సమంత మళ్లీ నోరెత్తకుండా సమాధానం చెప్పిన మహేష్‌బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు, ముద్దుగుమ్మ సమంత కలిసి దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాల్లో నటించారు. వీరిద్దరూ మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా షూటింగ్ జరిగే సమయంలో సరదాగా సమంత మహేష్ బాబును ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసే సమయంలో పక్కనే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా సమంత మహేష్ బాబును తాజాగా ఏ సినిమా చూశారు? అని అడగ్గా.. తమిళంలో విజయ్ చేసిన కత్తి సినిమాను చూశానని మహేష్ సమాధానమిచ్చారు.
రీమేక్ చేస్తుంటే ఆ హీరోనే గుర్తుకు వస్తాడు
ఈ సినిమాను రీమేక్ చేయవచ్చుకదా అని అడిగింది. అయితే తాను రీమేక్ చేయనని, అసలు ఏ సినిమాను రీమేక్ చేయనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. రీమేక్ సినిమా చేసే సమయంలో ఆ సినిమాలో నటించిన హీరోనే గుర్తుకు వస్తారని, అంతకుమించి కొత్తగా ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నా కుదరదని, అలాంటప్పుడు తాను ఏ సినిమా అయినా రీమేక్ ఎలా చేయగలనని ప్రశ్నించారు. ఒకవేళ కత్తి సినిమాను రీమేక్ చేస్తున్నా తనకు విజయే గుర్తుకు వస్తాడని చెప్పారు. మీ సినిమాలన్నీ విజయ్ రీమేక్ చేస్తున్నారు కదా అని అడగ్గా.. రీమేక్ చేసేవారిని ఎప్పుడూ తాను తక్కువ చేసి చూడనన్నారు.

ఇష్టమైన హీరోయిన్ నే పెళ్లి చేసుకున్నా
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మీరు మరో సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అందులో హీరోయిన్ నేనేగా అని ప్రశ్నించగా.. కచ్చితంగా తామిద్దరం సినిమా చేస్తామని, అయితే హీరోయిన్ నువ్వో, కాదో తెలియదన్నారు. మీకు ఇష్టమైన హీరోయిన్ నేనే అని తెలుసు.. నేను కాకుండా వేరేవారి పేరు చెప్పండి అని కోరగా.. తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ నే వివాహం చేసుకున్నానని నమ్రత శిరోద్కర్ పేరు చెప్పారు. దీంతో అందరూ నవ్వేశారు. ఏ విషయాన్నైనా మహేష్ బాబు సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారు. రీమేక్ విషయంలో సమంత అడిగిన విషయానికి కూడా ఎటువంటి మొహమాటం లేకుండా స్పష్టంగా చెప్పేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications