సినిమావాళ్లపై ఐటీ దాడుల వెనక వారే?
రెండురోజులుగా సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకుడు సుకుమార్, ఫైనాన్షియర్ల ఇళ్లల్లో, కార్యాలయాల్లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా దాదాపుగా ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు, నిర్మించినవారు, వారికి డబ్బులు సమకూర్చినవారిపై ఈ దాడులు చాలా సీరియస్ గా జరుగుతున్నాయి. సినీ రంగంలో ఇటీవల కొత్త పోకడలు చోటుచేసుకుంటున్నాయి. సినిమా విడుదలైన నాలుగు రోజులకు, ఐదురోజులకే వందల కోట్లరూపాయల కలెక్షన్లు వచ్చాయంటూ ఫేక్ పోస్టర్లను అధికారికంగా విడుదల చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవం కాదనే విషయం అందరికీ తెలుసు.
అల్లు అర్జున్ ఇంట్లో కూడా జరుగుతాయా?
నిర్మాతలంతా సరైన సమయానికి ఆదాయపు పన్ను కడితే ఈ తరహా దాడులు జరిగేవి కావని భావిస్తున్నారు. హీరోల కోసం, అభిమానులను సంతృప్తి పరచడం కోసం ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసి గొంతుమీదకు తెచ్చుకుంటున్నారని, పుష్ప2 సినిమాకు రూ.1800 కోట్ల లెక్కలు చూపించాలంటూ అధికారులు మైత్రీ మూవీస్ నిర్మాతలను కోరారు. అయితే వారు అవి ఫేక్ కలెక్షన్లు అని చెప్పి వేరే కలెక్షన్ల వివరాలు చెబుతారా? లేదంటే కొత్త కథ అల్లుతారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయలంటే అవి అక్కడితో ఆగేవి కావని, అల్లు అర్జున్ ఇంట్లో కూడా రేపో, మాపో సోదాలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

దాడులకు వారే అవకాశం కల్పిస్తున్నారు
ఉన్నట్లుండి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఐటీ దాడులు ఎందుకు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దిల్ రాజు ఇంట్లో 18 గంటలు సోదాలు జరిగాయి. ఆయన సతీమణిని తీసుకొని బ్యాంకు లాకర్లు తెరిపించారు. మైత్రీలో కూడా సోదాలు జరుగుతున్నాయి. భైరవం సినిమా నిర్మిస్తున్న నెక్కంటి శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇలా ఒక్కసారిగా పరిశ్రమ ఎందుకు టార్గెట్ అయిందంటున్నారు. దీనివెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో అందరూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రం కావాలని పరిశ్రమను టార్గెట్ చేసి దాడులు చేయించే పరిస్థితి లేదు. అలా అని రాష్ట్ర ప్రభుత్వం చేయించే పరిస్థితి ఉండదు. నిర్మాతలే వారి ఫేక్ కలెక్షన్ల పోస్టర్లతో దాడుల వరకు తెచ్చుకుంటున్నారని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications