రియల్ స్టార్ శ్రీహరి.. భారత్ తరపున ఆ గేమ్స్‌లో ఆడాలనే కోరిక తీరకుండానే చనిపోయారా..?
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో శ్రీహరి ఒకరు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. పలు విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసును గెలుచుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా.. ఆపత్కాలంలో ఎందరో పేదవారికి అండగా కూడా నిలిచారు. శ్రీహరి సహాయగుణం గురించి ఇప్పటికీ పలు వేదికల్లో ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.
సినీ కెరీర్..
తొలుత స్టంట్ మాస్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శ్రీహరి.. 1989లో తమిళ చిత్రం "మా పిళ్ళై" ద్వారా తన సినీ ప్రయాణం ప్రారంభించారు. అదే ఏడాది తెలుగు సినిమా "ధర్మక్షేత్రం" ద్వారా తెలుగువారికి పరిచయమయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే.. "కుబుసం", "భద్రాచలం", "జూలీ", "అయోధ్య", "సైంధవుడు" వంటి అనేక చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించారు.

కానీ శ్రీహరికి ఇంకా బాగా పేరు తెచ్చింది అంటే.. వైవిధ్యమైన పాత్రలే అని చెప్పాలి. "మగధీర" లో షేర్ ఖాన్ పాత్ర, "ఢీ" లోని సుబ్బరాజు పాత్ర, "నువ్వొస్తానంటే నేనొద్దంటానా", "బృందావనం", "తుఫాన్", "కింగ్" వంటి సినిమాల్లో ఆయన పాత్రలు సినిమాలకు కీలకంగా నిలిచాయి.
శ్రీహరి సినిమాల్లోకి రాక ముందు.. చిన్నవయసు నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని పెద్దవాడయ్యారు. హైదరాబాద్ నగరంలో పాల వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించారు. అంతే కాకుండా మెకానిక్ షెడ్ లో పనిచేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. శోభన థియేటర్ ఎదుట ఉన్న శ్రీవాసరావు షెడ్డులో పనిచేస్తూ.. ఖాళీ సమయాల్లో అదే థియేటర్‌లో సినిమాలు చూసేవారు. అలా ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి పెరిగిందని అంటుంటారు.

అథ్లెట్‌గా కావాలనే కోరిక..
నటుడిగా కాకుండా అథ్లెట్‌గా కూడా శ్రీహరి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ గా పేరు గడించడమే కాకుండా.. "మిస్టర్ హైదరాబాద్" బాడీబిల్డింగ్ టైటిల్‌ను ఏకంగా ఏడు సార్లు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారత్ తరఫున పాల్గొనాలనే కోరిక ఉన్నా.. సినీ కెరీర్ కోసం వాటిని వదిలేయాల్సి వచ్చిందని చెబుతారు. ఇక 2013 అక్టోబర్ 9న ముంబైలో అనారోగ్య సమస్యలతో శ్రీహరి తుదిశ్వాస విడిచారు. దాంతో ఆ కోరిక తీరకుండానే చనిపోయినా.. ప్రజల్లో మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.












Click it and Unblock the Notifications