రామ్‌చరణ్ "పెద్ది" కి బిగ్ షాక్.. జూన్ 4న అక్కడ నో రిలీజ్ !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సెన్సేషనల్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం "పెద్ది". ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ నటుడు దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ విషయంలో ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.
గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ ఎమోషన్స్‌ను కలగలిపి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్రబృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. కాగా దర్శకధీరుడు రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి పుణ్యమా అని తెలుగు సినిమాలకు గ్లోబల్ స్థాయిలో మంచి క్రేజ్ నెలకొంది. మరి ముఖ్యంగా జపాన్ లో మన చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 'ముత్తు' సినిమాతో జపాన్ లో కూడా భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' మూవీ సైతం మంచి కలెక్షన్స్ రాబట్టింది.

ఇక రామ్ చరణ్‌కు జపాన్‌లో విశేషమైన అభిమాన గణం ఉంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రం అక్కడ సృష్టించిన ప్రభంజనం, చరణ్ అద్భుత నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే జపాన్‌లో చరణ్‌కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ క్రేజ్ నేపథ్యంలో 'పెద్ది'ని జూన్ 4నే జపాన్‌లోనూ పెద్ద ఎత్తున విడుదల చేయాలని నిర్మాతలు మొదట ప్రణాళిక రచించారు.
అయితే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా, జపాన్‌లో మాత్రం వాయిదా పడింది. అనివార్య సాంకేతిక కారణాల వల్ల అక్కడ సినిమాను ముందుగా ప్రకటించిన తేదీలో విడుదల చేయలేమని చిత్రబృందం తెలిపింది. ఈ అనూహ్య నిర్ణయం జపాన్‌లోని మెగా అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. భారతదేశంతో పాటు జపాన్‌లోనూ 'పెద్ది'ని ఒకేసారి విడుదల చేసి ఉంటే, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదయ్యేవని, భారీ ఓపెనింగ్ వసూళ్లు సాధ్యమయ్యేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, చిత్రబృందం త్వరలో జపాన్‌లో ఒక కొత్త తేదీన సినిమాను ఘనంగా విడుదల చేసే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications