Year Ender : ఈ ఏడాదిలో పెళ్లి చేసుకున్న టాప్ 10 సినీ ప్రముఖులు వీరే..
ఇద్దరు వ్యక్తులు.. మూడు ముళ్లు బంధంతో.. ఒక్కటయ్యే వేడుకే "వివాహం". కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. అందుకే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని అంటుంటారు. అదే మనకు బాగా ఇష్టమైన హీరో లేదా హీరోయిన్ వివాహం అంటే అందరికీ ఒక ఆసక్తి ఖచ్చితంగా ఉంటుంది.
2025వ సంవత్సరం సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సందడితో కళకళలాడింది. అటు టాలీవుడ్ నుంచి ఇటు బాలీవుడ్ వరకు.. వెండితెర స్టార్ల నుంచి బుల్లితెర సెలబ్రిటీల వరకు చాలామంది తమ ప్రియుడు/ప్రియురాలితో ఏడడుగులు వేశారు. ఇందులో కొన్ని పెద్దలు కుదిర్చిన వివాహాలు ఉంటే.. మరికొన్ని ప్రేమ వివాహాలు ఉన్నాయి. ఈ 2025లో పెళ్లి చేసుకున్న జంటలను చూస్తే వారిలో.. అఖిల్ అక్కినేని - జైనబ్, సమంత - రాజ్ నిడిమోరు, రాహుల్ సిప్లిగంజ్ - హరిణ్య రెడ్డి, అవికా గోర్ - మిలింద్ చంద్వానీ.. సహా మరికొన్ని జంటలు ఉన్నాయి. ఆ లిస్టు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

1. అర్మాన్ మాలిక్ - ఆష్నా ష్రాఫ్ : జనవరి 2, 2025
ప్రముఖ సింగర్ అర్మాన్ మాలిక్, ఫ్యాషన్ ఇన్‌ఫ్లూయెన్సర్ ఆష్నా ష్రాఫ్ ఏడాది ప్రారంభంలోనే ఒక్కటయ్యారు. మహాబలేశ్వర్‌లో అత్యంత విలాసవంతంగా జరిగిన ఈ వివాహ వేడుకకు బాలీవుడ్ మ్యూజిక్ ఇండస్ట్రీ తరలివచ్చింది.
2. అర్చన కొట్టిగె - బీఆర్ శరత్ (క్రికెటర్) : ఏప్రిల్ 23, 2025
కన్నడ నటి అర్చన కొట్టిగె, ఐపీఎల్ ఆటగాడు బీఆర్ శరత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుకోవడం విశేషం. సినీ, క్రీడా రంగాల కలయికగా ఈ వివాహం నిలిచింది.
3. హీనా ఖాన్ - రాకీ జైస్వాల్ : జూన్ 4, 2025
బుల్లితెర స్టార్ నటి హీనా ఖాన్, నిర్మాత రాకీ జైస్వాల్ 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత పెళ్లి చేసుకున్నారు. హీనా ఖాన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో రాకీ ఆమెకు అండగా నిలిచిన తీరు అందరినీ కదిలించింది. వీరిద్దరి వివాహం ఒక ప్రేమకావ్యంగా నిలిచిపోయింది.
4. అఖిల్ అక్కినేని - జైనబ్ : జూన్ 6, 2025
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అఖిల్ అక్కినేని ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. గతేడాది నాగచైతన్య వివాహం జరగగా.. ఈ ఏడాది అఖిల్ వివాహంతో అక్కినేని ఇంట పండగ వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అత్యంత వైభవంగా ఈ వివాహం జరిగింది.
5. అవికా గోర్ - మిలింద్ చంద్వానీ : సెప్టెంబర్ 30, 2025
'చిన్నారి పెళ్లికూతురు'గా గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్.. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్, సోషల్ వర్కర్ మిలింద్‌ను వివాహం చేసుకుంది. దాదాపు 5 ఏళ్ల ప్రేమాయణం తర్వాత వీరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
6. నార్నె నితిన్ - శివాని : అక్టోబర్ 10, 2025
ఎన్టీఆర్ బావమరిది, యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం ఈ ఏడాది ఘనంగా జరిగింది. ఈ పెళ్లిని ఎన్టీఆర్ స్వయంగా దగ్గరుండి జరిపించారు. విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు వంటి ప్రముఖులు హాజరయ్యారు.
7. నారా రోహిత్ - శిరీషా లేళ్ల : అక్టోబర్ 30, 2025
యంగ్ హీరో నారా రోహిత్.. నటి శిరీషను వివాహం చేసుకున్నారు. 'ప్రతినిధి 2' సినిమాలో కలిసి నటించిన ఈ జంట, రీల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ పార్ట్నర్లుగా మారారు. ఈ వివాహానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ హాజరై సందడి చేశారు. కానీ ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ దూరంగా ఉండటం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
8. అభిషన్ జీవింత్ - అఖిల : అక్టోబర్ 31, 2025
యువ దర్శకుడు అభిషన్ తన చిన్ననాటి స్నేహితురాలు అఖిలను పెళ్లాడారు. పెద్దల అంగీకారంతో పక్కా సంప్రదాయ పద్ధతిలో ఈ వేడుక జరిగింది.
9. రాహుల్ సిప్లిగంజ్ - హరిణ్య రెడ్డి : నవంబర్ 27, 2025
ఆస్కార్ విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన ప్రేయసి హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా భారీగా తరలివచ్చారు. పాతబస్తీ నుంచి ఆస్కార్ వేదిక వరకు ఎదిగిన రాహుల్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది.
10. సమంత - రాజ్ నిడిమోరు : డిసెంబర్ 1, 2025
ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచిన వివాహం అంటే సమంత - రాజ్ లది అని చెప్పాలి. 'ది ఫ్యామిలీ మ్యాన్' దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరును సామ్ పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో 'భూతశుద్ధి' అనే సంప్రదాయ పద్ధతిలో అత్యంత నిరాడంబరంగా వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications