ఈ 3 సినిమాల్లో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇదే!
సంక్రాంతి పర్వదినం వస్తుందంటే చాలు అందరికీ పండగే. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందినవారు తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని, భారీ కలెక్షన్లను కొల్లగొట్టాలనే ప్రణాళికలో ఉంటారు. సంక్రాంతి సెలవులు ఉంటాయి కాబట్టి సినిమాకు పర్వాలేదు అనే టాక్ వచ్చినా ఆ కలెక్షన్లతో బయటపడొచ్చనే భావనలో నిర్మాతలుంటారు. అయితే టికెట్ ధరలు అధికంగా ఉండటంతో కుటుంబంతో సహా ఎవరూ థియేటర్లకు వచ్చే పరిస్థితి కనపడటంలేదు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా నందమూరి బాలకృష్ణ డాకూ మహారాజ్, విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో ముందుకు వచ్చారు. ఈనెల 10, 12, 14 తేదీల్లో ఈ సినిమాలు విడుదలయ్యాయి.
సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న సినిమా ఏది..? #RamCharan #GameChanger #Balakrishna #DaakuMaharaaj #Venkatesh #SankranthikiVasthunam #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) January 15, 2025
కథ పాతదే అయినా కొత్తగా చెప్పిన దర్శకుడు
10న విడుదలైన గేమ్ ఛేంజర్ ఆకట్టుకోలేకపోయింది. శంకర్ కాలం చెల్లిన కథ, కథనాలకు రామ్ చరణ్ తోపాటు నిర్మాత దిల్ రాజు కూడా మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మెగా అభిమానులు తీవ్రంగా నిరాశపడ్డారు. అయినా శంకర్ మాత్రం తాను తీసిన కథ 5 గంటలు వచ్చిందని, నిడివి వల్ల కట్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. థియేటర్లన్నీ ఖాళీగా కనపడుతున్నాయి. మొదటిరోజు రూ.186 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పన్న పాత్ర మినహా సినిమాను శంకర్ తన స్థాయిలో తీయలేకపోయారు. 12వ తేదీన విడుదలైన డాకూ మహారాజ్ సినిమా కథ పాతదే అయినా కొత్తగా చెప్పాడు దర్శకుడు బాబీ. కథలు అందుబాటులో లేనప్పుడు కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాడు. బాలయ్యను చాలా స్టైలిష్ గా చూపించడం, ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలన్నీ కలిసి అభిమానులకు సంక్రాంతి పండగలా అనిపించింది. బాలయ్యను విభిన్నంగా చూపించడంలో బాబీ విజయంతమయ్యాడు.

ద్వితీయార్థంలో తడబడ్డ అనిల్
14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆద్యంతం కామెడీతో ఆకట్టుకుంది. అయితే ద్వితీయార్థంలో సినిమా కాస్తంత సాగదీతగా అనిపించడంతోపాటు మొదటి భాగం ఉన్నంత స్థాయిలో లేదు. ద్వితీయార్థాన్ని తీయడంలో అనిల్ రావిపూడి తడబడ్డాడు. హాస్యం ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడంతోపాటు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా గుర్తుపెట్టుకునేంత హాస్యమైతే కాదు. వెంకీ కామెడీ టైమింగ్ బాగుంటుంది. కాకపోతే సరదాగా ఓసారి సినిమా చూసిరావచ్చు. కానీ టికెట్ ధరలు అందుకు అడ్డుపడుతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా మారి టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతివ్వకుండా సామాన్యులకు ఎంటర్ టైన్మెంట్ గా ఉన్న సినీ రంగాన్ని దూరం చేయొద్దని సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్యే ఈ ఏడాది సంక్రాంతి విజేత అని, డబుల్ హ్యాట్రిక్ కు రంగం సిద్ధం చేసుకున్నాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications