నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !!
టాలీవుడ్‌లో సంచలనం రేపిన భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాత, Sunil Narang కు చెందిన కార్యాలయంలో కోటి రూపాయలకు పైగా నిధులు అక్రమంగా మళ్లించిన ఘటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన అకౌంటెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని సునీల్ నారంగ్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. సంస్థలోని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు, డిస్ట్రిబ్యూటర్ల చెల్లింపులు, చెక్కుల జారీ వంటి బాధ్యతలు అతని చేతుల్లో ఉండటంతో యాజమాన్యం పూర్తి నమ్మకం ఉంచింది. ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకున్న విశ్వనాథ్, పద్ధతిగా మోసానికి పాల్పడ్డాడు. నకిలీ పేర్లతో పలు బోగస్ బ్యాంక్ ఖాతాలు సృష్టించారు.

అసలు లావాదేవీలతో పాటు వాటికి సంబంధించిన చెక్కులను కూడా సిద్ధం చేసి, వాటిపై Sunil Narang సంతకాలు తీసుకునేవాడు. ఆ తర్వాత ఆ డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకునేవాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు ఎవరికి అనుమానం రాకుండా ఈ మోసం కొనసాగించాడు. 2024లో జరిగిన వార్షిక ఆడిట్ సమయంలో లెక్కల్లో తేడాలు బయటపడటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
దీంతో సునీల్ నారంగ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని ట్రాక్ చేసి, కొంతకాలం పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు మోసాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. అతడి నుంచి కొంత మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మిగిలిన డబ్బు ఎక్కడికి మళ్లించాడన్న దానిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. అవసరమైతే ఈ కేసులో మరిన్ని వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇక Sunil Narang టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగానే కాకుండా, ఎగ్జిబిటర్‌గా కూడా మంచి పేరు సంపాదించారు. ఏషియన్ సినిమాస్ ద్వారా పలువురు హీరోలతో కలిసి హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతిని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఘటన నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఆర్థిక వ్యవహారాల పట్ల మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications