వావ్.. వాట్ ఎ సర్ ప్రైజ్: విజయ్- రష్మికకు ఏకంగా ప్రధాని మోదీ నుంచి..!!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు మొదలయ్యాయి. గురువారం నాడు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వారిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. వివాహ సందడి ఆరంభమైంది. సంగీత్, హల్దీ పంక్షన్లు జరుగుతున్నాయి. 26న సంప్రదాయబద్ధంగా రష్మిక మందన్న మెడలో తాళి కట్టనున్నాడు విజయ్. విజయ్ దేవరకొండ ఈ వివాహ వేడుకను పూర్తిగా ప్రైవేట్‌గా ఉంచుతున్నాడు. తమ ప్రైవసీకి ఎటువంటి భంగాన్ని కలిగించడం, కమర్షియల్ గా మార్చడానికి కాబోయే దంపతులిద్దరు ఎంతమాత్రం సుముఖంగా లేరు.
ఈ పరిణామాల మధ్య విజయ్ దేవరకొండ- రష్మికకు సర్ ప్రైజ్ అందింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు కుటుంబాలను అభినందిస్తూ ఓ మెసేజీని పంపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, గోవర్ధన్ రావులను ఉద్దేశించి ఈ మెసేజ్ చేశారు ప్రధాని మోదీ. ఈ వివాహానికి ఆహ్వానం అందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భంలో వధూవరుల కుటుంబాలను ఆయన హృదయపూర్వకంగా అభినందించారు.

"ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్, రష్మికల వివాహానికి నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఈ ఆనందకరమైన, పవిత్రమైన సందర్భంలో దేవరకొండ, మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు." అని మోదీ పేర్కొన్నారు. ఈ వివాహాన్ని ఓ ముఖ్య ఘట్టంగా అభివర్ణించారు. "ఇది విజయ్, రష్మికల జీవితాల్లో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది. 'సఖ సప్తపద భావ' స్ఫూర్తితో అంటే కలిసి ఏడు అడుగులు నడిచి, ఈ జంట జీవితాంతం స్నేహితులుగా మారతారు," అని వ్యాఖ్యానించారు.
"విజయ్, రష్మికలకు వారి సినిమాల్లో స్క్రిప్ట్‌లు కొత్తేమీ కాదు. ప్రేమ, ఆప్యాయతలతో నిండిన వారి నిజ జీవితంలోని ఈ దైవిక స్క్రిప్టెడ్ అధ్యాయం, వెండితెరపై వారు సృష్టించిన మాయాజాలాన్ని ఖచ్చితంగా మించిపోతుంది.." అని మోదీ అన్నారు. నవదంపతులకు పరిపూర్ణమైన భవిష్యత్తును ఆకాంక్షించారు. వారి జీవితం పంచుకున్న కలలు, ఆశయాల నెరవేర్పుతో నిండి ఉండాలని ఆశీర్వదించారు. ప్రేమ, ఆలోచనతో బాధ్యతలను పంచుకోవాలని సూచించారు.
"మున్ముందు రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలు పంచుకున్న కలలు, వాటి నెరవేర్పుతో నిండిపోవాలి. ఆలోచనాత్మకత, ప్రేమతో, వారు బాధ్యతలను పంచుకోవాలి, ఒకరి లోపాలను మరొకరు అంగీకరించాలి, ఒకరి బలాబలాల నుండి నేర్చుకోవాలి, నిజమైన భాగస్వాములుగా జీవితంలో ప్రయాణించాలి.. " అని మోదీ చెప్పారు. "ఈ శుభ సందర్భంగా వధూవరులకు, కుటుంబాలకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు." అని ముగించారు.












Click it and Unblock the Notifications