2024లో తెలుగులో భయంకరమైన అట్టర్ ఫ్లాప్ మూవీస్
తెలుగు సినీ పరిశ్రమలో మరో సంవత్సరం కొద్దిరోజుల్లోనే ముగియబోతోంది. కొత్త సంవత్సరంలో మరిన్ని విజయాల కోసం పరిశ్రమ ఎదురుచూస్తోంది. 2024 వెళుతూ వెళుతూ పుష్ప2, కల్కి, దేవర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించడంతోపాటు పాన్ ఇండియా వ్యాప్తంగా తెలుగు సినిమా క్రేజ్ ను, టాలీవుడ్ ఇమేజ్ ను పెంచింది. వచ్చే సంవత్సరం కూడా మన తెలుగు హీరోల నుంచి పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. వీటికోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో 2024లో కొన్ని సినిమాలు తెలుగులో అట్టర్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి. నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను, చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా నిండా ముంచేశాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మట్కా
ఈ సంవత్సరంలోనే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో అత్యంత చెత్త సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా విడుదలైన ఐదోరోజు థియేటర్లలో ఎక్కడా ఒక్క టికెట్ కూడా అమ్ముడుపోలేదు. ఆరోజు సున్నా వచ్చింది. వరుణ్ తేజ్ కెరీర్ లో పీడకలగా నిలిచిపోయే చిత్రం ఇది. కరుణకుమార్ ఈ చిత్ర దర్శకుడు.

మిస్టర్ బచ్చన్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రాన్ని వారం తిరగకుండానే థియేటర్లలో ఎత్తేశారు. అతి చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రవితేజ కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సినిమా నిరూపించింది.
ఫ్యామిలీస్టార్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఈ సినిమాకు దర్శకుడు పరశురామ్. గీత గోవిందం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సినిమా తీసిన దిల్ రాజుకు నష్టాలను మిగిల్చింది.
ఆపరేషన్ వాలెంటైన్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా వచ్చిన మరో చిత్రం ఇది. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ కు, నిర్మాతలకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
సైంధవ్
వెంకటేష్ కథానాయకుడిగా సరికొత్త జానర్ లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు శైలేష్ కొలను. సినిమా విడుదలకు ముందు మంచి అంచనాలున్నప్పటికీ విడుదలైన తర్వాత మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. వెంకటేష్ కు పీడకలను మిగిల్చింది. సక్సెస్ రేటు ఎక్కువగా ఉండే వెంకీ నుంచి ఈ తరహా చిత్రాన్ని ప్రేక్షకులు ఆశించలేకపోయారు.
లాల్ సలాం, నన్ను ప్రేమించు, భారతీయుడు2, ఇస్మార్ట్ శంకర్, వేట్టయాన్ లాంటి చిత్రాలు కూడా భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.












Click it and Unblock the Notifications