మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హాలీవుడ్ మూవీ మధ్యలోనే ఆగిపోవడానికి కారణం అదే ?
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చి, కేవలం తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగి.. ఎందరికో ఆదర్శనీయంగా మారారు. ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి.. తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఆయన మొత్తం 155 చిత్రాల్లో నటించిన ఆయన.. ప్రస్తుతం విశ్వంభర, మన శంకర వరప్రసాద్ సినిమాల్లో నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, మెగా అభిమానులు ఆయనకు సోషల్‌మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్.. ఓ హాలీవుడ్ మూవీని చేస్తూ పలు వివాదాల కారణంగా మధ్యలోనే ఆపారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సినిమా ఏంటి ? అ వివాదం ఏంటో తెలుసుకుందాం..

అబు బాగ్దాద్ గజదొంగ..
1990లలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో ప్రారంభమైన చిత్రం "అబూ బాగ్దాద్ గజదొంగ". "థీఫ్ ఆఫ్ బాగ్దాద్" కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్ కీలక పాత్ర పోషించగా, అమెరికన్ మోడల్, నటి సాషా కథానాయికగా నటించారు. భాషా మూవీ డైరెక్టర్ సురేష్ కృష్ణ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను డైరెక్ట్ చేయగా.. ఇంగ్లీష్ వెర్షన్ ను డౌచన్ గిర్సీ అనే హాలీవుడ్ దర్శకడు చేసారు. ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాల్సింది.
సినిమా కథాంశం..
ఈ సినిమాలో చిరంజీవి ఫారుక్ అనే బాగ్దాద్ యువరాజు పాత్రలో నటించారు. చెడు కమాండర్ హుస్సేన్ చేతిలో చనిపోయినట్లు భావించబడిన ఫారుక్‌ను, అబ్రహం అనే వ్యక్తి రక్షించి, అబూ అనే రోబిన్ హుడ్ తరహా దొంగగా పెంచుతాడు. అబూ తన స్నేహితుడు అలీతో కలిసి బాగ్దాద్‌లో దొంగతనాలు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడి, చివరికి దుర్మార్గపు వజీర్‌ను ఓడించి సుల్తాన్ కుమారుడిగా తన నిజమైన గుర్తింపును పొందుతాడు.

వివాదాలు, ప్రాజెక్ట్ నిలిపివేత..
అయితే 25 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా అనేక వివాదాల కారణంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో పవిత్ర ఖురాన్ పుస్తకాలను తెరపై చూపించడం ముస్లిం సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలానే సినిమా పోస్టర్‌లో హిందూ పురాణాల ప్రకారం సూర్యభగవాన్‌కు ఏడు గుర్రాలు ఉండగా, తొమ్మిది గుర్రాలను చూపించడం హిందూ మతస్థుల ఆగ్రహానికి కారణమైంది. ఈ వివాదాలు ప్రాజెక్ట్‌ను మధ్యలోనే ఆపేయడానికి దారితీశాయి.












Click it and Unblock the Notifications