టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: 'టైగర్' పంజా దెబ్బకు ప్రేక్షకులు విలవిల
చిత్రం: టైగర్ నాగేశ్వరరావు
నటీనటులు: రవితేజ, అనుపమ్ ఖేర్, నుపుర్ సనన్, రేణుదేశాయ్, జిషుసేన్ గుప్తా, మురళీశర్మ, నాజర్ తదితరులు
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: వంశీ
రవితేజ తొలి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు ప్రజలను ఆకట్టుకోవడం కష్టమే. 1970, 80 దశాబ్దాల్లో స్టూవర్టుపురం నాగేశ్వరరావు పేరు వింటే చాలు అటు ప్రజలతోపాటు పోలీసు వ్యవస్థలోను అలజడి మొదలయ్యేది. ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా, ఎంత విలువైన వస్తువైనా చెప్పి మరీ దొంగతనం చేస్తాడని పేరు. అతను దొంగతనం చేసే ప్రాంతాన్ని టైగర్ జోన్ అని, అతన్ని టైగర్ నాగేశ్వరరావు అని పిలుస్తుంటారు. దోపిడీలకు పాల్పడుతున్న నాగేశ్వరరావు అసలు లక్ష్యం ఏమిటనేదే ఈ సినిమా కథ. అతని గురించి ఢిల్లీలో చర్చ మొదలవుతుంది. సినిమాను అక్కడి నుంచి ప్రారంభించారు.

వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువ. థియేటర్లో కూర్చున్న తర్వాత తెరపై కనిపిస్తుంది వాస్తవమా? కల్పితమా? అనే విషయం కంటే కథ ఆసక్తిని కలిగించిందా? లేదా? అనేదే ముఖ్యం. ఒక దశ వరకు పర్వాలేదనిపించిన సినిమా తర్వాత గాడి తప్పింది. ఎక్కడా భావోద్వేగాలు పండలేదు. నాగేశ్వరరావు దొంగతనాలను థ్రిల్ కలిగించేలా తీశారా? అంటే అలా కూడా తీయలేకపోయారు. ఓ దొంగ ప్రధానమంత్రి సీటు వరకు వెళ్లాడన్నప్పుడు అతనిలో ఎంత ధైర్యం, ఎన్నో తెలివితేటలు ఉండాలి. అయితే వాటిని ఎక్కడా చూపించలేకపోయారు. అదే సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది.
సినిమా ఆరంభంలో చూపించిన రైలు దోపిడీ సహజంగా అనిపించదు. గ్రాఫిక్స్ క్వాలిటీగా లేవు. నాసిరకంగా ఉన్నాయి. దొంగతనాల కోసం టైగర్ సన్నద్ధమయ్యే తీరు లాంటి సంఘటనలు ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి. అయితే వెంటనే కమర్షియల్ ఫార్మాట్ లోకి వెళ్లిపోతుంది. పోలీసులతో ఫైట్, హీరోయిన్ తో ప్రేమ అంటూ మరోదారి పడుతుంది. సినిమా రెండో భాగంలో అయితే తలలు తెగిపడుతూ ఉంటాయి. కథపై ఎక్కడా ఆసక్తే కలిగించదు. హేమలతా లవణం పాత్రను కూడా ప్రభావవంతంగా చూపించలేకపోయారు. 1980 దశకంలో సాగే ఈ కథలో రవితేజతోపాటు కొందరు నటులు ట్రెండీగా కనిపిస్తారు. మరికొన్నిచోట్ల చారిత్రాత్మక సినిమాల్లో ఉన్నట్లుగా కనిపిస్తారు.
నాగేశ్వరరావు పాత్రలో రవితేజ ఒదిగిపోయారు. లుక్ విషయంలో, పోరాటాల పరంగా ఆయన బలమైన ప్రభావమే చూపించారు. కథానాయికలతోపాటు అనుపమ్ ఖేర్, మురళీశర్మ, నాజర్ తమ పరిధుల మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఈ చిత్రానికి ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధాన బలం. నేపథ్య సంగీతంతో తనదైన ప్రభావాన్ని చూపించారు. ఈ సినిమా రన్ టైం కూడా పెద్ద సమస్యగా మారింది. మూడుగంటల రెండు నిముషాలపాటు ఉంది. ఎక్కడా ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలతోపాటు భావోద్వేగాలు కూడా కొరవడ్డాయి.












Click it and Unblock the Notifications