గుంటూరు కారం రివ్యూ: ఇది తీసింది త్రివిక్రమేనా.. డౌటే!?
10 సంవత్సరాల వయసులో తల్లికి దూరమై.. అత్తయ్య (ఈశ్వరి రావు) దగ్గర ఎంతో ప్రేమతో పెరుగుతాడు వెంకట రమణ (మహేష్ బాబు). గుంటూరులో మిర్చి బిజినెస్ చేసుకుంటూ తన పని తాను చూసుకుంటుండేవాడు. అయితే వెంకటస్వామి (ప్రకాష్ రాజ్) రమణను హైదరాబాద్ పిలిపించి తల్లికి కానీ తల్లి ఆస్తికి కానీ ఎలాంటి సంబంధం లేదని.. అలా ఒప్పుకుంటూ సంతకం చేయమని కోరతాడు. దీనికి రమణ మండిపడతాడు. తాతయ్య వెంకటస్వామి & తల్లి వసుంధర (రమ్యకృష్ణ)పై యుద్ధం ప్రకటిస్తాడు. స్థూలంగా ఇదీ కథ.
Recommended Video

గుంటూరు కారంలో మహేష్ బాబులోని కొత్త కోణం బయటపడతుంది. అతని ఎనర్జీని చూసి అభిమానులు ఎంతో సంతోషపడతారని చెప్పొచ్చు. గుంటూరు యాసలో చెప్పే డైలాగులు, డ్యాన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. శ్రీలీల ప్రతి సినిమాలో చేసినట్లుగానే ఈ సినిమాలోను డ్యాన్స్ లకే పరిమితమైంది. గ్లామర్ గా కనపడినప్పటికీ ఎందుకో శ్రీలల ఎలివేట్ అవ్వలేదు. మీనాక్షి చౌదరి సహాయపాత్రలు పోషించే నటిలా మిగిలిపోయింది. ప్రకాష్ రాజ్ నటన ఎందుకో అసహజంగా అనిపించింది.. ఆకట్టుకోలేకపోయాడు. జయరాం, రమ్యకృష్ణ, ఈశ్వరి రావు, మురళీశర్మ, జగపతిబాబు, రావు రమేష్, అజయ్ ఘోష్ తదితరులంతా తమ పాత్రల్లో జీవించారు. వెన్నెల కిషోర్ తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు.

తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అత్యంత పెద్ద మైనస్. మిక్సింగ్ అసలు కుదరలేదు. కొన్నిచోట్ల డైలాగులు వినిపించలేదు. రెండు పాటలు మినహా అతను సంగీత దర్శకుడు అనే పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. సినిమాటోగ్రాఫర్లు పి.ఎస్.వినోద్ & మనోజ్ పరమహంస మాత్రం అద్భుతమైన పనితీరును కనపరిచారు. మహేష్ బాబును అందంగా చూపించడంలో విజయం సాధించారు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, డి.ఐ వంటి విషయాల్లో నిర్మాణ సంస్థ ఎక్కడా రాజీపడకుండా ఖర్చుపెట్టింది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెత్త పనితీరుతో నిర్మించిన సినిమాల్లో గుంటూరు కారం కూడా ఒకటి అని చెప్పొచ్చు. రచయితగా, దర్శకుడిగా ఆయనకు ప్రజలపై గౌరవం లేదని అర్థమవుతోంది. ఎందుకంటే కొన్ని సన్నివేశాల్లో.. కొన్ని సందర్భాల్లో ఆయన రాసిన మాటలు అట్లావున్నాయి. ఈ సినిమాను తీసింది త్రివిక్రమ్ శ్రీనివాసేనా? లేదంటే ఎవరైనా తీశారా? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. తన స్థాయిని తగ్గించుకొని ఇరికించిన డైలాగులు, ఇమిటేషన్లు గుంటూరు కారంకు పెద్ద మైనస్. పతాక సన్నివేశాల్లో మహేష్ & రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశంలో మాత్రం తనను తాను నిరూపించుకున్నాడు.

మహేష్ బాబు చరిష్మాతోపాటు ఆయన ఎనర్జీని మాత్రమే ఆశించి సినిమాకు వెళితే పర్వాలేదు. అలాకాకుండా ఏది ఆశించినా అదిమాత్రం సినిమాలో కనపడదు. సంక్రాంతి హడావిడి ఉంటుంది కాబట్టి కమర్షియల్ గా ఈ సినిమా సేఫ్ జోన్ లో ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత రావడంలేదు. ఒకరకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ బాబు అభిమానులకు మాత్రం ఈ సినిమా తీవ్ర నిరాశ కలిగిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలయ్యేంతవరకు దీనిపై వచ్చినన్ని వార్తలు ఏ సినిమాపై రాలేదు. అందుకు తగ్గట్లుగానే త్రివిక్రమ్ పనితీరు ఉందని సినిమాను చూస్తే అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications