అన్న ప్లాన్ మామూలుగా లేదు.. ఈసారి గ్లోబల్ రేంజ్‌లో రచ్చ!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'రణబాలి', 'రౌడీ జనార్దన్' వంటి చిత్రాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో.. శనివార తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించారు. 'హాయ్ నాన్న' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ ఈ కొత్త సినిమా చేయబోతున్నాడు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా భారతీయ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఈ ప్రాజెక్టు ప్రధాన ఆకర్షణ ఇదే..!
ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇందులో హాలీవుడ్ స్థాయిలో పనిచేసే అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు భాగస్వామ్యం కావడం. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్', 'ఫాలౌట్' వంటి హాలీవుడ్ సిరీస్‌లకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అలాగే 'బ్యాట్‌మ్యాన్ ఫరెవర్', 'గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్' వంటి చిత్రాలకు పనిచేసిన ఎరిక్ డర్స్ట్ వీఎఫ్ఎక్స్ పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. ఇక 'యానిమల్', 'ఓం శాంతి ఓం' చిత్రాల ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ చిత్రానికి పనిచేస్తుండగా.. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

ఆసక్తి రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్
శనివారం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ తనతో పాటు నాలుగు పెంపుడు కుక్కలను తీసుకుని ముందుకు నడుస్తుండగా.. వెనుక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలతో ఆయన్ని అనుసరిస్తుండటం కనిపిస్తుంది. ముఖ్యంగా పోస్టర్‌పై ఉన్న "All the anger you see now was once love" (ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే) అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది.
మైథలాజికల్ యూనివర్స్ నేపథ్యంలో కథ
ఈ చిత్రం ఓ మైథలాజికల్ యూనివర్స్ (పురాణ గాథల నేపథ్యం) ఆధారంగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ శౌర్యువ్ వెండితెరపై చూపించబోతున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తున్న ఈ సినిమా.. తెలుగుతో పాటు పాన్ ఇండియా, గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే విజయ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఏదో పెద్ద మ్యాజిక్ చేయబోతున్నాడని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications