వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చింతపట్ల క్విక్ బాక్సింగ్: ఫ్రెండ్.. ఫిలాసఫర్.. గైడ్

|
Google Oneindia TeluguNews

చీమా చీమా నీ బంగారు పుట్టలో వేలు పెట్టాను కుట్టవేం అని కుట్టించుకునే వాడంటే.. శివుడాజ్ఞ కాలేదింకా అన్నది చీమ కళ్లు మూసుకుని.

లోకంలో కదిలే బొమ్మల్నీ కదలని బొమ్మల్నీ అదుపు ఆజ్ఞల్లో వుంచేవాడ్ని శివుడనీ, అల్లా అనీ, ప్రభువనీ, మరొకరనీ ఎవళ్లకు తోచిన రీతిని వాళ్లంటూ వుంటే మానవాతీత శక్తి ఏదో ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తుందని కొందరంటారు.

ఏ పేరున పిలిచినా దేవుడొక్కడే అనే వేదాంతలతోపాటు, ఈ పేరునవున్న వాడు ఒక్కడే దేవుడనే ఛాందసులూ లేకపోలేదు.

అనగానగా ఓ కుగ్రామం. వేళ్ల మీద లెక్క పెట్ట గలిగేన్ని ఇళ్లున్న ఆ ఊళ్లో ఓ వేప చెట్టు వుంది. హఠాత్తుగా వేప చెట్టుకింద అరుగు మీద అవుపడ్డాడో కుర్రాడు. వయస్సు పదిపైన ఒకటో రెండోయేళ్లు. గోచీ పెట్టుకుని, కదలకుండా మెదలకుండా ధ్యానంలో వుండే కుర్రాణ్ణి చూసి వచ్చీపోయే జనం మొదట ముక్కు మీద వేసుకున్నారు వేళ్లు. ఆ తర్వాత ఓ పండో కాయో, పూవో ఆ కుర్రాడి ముందు పెట్టి వెళ్లడం మొదలెట్టారు.

Chintapatla sudarshan Quick Boxing writes about communication skills

ఓ నాడు ఊళ్లో వాళ్ల బృందం ఒకటి మరో ఊరికి పోతూ పోతూ ఆ కుర్రాణ్ణి రమ్మని కేకేశారు. ఏమీ మాట్లాడకుండా బండెక్కిన కుర్రాణ్ణి మరో వూళ్లో ఎవరో ‘యాసాయీ' అని పిలిచారు. రండి స్వామీ అన్న పిలుపే ఆ కుర్రాడి పేరయ్యింది. అప్పటిదాకా యే ఊరో ఏ పేరో తెలీని కుర్రాడికి ఆ వూరూ ఆ పేరూ తనవయ్యేయి.

ఓ రోజున గాలి గగ్గోలు పెడ్తూ పరుగులు తీసింది. ఆకాశంలో నల్లటి మబ్బులు మేఘాలు ఫట్టుమని పగిలేయి. నీళ్లు కుండల్తో గుమ్మరించేయి. వర్షానికి వూరు వూరంతా తడిసి ముద్దయిపోయింది. కానీ మన స్వామి ధ్యానంలోంచి లేవనే లేదు. ఊళ్లో వాళ్లు చూస్తూ వూరుకోలేక అతణ్ణి ఓ పాడుబడ్డ మసీదులోకి చేర్చారు.

కాలమనేది ఓ నిరంతరం భ్రమించే చక్రం. అదలా గిర్రున తిరుగుతూ మనుషుల్లో పరిసరాల్లో అనేకమైన మార్పులు తెస్తుంది. ‘ఔరా' అనిపిస్తుంది. జనన మరణాల కొలిమిలో మనిషిని కాలుస్తుంది.

మొన్నటి కుర్రాడు నేటికి పండిన ఆకు అవుతాడు. ఎందరెందరికో చీకట్లో దారి చూసే దీపమవుతాడు. తోడూ నీడా అవుతాడు. కొందరికి దేవుడు అవుతాడు. పేదల పాలిటి పెన్నిధి అవుతాడు.

తెల్లటి గడ్డం మీసం, పొడుగాటి సూటి ముక్కు గుచ్చి చూసే కళ్లూ, మోకాళ్ల కిందకి లుంగీ తలకి గుడ్డా చుట్టి అభయహస్తం చూపుతూ కూచున్న సాదాసీదా మనిషి ముందుకి వచ్చి నించున్నాడతను.

ఎవరు నాయనా నువ్వు అనడిగాడు కళ్లనిండా ప్రేమని ఒలకబోస్తున్నవాడు కనిపించీ కనిపించని చిరునవ్వు పెదవి మీద నక్షత్రంలా మెరుస్తుంటే.

నేను.. దేవుడి భక్తుడ్ని. నీ సంగతే కనుక్కుందామని వచ్చాను అన్నాడు వచ్చినవాడు. నాకంటూ సంగతేమీ లేదు. ప్రతి మనిషీ తన సంగతేమిటో చూసుకోడానికే లోకానికి వస్తాడు అన్నాడు కళ్లల్లో ప్రేమ పొంగి పొరలుతున్నవాడు.

నువ్వు దేవుడి వంటగదా! అన్నాడు కనుక్కుందామని వచ్చినవాడు.

అన్నానానేనా మాట! నేను దేవుణ్ణని ఎవరితో చెప్పానుట అన్నాడు సాదాసీదా మనిషి.

అంటూ వుంటే విన్నాను. రాముడో, కృష్ణుడో దేవుళ్లవుతారు కానీ నువ్వేం దేవుడివి.

యేం శివుడు కాడా దేవుడు మసీదులో లేడా చర్చిలో కనుక్కున్నవా

కనుక్కోడానికి వచ్చినవాడు కాస్సేపు ఆలోచన్లో పడ్డాడు.

ఊహు.. నాకెవ్వరూ తెలీదు. నా రాముడు తప్ప. ఆయన ఒక్కడే దేముడు. నువ్వు ఉట్టి మనిషివి. సాదాసీదా మనిషివి. నువ్వు దేవుడివి కాదు. నువ్వు దేవుడవడానికి వీల్లేదు.

ఏ దేవుణ్ణయినా సరే ఎవరో ఒకరు దేవుణ్ణి చేసి నిలబెడితే దేవుడవుతాడు. గుడివాకిట వుండే రాయి గడప అవుతుంది. గర్భగుడిలో వుండే రాయి దేవుడవుతాడు.

రాయి దేవుడయినా సరే కానీ మనిషి దేవుడవడానికి మాత్రం వీళ్లేదు అన్నాడు సంగత్తేల్చుకోవడానికి వచ్చానన్నవాడు.

నువ్వు ఇట్లా నా ముందు నిలబడి మాట్లాడినట్టు నీ రాముడితో మాట్లాడరాదూ.. సందేహాలు తీరిపోతయి.

అంత సులభంగా దొరుకుతాడా దేవుడు. ఎంత తపస్సు చెయ్యాలి. ఎంత శోధించాలి. దేవుడంటే ఆషామాషీగా కనపడేవాడు కాడు సుమా.

మరి ఆషామాషీగా కనిపిస్తున్న నేను దేవుడ్నిలా అవుతాను కానుగదా అన్నాడు పేదల దేవుడు అనిపించుకున్నవాడు. ఒళ్లంతా నగలూ, ధగధగలాడే కిరీటమూ లేనివాడు.

కావు కానీ కొందరు నువ్వు కూడా దేవుడివేనని అంటున్నారు. అందుకే ఈ గొడవ.

దేవుడెట్లాగూ కనిపించడు. ఒకవేళ మనుషుల్లోకి నడచివొచ్చినా వాళ్లతో కల్సిపోడు. కల్సి తిరగడు. కల్సి కష్టాలు పంచుకోడు. దేవుడికీ మనిషికీ ‘కమ్యూనికేషన్' లేనప్పుడు మనిషిలోనే దేవుణ్ణి వెదక్కునే వాళ్లు నన్ను దేవుడంటున్నారేమో నాయనా. నాకు మటుకి దేవుణ్ణవ్వాలనే అత్యాశ యేమీలేదు అన్నాడు తెల్లగడ్డం మీద పగడంలా మెరుస్తున్న పెదిమవున్నవాడు.

అలాగయితే ఈ జనాన్ని నీ దగ్గరికి రావొద్దని చెప్పు. పేదల కోసం వెలసిన దేవుడివని ప్రచారం చెయ్యవద్దని చెప్పు అన్నాడు దేవుడి మనిషి.

నేను ఎప్పుడూ ఎవర్నీ రమ్మని అనలేదు. రావొద్దనీ చెప్పలేను. ఎందుకో వాళ్లే వచ్చి తమ కష్టాలు చెప్పుకుంటారు. తమ గోడు చెప్పుకోడానికి నేనున్నానని అనుకుంటారు. ఓపిగ్గా వింటాను కనుక చెప్తారు. నేనేం దేవుణ్ణి కాదు గదా వరాలివ్వడానికి. అన్నింటికీ చిర్నవ్వే నా సమాధానం. అది వాళ్లకి కొండంత ధైర్యాన్నీ బలాన్నీ యిస్తుందని వాళ్లు అనుకుంటారు. సబ్ కా మాలిక్ ఏక్ హై అని చెప్పేనేను ఎవరి దేవుళ్లని వాళ్లే తేల్చుకోవాలని చెప్తాను. కన్నీళ్లు పంచుకోడానికి, కష్టాలు చెప్పుకోడానికి మనిషి ఆవిష్కరించే ఏ దేవుడయినా అతని నమ్మకమే. నమ్మకమే దేవుడు నాయనా అన్నాడు చెరగని చిరునవ్వున్న సాదాసీదా మనిషి.

నమ్మకమే దేవుడయినప్పుడు ఈ గొడవంతా దేనికి? ఎవరి నమ్మకం వారిదే అయినప్పుడు ఈ గోలంతా దేనికి? నువ్వు నా దేవుడివి కాదు. నా నమ్మకానివీ కాదు. అయితే నువ్వే నమ్మకం అని నమ్మకంగా అనుకునే వారికి అడ్డు రావాలనుకోవడం నాకైనా ఎవరికైనా మేం అవసరం? అంటూ వెళ్లిపోయాడు కనుక్కోడానికి వచ్చిన వాడు.

-చింతపట్ల సుదర్శన్

English summary
Prominent columnist Chintapatla Sudarshan in column quick boxing writes about communication skills
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X