'డబుల్ ఇస్మార్ట్', 'పుష్ప2'లో ఏది హిట్ అవుతుందంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప2 సినిమాపై అంచనాలు దేశవ్యాప్తంగా భారీగా ఉన్నాయి. పుష్ప మొదటి భాగం తెలుగుకన్నా హిందీలోనే ఎక్కువగా విజయం సాధించడంతో రెండో భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీస్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు బడ్జెట్ రూ.400 కోట్లు అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 15నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బన్నీకి, పవన్ కల్యాణ్ అభిమానులకు గొడవ జరుగుతుండటంతో డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు.
డబుల్ ఇస్మార్ట్ కు కలిసి రాబోతున్న ఆగస్టు 15
ఈలోగా ఐటం సాంగ్ ను తీయడంతోపాటు మరికొన్ని సన్నివేశాలను సుకుమార్ రీషూట్ చేస్తున్నారు. ఇందులో నటిస్తున్న ఫాహద్ ఫజిల్ కు స్కిన్ ఎలర్జీ రావడంతో ప్రస్తుతం షూటింగ్ జరుపుకోవడంలేదు. ఈ సమయంలో దర్శకుడు సుకుమార్ అమెరికా వెళ్లిపోయారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా ముందుగా విడుదల కావాల్సిన ఆగస్టు 15పై ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ కర్చీఫ్ వేసింది. వచ్చే నెల 15న విడుదల కాబోతోంది. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండటం కూడా ఈ సినిమాకు కలిసిరాబోతోంది. దీనికి దర్శకుడు పూరీ జగన్నాథ్. రామ్ ను పూర్తి మాస్ హీరోగా చూపించిన ఇస్మార్ట్ శంకర్ ఘనవిజయం సాధించడంతో రెండో భాగంగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

యూట్యూబ్ ట్రెండింగ్ లో డబుల్ ఇస్మార్ట్ పాట
ఈ సినిమాలోని రెండు పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. 'మార్ ముంత చోడ్ చింత'పాట యూట్యూబ్ లో కొద్దిరోజుల నుంచి నెంబర్ వన్ స్థానంలో నిలుస్తోంది. టాప్ ట్రెండింగ్ లో ఈ పాట ఉంది. లైగర్ భారీ పరాజయం పొందడంతో హీరోలెవరూ పూరీతో చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఆయన మరోసారి రామ్ నే నమ్ముకున్నాడు. ఈ సినిమా బాగా వచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్ లో ఉంది. పూరీ జగన్నాథ్ తన కసినంతా ఈ సినిమాపై పెట్టారు. ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి. అదే సమయానికి పుష్ప2 నుంచి విడులైన పాట మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
సజావుగా షూటింగ్ సాగని పుష్ప2
ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగడంలేదు. త్వరగా విడుదల చేయాలనే విషయంలో బన్నీకి, సుకుమార్ కు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు కూడా తాము ఎంతైతే బడ్జెట్ పెడతామని చెప్పారో అంతకుమించి రూపాయి కూడాపెట్టేది లేదని, ఉన్నదాంట్లోనే షూటింగ్ చేయాలనే షరతు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అంచనాలు ఎక్కువగా ఉన్నవేళ వాటిని పుష్ప2 అందుకుంటుందా? అంటే సినీ విశ్లేషకులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. సినిమా ఫైనల్ ఔట్ పుట్ వచ్చిన తర్వాతే ఒక స్పష్టతకు రానున్నారు. ప్రస్తుతానికి వచ్చేనెల 15న విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ పై మంచి అంచనాలే ఉన్నాయి. వాటిని అందుకుంటుందా? లేదా? అనేది అతి త్వరలోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications