‘అఖండ2’ను ఎందుకు చూడాలంటే?
సినిమా చూసే ప్రేక్షకుల్లో ఇటీవల ట్రెండ్ మారింది. ఎక్కడా లాజిక్కులకు అవకాశం ఉండకూడదు. అదేంటి.. ఆ సన్నివేశం అలా ఉంది? అనే ప్రశ్న తలెత్తకూడదు. సినిమా పర్ ఫెక్ట్ గా ఉండాలి. లోపాలను ఎత్తిపట్టుకోకూడదు. నేటి తరం ప్రేక్షకులకు సినిమా అంటే అలాగే ఉండాలి. అయితే బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కు మాత్రం ఇవన్నీ వర్తించవు. వీరి సినిమాకు లాజిక్కులు తీయకూడదు. తీసినా వర్తించవు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా అంతే ఉంటాయిలే అనుకుంటారు. ఎందుకంటే వీరిద్దరి సినిమా అంటే అలా కళ్లప్పగించి చూడాల్సిందే. కొన్ని కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుకుంటాయి. డైలాగులు వింటుంటే థియేటర్లలో పూనకాలు వచ్చేస్తాయి. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి గురవుతాడు.
రచనపై బోయపాటి దృష్టిపెట్టాలి
సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో ఏం జరిగిందో అఖండ2లోను అదే జరిగింది. బాలయ్య అభిమానుల మనసులను గెలుచుకుంది. తెరపై బాలయ్య శివతాండవం చేశాడు. బోయపాటి సినిమాలకు వెళుతున్నామంటే.. అందులోను బాలయ్య కాంబోలో వస్తున్న సినిమాకు వెళుతున్నామంటే కావల్సింది విజవల్స్, గ్రాఫిక్స్, లాజిక్కులు, కథ.. ఇవి కాదు కావల్సింది.. మాస్.. హైప్. ఈ రెండే. అయితే బోయపాటి శీను రచయితగా మెరుగుపడాలి. గతంలో అతని సినిమాలకు కొరటాల శివ రచయితగా పనిచేశాడు కాబట్టి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఇప్పుడు కొరటాల శివ కూడా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. అందుకే బోయపాటి రచనపై దృష్టి సారించాలి.

కథ కాదు.. మ్యాజిక్ కోసం చూడాలి
మ్యాజిక్ కోసమే ఈ సినిమా చూడాలి. బాలయ్య వచ్చినప్పుడు పూనకాలు వస్తున్నాయా? లేదా? అని చూసుకోవాలి. టికెట్ రేటు గిట్టుబాటు అయిందా? లేదా? అని చూసుకోవాలి. బాలయ్య శివతాండవంతో సంతృప్తి పడ్డామా? లేదా? అని చూసుకోవాలి. విజిల్స్ వేస్తున్నామా? లేదా? అని చూసుకోవాలి. అఘోరా పాత్రలో బాలయ్య విశ్వరూపం చూసేందుకు ఈ సినిమా చూడాలి. తనకు మాత్రమే సూటయ్యే డైలాగ్స్ చెబుతుంటే వినేందుకు చూడాలి.. యాక్షన్ సన్నివేశాల్లో, క్లైమాక్స్ లో బాలయ్య నటన చూసేందుకు ఈ సినిమా చూడాలి. తల్లి సెంటిమెంట్ బాగా పండినందుకు చూడాలి. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడనందుకు, విజువల్ గ్రాండియర్ గా ఉన్నందుకు చూడాలి. కొన్ని సన్నివేశాల సాగదీత తప్పితే మిగతా అంతా ఓకే.












Click it and Unblock the Notifications