అన్నపూర్ణ స్టూడియోలో 'పుష్ప2' షో... టాక్ ఏంటంటే?
పడుతూ లేస్తూ మూడు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 ఎట్టకేలకు గుమ్మడికాయ కొట్టేసింది. చివరి వరకు అభిమానులతోపాటు చిత్ర యూనిట్ కూడా టెన్షన్ పడింది.. అనుకున్న సమయానికి సినిమా వస్తుందా? లేదా? అని. ఎట్టకేలకు కాపీ పూర్తయి సెన్సార్ కు కూడా వెళ్లింది. అక్కడ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ కు పంపించడానికి ముందుగా ఫైనల్ గా ఒకసారి చిత్ర నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్, దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ తోపాటు ముఖ్యమైన సినిమా టీం సభ్యులంతా సినిమా చూశారు. దీనికి ప్రత్యేక అతిథిగా బన్నీ తండ్రి అల్లు అరవింద్ వచ్చారు.
బన్నీని కౌగిలించుకున్న అల్లు అరవింద్
సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ బన్నీని గట్టిగా కౌగిలించుకున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పారు. దీంతో యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుంది. అల్లు అరవింద్ జడ్జిమెంట్ బాగుంటుంది కాబట్టి తిరుగులేని హిట్ సాధించడానికి ఇంకా కొద్దిరోజులు మాత్రమే మిగిలివుంది. సినిమాలో ఫాహద్ ఫజిల్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా ఉంటుందికానీ అతనికి ప్రతి పావుగంటకు అద్భుతమైన ఎలివేషన్లు ఇచ్చాడని తెలుస్తోంది. అలాగే సముద్రంమీద వచ్చే ఫైట్ బాగా వచ్చిందని, జాతర సన్నివేశం గురించి ఎంత చెప్పినా తక్కువే అంటున్నారు. ఈ వార్త బయటకు రావడంతో అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మనదేశంలో స్క్రీన్లు 6వేలు
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అందులో మనదేశంలోని స్క్రీన్లు 6వేలు కాగా, ఇతర దేశాల్లో 5వేల స్క్రీన్లు. ట్రైలర్ విడుదలై సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమాకు ఓవర్సీస్ లో టికెట్లు బాగా అమ్ముడుపోతున్నాయి. తొలిరోజు టార్గెట్ రూ.300 కోట్లు సాధించాలని, ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టాలని పుష్ప2 టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్, రామ్ చరణ్ రికార్డులు గల్లంతవడం ఖాయమంటున్నారు. సినిమా బాగుంది అనే టాక్ వస్తే రెండువారాల వరకు థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ అవుతాయని, అందరికీ కావల్సింది అదేగా అని విశ్లేషకులు అంటున్నారు. సుకుమార్ పడిన కష్టానికి, అల్లు అర్జున్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం పుష్ప2 అందించబోతోందంటున్నారు. వచ్చే నెల ఐదోతేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications