బిగ్ షాక్: రూ.1800 కోట్లు వచ్చినా ఫ్లాప్‌గా నిలిచిన 'పుష్ప2'!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా ఇప్పటివరకు రూ.1800 కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పుడిప్పుడే కొంచెం కలెక్షన్లు నెమ్మదిస్తున్నాయి. సంక్రాంతికి కొత్త సినిమాలు రానుండటంతో దీని హవా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ సినిమా ఇంతవరకు రూ.1800 కోట్లు రాబట్టినప్పటికీ ఇతర ప్రాంతాల్లో మాత్రం కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించకపోవడం విశేషం. సినిమాను భారీ ధరలకు నిర్మాతలు అమ్మడమే ఇందుకు కారణం. పుష్ప1 లాగానే తెలుగులోని కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా ఫ్లాప్ గా నిలవబోతోంది. టికెట్ ధరలు అధికంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులెవరూ అనుకున్న స్థాయిలో థియేటర్లకు రాలేదు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా ఫ్లాప్ అవడం ఏమిటని సినీ ప్రియులతోపాటు బన్నీ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
బాలీవుడ్ మినహా మిగతా ప్రాంతాల్లో...
రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం ప్రాంతం మినహా ఏ ప్రాంతంలోను ఈ సినిమాకు ఇంకా డబ్బులు రాలేదు. సీడెడ్, కృష్ణా-గుంటూరు, ఉత్తరాంధ్ర, నెల్లూరు ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కు చేరుకోలేదని తెలుస్తోంది. పుష్ప1 కూడా ఏపీలో చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ కాకపోతే బయ్యర్లకు నిర్మాతలు డబ్బులు వెనక్కిచ్చారు. ఈసారి కూడా అదే జరుగుతుందా? అనే సందేహం కలుగుతోంది. అయితే ఈ సినిమా కర్ణాటకలో మాత్రం మంచి వసూళ్లు తెచ్చుకుంది. హిందీ గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాల్లో సూపర్ హిట్ గా నిలిచి త్వరలోనే రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టబోతోంది. మంచి టాక్ తెచ్చుకున్న ఉత్తర అమెరికాలో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవలేదు. మొత్తంగా చూస్తే ఒక్క బాలీవుడ్ మినహా ఈ సినిమాకు అన్నిచోట్లా నష్టాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు.

మార్కెట్ సామర్థ్యానికి మించి..
బన్నీకి మంచి క్రేజ్ ఉన్న కేరళలో కూడా సినిమా ఫ్లాపైంది. తమిళనాడులో బ్రేక్ ఈవెన్ కు ఆమడదూరంలో నిలిచిపోయింది. అక్కడ పొంగల్ కు గేమ్ ఛేంజర్ తోపాటు మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నష్టపోయినవారి పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు అందరిలో ప్రశ్నార్థకంగా నిలిచింది. నిర్మాతలు భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం, హీరో అత్యధిక పారితోషికం తీసుకోవడంలాంటి కారణాలన్నీ కలిపి సినిమా బడ్జెట్ పెరిగిపోయి డిస్ట్రిబ్యూటర్లకు బయ్యర్లకు అధిక ధరలకు అమ్ముతున్నారు. అంత డబ్బులు వెనక్కిరాక కొనుగోలుదారులంతా తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి సినిమా అమ్మకాలు, కొనుగోలు జరగాలని, అలా కాకుండా అయితే ఇలాగే జరుగుతుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications