బాలయ్య-సుకుమార్ కాంబినేషన్ లో NBK 110?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. భగవంత్ కేసరిలో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడమే కాదు.. వరుసగా ఈ మూడు సినిమాలు రూ.100 కోట్లు వసూలు చేసిన ఫీట్ ను కూడా అందుకున్నారు. సీనియర్ హీరోల్లో ఎవరూ అందుకోలేని ఈ రికార్డును బాలకృష్ణ ఒక్కడే అందుకోవడం విశేషం.
భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఏపీ ఎన్నికలకు ముందు లేదంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అఖండకు సీక్వెలా? లేదంటే మరో కథా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య ఏ దర్శకుడితో చేయబోతున్నారని అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ప్రకారం పుష్ప దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకరకంగా ఇది మైండ్ బ్లాక్ న్యూస్ అని చెప్పవచ్చు. సుకుమార్ దర్శకత్వంలో చేయాలని కుర్ర హీరోలంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన బాలయ్యతో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాకు జాతీయ అవార్డును సాధించడంద్వారా దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని సుకుమార్ తనవైపునకు తిప్పుకున్నారు.
పుష్ప తర్వాత ఏ హీరో సినిమా చేయబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో ఉంది. పుష్ప 2 సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. ఆ తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. అప్పటికి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సినిమా పూర్తిచేసుకొని బోయపాటిది కూడా సగం పూర్తిచేసి ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనే వార్తపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications