Bhagavanth kesari review: 'భగవంత్ కేసరి' రివ్యూ... బాలయ్య మెప్పించాడా?
నటీనటులు: బాలకృష్ణ, కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్, శరత్ కుమార్, రఘుబాబు, జాన్ విజయ్, గణేష్ తదితరులు
సంగీతం: తమన్
నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
రచన, దర్శకత్వం అనిల్ రావిపూడి
బ్యానర్: షైన్ స్క్రీన్స్
కథ
బాలయ్య నుంచి సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి కూడా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. యాక్షన్ తో కామెడీని మిక్స్ చేసి కథను నడిపించడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి ఎలా ఉందో చూద్దాం.

నేలకొండ భగవంత్ కేసరి అడవి బిడ్డ. ఓ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో శరత్ కుమార్ (జైలర్) కూతురు విజయలక్ష్మి అలియాస్ విజ్జిపాప (శ్రీలీల) తో అనుబంధం ఏర్పడుతుంది. తనను ఆర్మీలో చేర్చాలనేది తండ్రి కల. అనుకోకుండా జైలర్ మరణించడంతో విజ్జిపాప బాధ్యతలు కేసరి తీసుకుంటాడు. ఆమెను ఓ సింహంలా తయారు చేయాలనుకుంటాడు. ఆ ప్రయత్నం ఎలా సాగింది? సైకాలజిస్టు కాత్యాయని(కాజల్ అగర్వాల్) ఎలా సాయం చేసింది? కేసరి ఎందుకు జైలుకు వెళ్లాడు? ఆయన గతమేంటి? బిలియనీర్ రాహుల్ సాంఘ్వీతో ఉన్న వైరం ఏమిటనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
యువ దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరితో ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఆడపిల్లను సింహంలా తయారు చేయాలనే విషయాన్ని బాలకృష్ణ లాంటి అగ్ర కథానాయకుడిద్వారా చెప్పించారు. నేటి సమాజానికి చాలా అవసరమైన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాన్ని టచ్ చేస్తూ సాగుతుంది. ఇటువంటి విషయాలు అగ్ర హీరోల సినిమాలతో చర్చకొస్తే వాటి ప్రభావం వేరుగా ఉంటుంది. ఈ విషయంలో బాలయ్యను అభినందించాల్సిందే. సందేశాలకే పరిమితం కాకుండా కుటుంబ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలు బాగా పండాయి. బాలయ్య, శ్రీలీల కలిసినప్పటినుంచి కథ స్పీడ్ గా వెళుతుంది. వీరిద్దరూ చిచ్చా.. బిడ్డా అంటూ బాగా సందడి చేశారు.
ఆలోచింప చేస్తాయి
కుటుంబ కథగా ప్రారంభమై యాక్షన్ డోస్ పెంచుతూ వెళ్లారు. అడవిలో ఊచకోత గురించి చెప్పే సన్నివేశాలు, విశ్రాంతికి ముందు వచ్చే పోరాటాలు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. కేసరికి, విజ్జీ పాపకు మధ్య భావోద్వేగాలు సినిమాకు ప్రధాన బలం. సినిమాలో సంభాషణలు ఆలోచింపచేస్తాయి. బాలకృష్ణ సినిమాలకు భిన్నంగా బలమైన సందేశం, భావోద్వేగాలతో దీన్ని రూపొందించారు.

ఎవరెలా చేశారంటే..
బాలయ్య నటన, లుక్ సినిమాకు హైలైట్. తెలంగాణ యాసలో ఆయన చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. గత సినిమాల్లా కాకుండా ఈ సినిమాల్లోని ఫైట్లు సహజంగా ఉంటాయి. శ్రీలీల.. తనకు దక్కిన మంచి అవకాశాన్ని వినియోగించుకుంది. భావోద్వేగాన్ని పండించేటప్పుడు, యాక్షన్ సన్నివేశాల్లో ఆమె ఎంతో ప్రతిభ చూపింది. క్లైమాక్స్ లో అయితే ఇంకో రేంజ్ లో చేసింది. అర్జున్ రాంపాల్ నటన కూడా మెప్పిస్తుంది.
రొటీన్ కు భిన్నంగా..
హీరో-హీరోయిన్ అనగానే మసాలా పాటలు గుర్తొస్తాయి. కానీ కథలో భాగంగానే పాటలు, ఫైట్లు తీసుకొచ్చారు. కెమెరా, సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ తదితర సాంకేతిక విభాలన్నీ బాగా పనిచేశాయి. అనిల్ రావిపూడిరచన మెప్పిస్తుంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications