ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టాడు..!
అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా దర్శకుడి కీర్తి పతాక ఎగిరింది. ప్రపంచ శాంతి సందేశాన్ని బలంగా చాటే లక్ష్యంతో డైరెక్ట్‌గా హాలీవుడ్ స్థాయిలోనే నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్ బుద్ధ'. అక్టోబర్ 4, 2025న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్... తెలుగు సంతతి దర్శకుడి పట్టుదలకు, నిర్మాతల అపార నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ 'కింగ్ బుద్ధ' పోస్టర్‌ను లాంచ్ చేశారు. గౌతమ బుద్ధుడి శాంతి సందేశాన్ని అంతర్జాతీయంగా చాటడం గొప్ప ప్రయత్నమని కొనియాడారు. తెలుగు దర్శకుడైన సత్యారెడ్డి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో కాకుండా, ఏకంగా హాలీవుడ్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించడం చారిత్రకమని పేర్కొన్నారు. సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోయే పని చేస్తున్నారని ప్రశంసించిన మేయర్, చిత్ర నిర్మాణానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని, అవసరమైతే షూటింగ్ కోసం తమ బంగ్లాలు, ఇతర ఆస్తులను కూడా ఉపయోగించుకోవచ్చని ప్రకటించడం విశేషం.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ.. 'కింగ్ బుద్ధ' కోసం అన్‌లిమిటెడ్ బడ్జెట్ కేటాయించామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా హై-లెవెల్ టెక్నికల్ అసెట్స్‌తో సినిమాను నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో సత్యారెడ్డి దర్శకత్వంలో గద్దర్ గారు నటించిన 'ఉక్కు సత్యాగ్రహం'లో శాంతి ప్రవచనాల నుంచి ప్రేరణ పొంది, 'కింగ్ బుద్ధ'ను హాలీవుడ్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నామని శైలర్ వెల్లడించారు.
నటుడిగా, నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న డైరెక్టర్ సత్యారెడ్డి, తన ప్రపంచ శాంతి కాన్సెప్ట్‌ను నిర్మాతలు ఆమోదించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని తెలిపారు. ఈ భారీ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి అభిమానులు, శ్రేయోభిలాషులు హాజరుకావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
సత్యారెడ్డి గతంలో 'ఉక్కు సత్యాగ్రహం', 'శంకర్ దాదా జిందాబాద్' లాంటి విజయవంతమైన చిత్రాలు తీశారు. అపారమైన అనుభవం ఉన్న ఈ దర్శకుడు, అతి త్వరలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ప్రపంచ బౌద్ధమత పెద్దలు, గురువులు సమక్షంలో 'కింగ్ బుద్ధ' షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తెలుగు సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై యావత్ సినీ ప్రపంచం దృష్టి నిలిచింది.












Click it and Unblock the Notifications