మరో అర్జున్ రెడ్డి సినిమా వచ్చేసింది.. బోల్డ్ అండ్ ఎమోషనల్ డ్రామా..!
కొత్త నటీనటులు, వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'నిలవే'. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ సినిమా, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో 'అర్జున్ రెడ్డి' వంటి చిత్రాలతో పోలికలు తెచ్చుకుని భారీ ఆసక్తిని రేకెత్తించింది. మరి ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో విశ్లేషిద్దాం.
కథ
అర్జున్ (సౌమిత్ రావు) ఒక అనాథ. కెరీర్ పరంగా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా రాణిస్తున్నప్పటికీ, జీవితంలో ఒక తోడు లేదనే వెలితి అతడిని కుంగదీస్తుంది. తీవ్రమైన డిప్రెషన్‌తో ఆత్మహత్యకు సిద్ధపడిన తరుణంలో, అతడి జీవితంలోకి అతిథి (శ్రేయాసి సేన్) ప్రవేశిస్తుంది. అతిథి రాకతో అర్జున్ జీవితం మారుతుంది, వీరిద్దరూ శారీరకంగా దగ్గరవుతారు. కానీ, అర్జున్ ప్రేమను అంగీకరించడానికి అతిథి నిరాకరిస్తుంది. అసలు ఆమె గతం ఏమిటి? అర్జున్ తన కన్న కలలను సాకారం చేసుకున్నాడా? వీరిద్దరూ ఎలా ఒక్కటయ్యారు? అనేదే ఈ చిత్ర కథాంశం.

విశ్లేషణ
దర్శకులు సౌమిత్ రావు, సాయి వెన్నం ఒక సున్నితమైన ప్రేమకథను సంగీతంతో ముడిపెట్టి ఆవిష్కరించిన తీరు బాగుంది. సినిమా ప్రారంభంలో హీరో ఆత్మహత్యాయత్నం చేసే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉండి, ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్తాయి. హీరో-హీరోయిన్ల మధ్య పరిచయం, రొమాంటిక్ సన్నివేశాలు సహజంగా సాగుతాయి.సెకండాఫ్‌లో ఎమోషన్స్ డోస్ పెరుగుతుంది. హీరోయిన్ ప్లాష్‌బ్యాక్ సినిమాకు బలంగా నిలిచింది. అయితే, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది.
నటీనటుల ప్రతిభ
సౌమిత్ రావు తొలి సినిమా అయినా ఎక్కడా తడబడకుండా అర్జున్ పాత్రలో అద్భుతంగా నటించాడు. డ్యాన్స్‌లు, ఎమోషనల్ సీన్స్‌లో పరిణితి చూపించాడు. అతిథి పాత్రలో శ్రేయాసి ఒదిగిపోయింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగడంతో నటనకు మంచి స్కోప్ లభించింది.వైవా హర్ష హీరో స్నేహితుడిగా తనదైన శైలిలో నవ్వులు పూయించాడు.
సాంకేతిక విభాగం
కళ్యాణ్ నాయక్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలు వినసొంపుగా ఉండి, కథలోని మూడ్‌ను ఎలివేట్ చేశాయి. దిలీప్ కుమార్ విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చిత్రీకరించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.
ముగింపు
"నిలవే" చిత్రం కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు, ఒంటరితనంతో బాధపడే మనసులకు ఇచ్చే ఒక భరోసా. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్ : 2.75/5












Click it and Unblock the Notifications