బాలయ్య వదులుకున్న టాప్-5 ఇండస్ట్రీ హిట్స్
సినిమా కథను తయారుచేసుకునే సమయంలో రచయిత, దర్శకుడు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుంటారు. కొంతమంది రచయితలు, దర్శకులు మాత్రం కథను పూర్తిగా సిద్ధం చేసుకొని ఆ కథకు ఏ హీరో సరిపోతారా? అని ఆలోచించి ఎంపిక చేసుకుంటారు. ఇలా కథలను తయారుచేసుకున్న తర్వాత సదరు హీరోల దగ్గరకు వెళితే వారు ఖాళీగా లేకపోవడం, కథ నచ్చకపోవడం, లేదంటే మరే ఇతర కారణాలవల్లో ఆ కథలను తిరస్కరిస్తారు. దీంతో ఆ దర్శకుడు మరో హీరో దగ్గరకు వెళతారు. ఇలా కొన్ని కథలు నందమూరి బాలకృష్ణ దగ్గరకు రాగా.. కొన్ని ఆయనకు నచ్చక, మరికొన్ని ఖాళీలేక వదులుకున్నారు. అవన్నీ ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం విశేషం. ఆయన వదులుకున్న బ్లాక్ బస్టర్లు ఏమిటనేవి తెలుసుకుందాం.
సింహాద్రి
రాజమౌళి ఈ సినిమాను బాలయ్యతో చేయాలనుకున్నారు. అయితే బి.గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు సినిమా చేయడానికి బాలయ్య మొగ్గుచూపారు. దీంతో ఈ సినిమా తారక్ తో తెరకెక్కి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

చంటి
ఈ సినిమా తమిళంలో పి.వాసు దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్యతో రీమేక్ చేయాలని పరుచూరి సోదరులు భావించారు. బాలకృష్ణకు కథ చెప్పినప్పటికీ నచ్చలేదు. తర్వాత రాజశేఖర్ అనుకున్నారుకానీ చివరకు వెంకటేష్ హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
జానకి రాముడు
కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని బాలకృష్ణ అనుకున్నారు. అనుకోని కారణాలతో కోడి ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కథ రాఘవేంద్రరావు దగ్గరకు చేరింది. కోడి రామకృష్ణ తప్పుకోవడంతో సినిమా వద్దనుకున్నారు బాలయ్య. చివరకు రాఘవేంద్రరావు నాగార్జున-విజయశాంతితో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టారు. కోడి రామకృష్ణ చేయాలనుకున్నప్పుడు కూడా హీరోయిన్ గా విజయశాంతినే అనుకున్నారు.
సింహరాశి
దర్శకుడు సముద్ర ఈ సినిమాను బాలకృష్ణతో చేయాలనుకున్నారు. అయితే ఆయన రీమేక్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో రాజశేఖర్ తో తెరకెక్కింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాగా నిలిచింది.
క్రాక్
మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ముందుగా హీరోగా బాలయ్యను అనుకొని దర్శకుడు కథను చెప్పారు. అయితే ఈ తరహా రొటీన్ యాక్షన్ సినిమాలు చేసివుండటంతో సున్నితంగా తిరస్కరించారు. రవితేజతో తెరకెక్కి సూపర్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. కరోనా సమయంలో మంచి బ్లాక్ బస్టర్ గా పేరు తెచ్చుకుంది.












Click it and Unblock the Notifications