'తండేల్' ఫస్ట్ రివ్యూ: బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతరే!
గీతా ఆర్ట్స్ రెండో బ్యానరు జీఏ2 పతాకంపై అల్లు అరవింద్, బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండేల్. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథతో దీన్ని చందు మొండేటి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, నేచులర్ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించి ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో నెంబరు 1 స్థానంలో నిలిచాయి. తండేల్ కచ్చితంగా నాగచైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయల గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకంగా షో వేసిన చిత్ర యూనిట్
ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో వేసుకొని నిర్మాత అల్లు అరవింద్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బన్నీ వాసు వెల్లడించారు. సినిమాకు వందకు వంద శాతం మార్కులిచ్చారని, ఆయన ఇలా సర్టిఫికెట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విటర్ లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తుందని, బాక్సాఫీస్ దగ్గర రాజులమ్మ జాతర అంటూ శ్రీకాకుళం యాసలో రాసుకొచ్చారు. దుల్లగొట్టేస్తుందంటే అదరగొట్టేస్తుందనే అర్థం వస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి పోటీపడి మరీ అద్భుతంగా నటించారని, వారిద్దరికీ ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోనుందన్నారు.

అల్లు అరవింద్ నుంచి ఇలాంటి సర్టిఫికెట్ రావడం విశేషమే
అల్లు అరవింద్ నుంచి ఇలాంటి సర్టిఫికెట్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. వాస్తవానికి సినిమాకు బడ్జెట్ పెట్టాలంటే ఒకటికి వందసార్లు అల్లు అరవింద్ ఆలోచిస్తారు. అటువంటిది ఈ సినిమాపై భారీగా ఖర్చుపెట్టారంటే సబ్జెక్టుపై ఆయనకు బాగా నమ్మకం ఉందని అర్థమవుతోందంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంటున్నారు. తండేల్ అంటే లీడర్ అనే అర్థం వస్తుంది. అలాగే గుజరాతీ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని అర్థం. ఈ సినిమాలో నాగచైతన్య జాలరిగా నటిస్తున్నాడు. కథకు సరిపోయేలా తండేల్ పేరు పెట్టామని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. ఈ సినిమా కోసం మత్స్యకారులు ఎలా ఉంటారు? వారు ఎలా పనిచేస్తారు? వారి జీవన విధానం ఎలా ఉంటుంది? తదితర విషయాలన్నింటినీ నాగచైతన్య దగ్గరుండి నేర్చుకున్నాడు.












Click it and Unblock the Notifications