడుకానీ పాటలో మాత్రం ప్రత్యక్షంగా ఫైర్ కనపడటంలేదంటున్నారు. పుష్ప1 ఘనవిజయం సాధించడంలో ఊ అంటావా మావా పాటది కీలక పాత్ర. సినిమా అంతా ఒక ఎత్తు.. ఆ పాట ఒకటే మరో ఎత్తు. ప్రస్తుతం విడుదలైన కిస్సిక్ లిరికల్ వీడియో 24 గంటల వ్యవధిలో 42 మిలియన్ల వ్యూస్ రాబట్టి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించింది. దీనికి ముందు దళపతి విజయ్ నటించిన గోట్ సినిమాలోని విజిల్ పోడు పాటమీద రికార్డు ఉండేది. అది 24 గంటల వ్యవధిలో 40 మిలియన్లలోపు వ్యూస్ ను రాబట్టింది.

అంచనాలను అందుకోలేకపోయిన చంద్రబోస్ సాహిత్యం
చంద్రబోస్ సాహిత్యం అంచనాలను అందుకోలేకపోయిందనే అభిప్రాయం అల్లు అర్జున్ అభిమానుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. సమంత చేసిన పాట స్థాయిలో నృత్యాలు లేవని, సాహిత్యం లేదని, కిస్సిక్ నుంచి ఊ అంటావా మావా స్థాయి డ్యాన్స్ కానీ, సాహిత్యంకానీ ఊహించలేము. ఎంతో సమయం తీసుకొని కూడా సుకుమార్, చంద్రబోస్ ఎందుకు బలమైన సాహిత్యాన్ని, బలమైన సంగీతాన్ని అందించలేకపోయారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. సుకుమార్ సినిమా అనగానే ప్రతి ప్రేక్షకులు ఎంతో ఎక్కువగా స్పెషల్ సాంగ్ ను ఎక్స్ పెక్ట్ చేస్తాడు. తన ప్రతి సినిమా విజయానికి స్పెషల్ సాంగ్స్ ఎంతో దోహదపడ్డాయి. కిస్సిక్ సాంగ్ పూర్తిగా చూసిన తర్వాత ఏమైనా నచ్చుతుందేమో చూడాలని అభిమానులు అంటున్నారు.












Click it and Unblock the Notifications