• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యక్తి వికాసానికి ప్రశంస, ప్రోత్సాహం ఆవశ్యకత

By Pratap
|

Personality development: encouragement role
ఎవరో మెచ్చాలని ఏ పూవు పూయదు. పరిమళించదు. పువ్వు పూయడం, సుగంధాలు వెదజల్లడం, దాని స్వభావం. ప్రకృతి తన సహజ పద్దతుల్లో ముందుకు సాగుతూ ఉంటుంది. మానవ సమాజంలో సహజ స్వభావం చుట్టూత ఉండే సమాజ స్వభావాన్ని అనుకరిస్తూ సహజ స్వభావాలను మలుచుకుంటుంది.

మన జీవితమే ఒక నిబంధిత అభ్యసనం...

సామాజిక జీవితం అంటేనే అది ఒక నిబంధిత అభ్యసనం. దాన్నే సహజత్వం, సహజాతాలుగా భావిస్తుంటారు. కానీ అదంతా స్థల కాలాల పరిసరాల నుండి రూపు దిద్దుకుంటున్న, నేర్చుకుంటున్న, నేర్పబడుతున్న మూర్తిమత్వం, వ్యక్తిత్వం. ఇలా వ్యక్తిత్వం, జీవితం, సంస్కృతి, అలవాట్లు, ఇంగిత జ్ఞానం, నిబంధిత అభ్యసనంగా కొనసాగుతుంటుంది.

ఉదా||కు గిరిజన సమాజంలో అదేస్థాయి మూర్తిమత్వం వ్యక్తిత్వం, చుట్టూత ఉండే సమాజంలో రూపుదిద్దుకుంటుంది. నగరంలో, లండన్‌లో జిల్లా అధికారి, కలెక్టర్‌ ఇంట్లో చుట్టూత ఉండే పరిసరాలు మనుషులను అనుకరిస్తూ హావభావాలు, వ్యక్తిత్వం, మూర్తిమత్వం వికాసం చెందుతుంది. అందుకే చాలామంది మంచి ఏరియాలో ఇల్లు కిరాయికి కావాలని వెతుకుతుంటారు. మంచి స్కూలు కోసం, మంచి కాలేజి కోసం, మంచి యూనివర్శిటీ కోసం వెతుకుతుంటారు, చేర్చుతుంటారు. చేరు తుంటారు. మంచి కంపెనీలో, మంచి డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.

ప్రశంస గొప్ప ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుంది...

ఎదిగే క్రమంలో ప్రశంస అనేది ఎంతో అవసరం. ప్రశంస, మెప్పుకోలు అనేవి ఎంతో శక్తినిస్తాయి. తనలోని శక్తి సామర్ధ్యాలను, సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికితీసుకోడానికి, సానబెట్టుకోవడానికి ప్రశంస ఎంతో ఉపయోగపడుతుంది. నా చిన్నప్పుడు ఐదో తరగతిలో సార్లు అడిగినవన్నీ చెప్తూ, చెప్పినవన్నీ రాస్తూ, చూపిస్తుంటే మెచ్చుకుంటూ ఉంటే చదువంటే ఎంతో ఉత్సాహం కలిగింది. ఇంకా నేర్చుకోవాలనే కోరిక, ఆసక్తి పెరిగింది. 10వ తరగతి నుండి వ్యాస రచన, వక్తృత్వ పోటీ, ఆటల పోటీ వగైరాల్లో పాల్గొంటున్నప్పుడు సార్లు, క్లాస్‌మేట్లు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. కవితలు రాసినపుడు సార్లు మెచ్చుకుంటుంటే ఎంతో ఉబ్బిపోయేవాళ్ళం. అలా ప్రోత్సహించడం ద్వారా మేము ఎలా ఎదగాలో సూచించినవాళ్ళయ్యారు.

హేళన మనిషి శక్తిని హరిస్తుంది...

ప్రతి మనిషిలో అనేక శక్తిసామర్ధ్యాలు, సృజనాత్మక శక్తులు దాగి ఉంటాయి. టీచర్లు, లెక్చరర్లు, నాయకులు, గురువులు చేసే పనల్లా... చేయాల్సిన పనల్లా... వాటిని వెలికితీసి సానబెట్టడం. అందుకే స్ఫూర్తినిచ్చే వారు గొప్ప ఉపాధ్యాయులని నిర్వచించారు. పాఠం చెప్పే ఉపాధ్యాయుడు చెడ్డ ఉపాధ్యాయుడు. బట్టీయం చెప్పే ఉపాధ్యాయుడు చెడ్డ ఉపాధ్యాయుడు. అది జ్ఞాపకం చేసుకురాలేదని కొట్టే, హేళన చేసే ఉపాధ్యాయుడు మహా మూర్ఖ ఉపాధ్యాయుడు. వాళ్ళు ఎదగలేదు, తన మూర్ఖత్వంతో లక్షలాది విద్యార్ధుల శక్తి సామర్ధ్యాలను, సృజనాత్మక శక్తులను ద్వంసం చేసి, వారి జీవితాలను నాశనం చేశారు. మా కాలపు జీవితంలో ఇలాంటి ఉపాధ్యా యులు ఎందరో...

ఉదా||కు మా క్లాస్‌మేట్‌లను కొందరు టీచర్లు హేళన చేసేవారు. విమర్శించేవారు, కొట్టేవారు. ఎవరికైనా చదువు రాకూడదని అనుకుని బడికి రారుకదా...! ఎంత కష్టపడ్డా వారికి జ్ఞాపకం ఉండేది కాదు. దాంతో టీచర్లు కొట్టేవారు. ఒక హిందీ ఉపాధ్యాయులు ఆరు ఏడు తరగతుల్లో పిర్రలమీద బరిగెలతో కొడితే క్లాసురూములోనే మూత్రం పోసుకునేవారు. ఒకరిద్దరు దొడ్డికి కూడా పోయేవారు. అయినా ఆ ఉపాధ్యాయుడు కొట్టడం మానలేదు. ఆయన కొట్టకుండా క్లాసులో మిగిలింది ఏముగ్గురు నలుగురో... ఆయన క్లాసు ఉందనగానే అందరికీ భయం వేసేది. ఆయనని ఇప్పటికి 50 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా చాలామంది విద్యార్ధులు క్షమించలేకపోతున్నారు. ఈపాటి చదువుకు అంతగనం కొట్టాలా అని, సారు ఎపుడు చస్తాడో అని ఎదురు చూసేవాళ్ళు. విద్యావిధానంలో ఎన్ని మార్పులు వచ్చినా కొందరు టీచర్లు మారడం లేదు.

ప్రశంస అనేది నీరు, ఆహారం వంటిది...

ప్రశంస అనేది నీరు, ఆహారం వంటిది. అది లేకపోతే శుష్కించిపోతారు. ప్రశంస ఎక్కువైతే అజీర్ణం అవుతుంది. ఎక్కువ ప్రశంసించకూడదు. చెడిపోతారు. అందువల్ల ప్రశంస అనేది ఎంతో బాధ్యతాయుతమైనది. తల్లిదండ్రులు, టీచర్లు, బాస్‌లు, నాయకులు, సహచరులు, అనుచరులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. మంచి పని చేసినపుడు తల్లిదండ్రులనుండి పిల్లలు మెప్పును ఆశిస్తారు. తల్లిదండ్రులు తప్పకుండా ప్రశంసించాలి. ఏదైనా పని నచ్చనపుడు ఓపికగా చెప్పి మాన్పించాలి. కొట్టుడు, తిట్టుడు, కోపగించడం వల్ల అది ఎందుకు మానాలో తెలియదు.

కుటుంబంలో, భార్యాభర్తలు, పిల్లల మధ్య కూడా ప్రశంస అవసరం...

కుటుంబంలో భార్యాభర్తలు నిత్యం చిన్న చిన్న ప్రశంసలు, మెప్పుకోలు కోరుకుంటారు. ఆశిస్తుంటారు. ఆ రోజు వంట చాలా బాగుందని ఒక్కొక్క ఐటం గురించి ఒక్కొక్క వాక్యంతో వివరంగా మెచ్చుకుంటే భార్య వంట చేసిన కష్టం అలసట మర్చిపోతుంది. ఉత్సాహంగా మరికొన్ని మంచి వంటలు రుచికరంగా చేయాలనుకుంటుంది.

సాధారణంగా వంట చేసినవాళ్ళు మెప్పును కోరుకుంటారు. మెచ్చుకుంటే ఎంతో తృప్తి. అందువల్ల తన పిల్లలు, భర్తతో సహా ఇంటికొచ్చిన అతిథులు కూడా తన వంటను, ఇంటిని అందంగా తీర్చిదిద్దిన తీరును మెచ్చుకుంటే ఎంతో సంతోషిస్తారు. సాధారణంగా భార్యలు, భర్త లేనప్పుడు వంటకూడా సరిగా చేయరు. ఏవో పచ్చళ్ళు వేసుకొని తింటారు. భర్త ఫోన్‌ చేసి తిన్నావా లేదని అడగాలని ఆశిస్తుంటారు. అందు వల్ల భర్త తప్పకుండా ఫోన్‌ చేయాలి. ఏమేమి కూరలు చేశావని అడుగుతూ చేయాలని చెప్పాలి. అప్పుడు ఉత్సాహం కలుగుతుంది. సాధారణంగా స్త్రీలు ఆరోగ్యం బాగాలేనపుడు డాక్టరుదగ్గరికి వెళ్లాలని అడగరు. తాను ఎవరికైతే సేవలు చేస్తుందో... ఎవరినుండి ఆశిస్తుందో... వారు హాస్పిటల్‌కు పోదాం పద... అని ఒత్తిడి చేయాలని ఎదురు చూస్తుంటారు. ఇది కూడా ఒకరకంగా ఎదుటివారి సానుభూతిని, గుర్తింపును కోరుకోవడమే.

జీవితమంతా అభినందనలు, ప్రశంసలు ఎంతో అవసరం...

పిల్లలు మాటలు నేర్చుకుంటున్నప్పుడు, నడక నేర్చుకుంటున్నపుడు, ఆటపాటలు నేర్చుకుంటున్నపుడు ప్రోత్సహించిన కొద్దీ ఉత్సాహంగా మరిన్ని నేర్చుకుంటారు. ప్రశంస అనేది మనిషిలోని శక్తి సామర్ధ్యాలను సృజనాత్మక శక్తులను వెలికితీసే పాతాళగరిగెవంటిది. ఇసుకను తోడి చల్లే చెలిమ వంటిది. ప్రతిమనిషికి నిరంతరం ప్రోత్సాహం, ప్రశంస అవసరం. అందుకే చిన్నప్పుడు మాటలు నేర్చేప్పుడు ప్రశంసించినట్టుగానే ఒకటో తరగతి మొదలుకొని ఉన్నత విద్య దాకా అనేక ప్రోత్సాహకాలు, ప్రశంసలు అంది స్తుంటారు. అలాగే సర్పంచ్‌ మొదలుకొని ప్రధానమంత్రి, దేశాధ్యకక్షులుగా ఎన్నికైనప్పుడు కూడా అభినందనలతో ప్రశంసిస్తుంటారు. ఆట పాటల్లో, సాహిత్యంలో, కళల్లో బహుమతులు, బిరుదుల ద్వారా ప్రశంసిస్తుంటారు.

అమ్మ నాన్నలు చేసే ప్రశంస మొదలుకొని స్నేహితులు, స్కూలు, మండల, జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దాకా అనేక స్థాయిల్లో ప్రోత్సాహకాలు, ప్రశంసలు ఇవ్వడం జరుగుతున్నది. సాహిత్య అకాడెమీ అవార్డులు, పద్మశ్రీలు మొదలుకొని భారతరత్న దాక, జ్ఞానపీఠ్‌ అవార్డుదాక, నోబుల్‌ బహుమతిదాక గల బహుమతులు, బిరుదులు ప్రశంసలు అన్నీ అవి అందుకొన్న వారితోపాటు మిగతా సామాజానికి ప్రోత్సహకాలుగా స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

ఇలా జీవితమంతా అభినందనలు, ప్రశంసలు, గుర్తింపులు, గౌరవాలు అవసరం. జీవితమంతా వీటి అవసరాన్ని గుర్తించిన తర్వాత నేడు అన్ని రంగాల్లో అభినందనలు, ప్రశంసలు, ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టబడ్డాయి. పెద్ద పెద్ద కంపెనీలలో ఎంత పెద్ద అధికారి అయినా తన సిబ్బంధిని ఎప్పటి కప్పుడు అభినందించడం, ప్రోత్సహించడం, ప్రశంసించడం ద్వారా వారిలో ఉత్సాహాన్ని కలిగించి, వారి ఉత్పాదకతను, శక్తి సామర్ధ్యాలను ఎన్నో రెట్లు పెంచగలుగుతున్నారు. గత కొన్ని థాబ్దాలుగా యూరప్‌, అమెరికాల్లో మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాల్లో... ప్రశంసించడం, అభినందిం చడం, సిబ్బందిలోని శక్తి సామర్ధ్యాలను, సృజనాత్మక శక్తులను వెలికి తీయడమే వారి సామర్ధ్యానికి నిదర్శనమని... వాటిని ఎలా సాధించుకోవాలో అనుభవాలను క్రోడీకరిస్తూ గ్రంథాలు వెలువడుతున్నాయి. కొందరికి విమర్శించడమే తప్ప ప్రశంసించడం రాదు. వారి హృదయం బండరాయి. వాళ్ళు మనుషులను రాళ్ళుగా మార్చుతారు. ఆ రాళ్ళు తిరుగుబాటు చేసి అప్పుడప్పుడు ఆ బండరాళ్ళను పగలగొడతారు.

పిల్లల ప్రేమను పొందాలి... అందుకు కృషి చేయాలి...

పిల్లలు, కుటుంబంలోని భార్య, తమ్ముళ్ళు చెల్లెలు, మరుదులు, మరదళ్ళు ఇలాగే తమ పట్ల ఏమేరకు ప్రేమ ఉందో, శ్రద్ద ఉందో గమనిస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు. ఉదాహరణకు ఇంటికి వచ్చేటపుడు ఒక పెన్నో, పండ్లో తీసుకురమ్మని అడిగాక వచ్చేటపుడు తేకపోతే బాధపడతారు. తమపై ప్రేమ ఉంటే తెచ్చేవారు అనుకుంటారు. మర్చిపోవడం అనేది ప్రేమలేక పోవడంలో భాగంగా జరిగిందని భావిస్తారు. అలాగే ఇంటికి వచ్చే అతిథులు చిన్న గిఫ్టులు, పండ్లు తెస్తే పిల్లలతో సహా, పెద్దలు కూడా వద్దు వద్దంటూనే ఎంతో సంతోషిస్తారు. ఇలా ప్రేమను, ఆత్మీయతను కోరుకుంటారు. అది అందించాల్సిన వారు ఇలా అనేక రూపాల్లో దాన్ని వ్యక్తం చేయాలి.

కార్యకర్తల ప్రేమను పొందాలి... వారి హృదయాన్ని గెలుచుకోవాలి...

ఒక ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేసే ఇద్దరి స్వభావాల్లో తేడా గమనించాను. ఒకాయన అన్నా...! నాకు డ్రెస్సులు లేవు అని కలిసి నపుడల్లా చెప్పేవాడు. ఉత్తరంలో గుర్తు చేసేవాడు. అతనివద్ద డబ్బులు ఉండేవి. కానీ అన్న తీసుకొమ్మంటేనే తీసుకోవాలి అనుకున్నాడు.

మరొకాయన తనకు డ్రెస్సు అవసరమని తీసుకొని నెలవారీ ఖర్చుల పద్దులో అది కూడా రాసి ఇచ్చేశాడు. నాయకుడు చెక్‌ చేస్తేనే డ్రెస్‌ కొన్నట్టు తెలుస్తుంది. ఇలా ఒకాయన స్వయంగా నిర్ణయం తీసుకొని డ్రెస్‌ తీసుకున్నాడు. మరొకాయన అన్న ఆజ్ఞ కోసం, ప్రేమకోసం ఎదురుచూశాడు. నాయకుడు దాన్ని సరిగా పట్టించుకోలేదు. దాంతో డ్రెస్సు అడిగిన యువ కామ్రేడ్‌ అన్నకు నా పట్ల ప్రేమ లేదు అనుకున్నాడు... పార్టీలోంచి, ఉద్యమంలోంచి బయటకు వెళ్ళిపోదామని మానసికంగా సిద్దమయ్యాడు. అంతలో రాష్ట్ర నాయకుడు కలిశాడు. మాట సందర్భంగా డ్రెస్సులు ఎన్ని ఉన్నాయి. ఏమైనా కావాలా? తీసుకో అని తనకు తానే గుర్తు చేశాడు.

దాంతో ఆ యువ కామ్రేడ్‌ ఎంతో సంతోషపడిపోయాడు. పార్టీనుండి, ఉద్యమం నుండి వెళ్ళిపోవాలనే ఆలోచనను విరమించుకున్నాడు.

నాయకత్వ వికాసంలో జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు...

ఆ తర్వాత యువ కామ్రేడ్‌ లేని సమయంలో జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు కలిసి చర్చించుకున్నారు. యువ కామ్రేడ్‌ డ్రెస్‌ను చూసి తాను డ్రెస్‌ల గురించి అడిగానని చెప్పాడు. అతనికి డ్రెస్సులు కుట్టించుకోమని ఎందుకు చెప్పలేదని అడిగాడు. అవును... నిజమే... ఒకటి రెండు సార్లు అడిగినట్లున్నాడు. నేనే అశ్రద్ధ చేశాను అని అన్నాడు. అప్పుడు రాష్ట్ర నాయకుడు వ్యక్తిత్వ స్వభావాల గురించి, జిల్లా నాయకుడికి హితబోధ చేశాడు.

''ఎస్సీ, ఎస్టీ, బీసీల నుండి వచ్చే కార్యకర్తలు, నాయకులనుండి ప్రేమను ఆశిస్తారు. మెప్పును ఆశిస్తారు. తమ గురించి ఏమేరకు పట్టించుకుంటున్నారు. తమపట్ల ఎంత ప్రేమ ఉంది అని ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటారు. గమనిస్తుంటారు. అదే అప్పర్‌ క్యాస్ట్‌ నుండి వచ్చిన కార్యకర్త అయితే డ్రెస్సుల గురించి, నెలవారీ ఖర్చుకు బడ్జెట్‌ పెంచడం గురించి మనని అడగరు. ఖర్చు చేసి పద్దు రాసిస్తారు. ఎక్కువ ఖర్చు అయింది ఏమిటి అని అడిగితే అవును... అని ఎందుకైందో చెప్తుంటారు.

కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలనుండి పేదరికంనుండి వచ్చిన కార్యకర్తలు అలా ఖర్చు చేయరు. మననే అనుమతి కోసం అడుగుతుంటారు. వారివద్ద ఎంత డబ్బున్నా, మన అనుమతి కోసం ఎదురుచూస్తుంటారు. కేవలం ఇది అనుమతి ఇవ్వడం కోసమే కాదు. మననుండి వారు తల్లిలాంటి ప్రేమను ఆశించి, ఎదురుచూస్తుంటారు. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకపోతే వాళ్ళు కొంతకాలం తర్వాత ఉద్యమం నుండి వెళ్ళిపోతారు. ప్రతి చిన్న విషయాన్ని, వారి అవసరాలను పట్టించుకొని అడుగుతూ ఉండాలి. అడగకముందే అవసరాలను గుర్తించి తీసుకొమ్మని చెప్తూ ఉండాలి.

కార్యకర్తల అవసరాలను గుర్తించడం నాయకత్వ సామర్ధ్యానికి నిదర్శనం...

ఉదాహరణకు ఆయన చేతికి వాచీ లేదు. వాచీ లేకుండా అతడు మనం చెప్పిన సమయానికి, చెప్పినచోట కలవడం ఎలా సాధ్యం. వాచీని కొనుక్కొమ్మని మనమే చెప్పాలి. ఇపుడు ఆ కామ్రేడ్‌ వచ్చాక నువ్వే వాచీ కొనుక్కొమ్మని చెప్పు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు ఇలా కొంతకాలం దాకా లోప్రొఫైల్‌తో మననుండి ప్రేమను, ఆత్మీయతను ఆశిస్తుంటారు. ఎంత గొప్పవాళ్ళైనా వీరు కావాలనే లో ప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తారు. కానీ వారు కమిట్‌మెంట్‌లో కానీ, అవగాహనలో కానీ ఎవరికీ తీసిపోరు. పైగా కమిట్‌మెంట్‌ ఎక్కువే ఉంటుంది.

మనం కార్యకర్తలను ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ నుండి ఆత్మ విశ్వాసం పెంచుకునేవిధంగా తీర్చిదిద్దాలి. మనని అడగకుండానే డ్రెస్సును, వాచీని తీసుకున్నా అన్న ఏమనుకోడు. తిండికోసం ఖర్చు పెరిగినా ఏమనుకోడు అని వాళ్ళకు విశ్వాసం కలిగేవిధంగా ప్రోత్సహించాలి. వారికి స్వేచ్ఛను, స్నేహాన్ని అందించాలి.'' అని అన్నాడు రాష్ట్ర నాయకుడు.

దాంతో జిల్లా నాయకుడికి జ్ఞానోదయం అయింది. జిల్లా నాయకుడు కార్యకర్తను వాచీ కొనుక్కొమ్మని చెప్పడంతో ఆ యువ కామ్రేడ్‌కు ఎంతో సంతోషం వేసింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా కనపడతాయి. కానీ ఇవే ఎంతో పెద్ద విషయాలకు, పెద్ద నిర్ణయాలకు దారి తీస్తాయి.

తాము పుట్టి పెరిగిన పరిస్థితులను అనుసరించి కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. వాటిని స్నేహితులు హేళన చేయకూడదు. ఒక శిక్షణా శిబిరం జరుగుతున్నది. ఒక కామ్రేడ్‌ టూత్‌పేస్ట్‌ను కొద్దిగానే బ్రష్‌ పై పెట్టుకున్నాడు. మరొక కామ్రేడ్‌ పిసినారి అని నవ్వుతూ హేళన చేశాడు. ఎవరూ ఇంటినుంచి తేలేదు. అన్నీ ఉద్యమంలో భాగంగా సమకూర్చినవే. ఏదీ అక్కడ వ్యక్తిగత ఆస్థి కాదు. అక్కడ పిసినారి తనం, చర్చ అవసరం లేదు. దీనిపై శిక్షణా తరగతుల్లో సీరియస్‌గా చర్చ జరిగింది. హేళన చేసిన కామ్రేడ్‌ అందరి ముందూ క్షమాపణ కోరాడు. చిన్నప్పటినుండి పేదరికంలో, పొదుపులో భాగంగా టూత్‌ పేస్ట్‌ కొద్దిగానే పెట్టుకోవడం అలవాటైంది. మరొకాయనకి బ్రష్‌ నిండా పేస్ట్‌ పెట్టుకోవడం అలవాటుగా వచ్చింది. ఇందులో ఎవరిదీ తప్పు కాదు. నువ్వు ఎక్కువ వాడావని, నువ్వు పిసినారివని విమర్శించుకోవడం సరికాదు. ఉద్యమంలో చేరి కలిసి పని చేస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో సంస్కారం, ఎప్పటికప్పుడు పెంచుకోవాల్సి ఉంటుంది.

చెప్పకుండానే ఫీలయ్యేవి కొన్ని ఉంటాయి...

చెప్పకుండానే నాయకులపట్ల, కార్యకర్తలు ఫీలయ్యేవి కొన్ని ఉంటాయి... నాయకులు వాటిని గమనించాలి. అలా నాయకులపట్ల స్వంతంగా కొన్ని అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఆ అభిప్రాయాలను అనుసరించి నాయకుడికి తమకు మధ్య సంబంధాలు ఎలా ఉండాలో నిర్ణయించు కుంటారు. పైన చెప్పిన డ్రెస్సు, వాచీ కార్యకర్త ఉదాహరణలో ఆ కార్యకర్త తనకు నాయకత్వం వహిస్తున్న నాయకుడి ప్రవర్తనను అనుసరించి ఉద్యమం నుండే వెళ్ళిపోవాలనుకున్నాడు. రాష్ట్ర నాయకుడి ప్రవర్తనను అనుసరించి తన అభిప్రాయాలను మార్చుకున్నాడు.

అలాగే కార్యకర్తగా నాకు చిన్నప్పుడు నాయకుల పట్ల కలిగిన అభిప్రాయాలు తద్వారా తీసుకున్న నిర్ణయాలను ఉదహరిస్తాను. నేను ఆర్‌.ఎస్‌.ఎస్‌లో పని చేస్తున్నపుడు హోల్‌ టైం ప్రచారకులు, మా యింట్లో భోం చేసేవారు కాదు. మధ్య తరగతి, సంపన్నుల ఇంట్లో భోంచేసే వారు. మేము భోజనం పెట్టే స్థోమత లేకపోయినా మా యింట్లో భోజనం చేయాలి అది మమ్మల్ని గౌరవించినట్టు అనుకునేవాళ్ళం.

ఒకసారి సోంపల్లి సోమయ్య అనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రచారక్‌ ఆంధ్ర ప్రాంతం నుండి జగిత్యాల వచ్చారు. ఆయన రాక సందర్భంగా ఎక్కువమందిని సమీకరించాలని నాలుగురోజులు రాత్రీపగలు కష్టపడ్డాము. ఉదయం 5 గంటలకే లేచి అందర్నీ రడీ చేయించాము. మీటింగ్‌ చాలా బాగా జరిగింది.

కార్యకర్తల ఆకలిని గమనించని నాయకులు....

మీటింగ్‌ తర్వాత కొద్దిసేపు బైటక్‌ జరిగింది. అప్పటికి మద్యాహ్నం 2 అయింది. ఆకలితో, నీరసంతో కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. స్పృహ కోల్పోతున్నట్లు అనిపిస్తోంది. మేం వెళ్ళి భోం చేసి వస్తాము అని అన్నాము. లేదు కూర్చోండి ఇంకా మాట్లాడాల్సింది ఉంది అన్నారు.

వాళ్ళు భోజనానికి కూర్చున్నారు. మాకు వరండాలోకి ఘుమఘుమ వాసనలు వస్తున్నాయి. ఆకలి ఇంకా పెరిగింది. వాళ్ళు భోంచేసి బ్రేవ్‌మని బ్రేవ్‌లు తీస్తూ వచ్చి కూర్చుని మరోగంట మాతో ఉద్యమ నిర్మాణం గురించి చర్చించారు. శోష వచ్చి పడిపోయినంత పనైంది. అప్పటికి సాయంత్రం 4 కావస్తున్నది. ఇంటికి వెళ్ళాము. ఎంతో బాధపడ్డాము. వాళ్లు మాకు కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేయించాల్సింది. లేదా మమ్మల్ని భోంచేసి వెంటనే రమ్మనాల్సింది.

ఈ రెండు చేయకపోవడంవల్ల మాకు కలిగిన అభిప్రాయం ఏమిటి? వాళ్ళు తోటివారి కష్టాల గురించి, అవసరాల గురించి, ఆకలి గురించి పట్టించుకోరు అని భావించాను.

నేను ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఐడియాలజీ నుంచి వైదొలగి వామపక్ష భావజాలా నికి, ఉద్యమానికి ఆకర్షితుడినైనప్పుడు ఈ విషయాలు గుర్తుకు వచ్చాయి. ఆనాడు ఎపుడో మా యింట్లో భోం చేయకపోవడం, మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు భోంచేయడం అనేవి చాలా తీవ్రమైన విషయాలు అనిపించాయి. ఈ చిన్న విషయాలే పెద్ద నిర్ణయాలకు దారితీశాయి.

భావాలు మారినా కొనసాగే స్నేహాలు... గౌరవాలు...

అయితే వాళ్ళకు ఇలా కార్యకర్తలు భావిస్తారని తెలియదు. అంత అనుభవం గానీ, వయస్సు గానీ లేదు. ఆ తర్వాత ఆ నాయకులు ఎంతో ఎదిగారు. ఒక ప్రచారక్‌ అఖిలభారత కిసాన్‌ సంఘ్‌ ప్రధానకార్యదర్శిగా ఎదిగారు. అతని పేరు కళ్లెపు విద్యాసాగర్‌జీ. మరొక ప్రచారక్‌ అఖిలభారత వనవాసి కళ్యాణ క్షేత్రకు పూర్తి స్థాయి నాయకులుగా ఎదిగారు. అతనిపేరు శ్రీధర్‌జీ.

ఆర్‌.ఎస్‌.ఎస్‌. నుండి దూరమైనా ఆ ప్రేమలు, స్నేహాలు, సహృదయత పరస్పర గౌరవాలు కొనసాగాయి. పరస్పరం చిత్తశుద్ధిని గౌరవించుకున్నారు. అలా 30 ఏళ్ళ తర్వాత కూడా సహృదయత కొనసాగడంవల్ల కళ్లెపు విద్యాసాగర్‌జీ అనేక విషయాలను చర్చించేవాడు. మూడో వ్యక్తి లేకుండా ఇద్దరమే 1992 నుండి తెలంగాణ రాష్ట్ర సాధన గురించి చర్చించుకున్నాము. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక పేద ప్రజలకు బిజెపికి ఉన్న పరిమితుల్లో ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా మేలు చేయవచ్చు అనే అంశంపై మీ సూచనలు చేయండి... అని కోరారు.

జనాభా లెక్కల్లో, ఓటర్ల లిస్టులో తప్ప ప్రజల గురించిన నిర్ధిష్ట జీవన ప్రమాణాల వివరాలు లేకపోవడంవల్ల అందుకు రూపొందించాల్సిన ప్రణాళికలు తప్పుల తడకగా మారుతున్నాయి. మొట్టమొదట ప్రజలు ఎలా జీవిస్తున్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమిటి? అని రికార్డులోకి తీసుకోవాలి. అందుకు ప్రావిడెండ్‌ ఫండ్‌ ఖాతా ఒక గొప్ప సహకారిగా ఉంటుంది. ప్రతిరోజూ చేసే కూలి కూడా ఒక సర్వీస్‌ బుక్‌ లాగ పెట్టి అందులో సర్పంచ్‌లచేత, గ్రామ కార్యదర్శిచేత నమోదు చేయించాలి... ఇలా మూడురోజులు ఈ ప్రతిపాదనపై చర్చించాము.

సబ్సిడీలలోని అవినీతి తగ్గడానికి... పిఎఫ్‌ ఖాతా...

అసంఘటిత గ్రామీణ పేదలు, అసంఘటిత, నగర కార్మికులు అందరికీ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా ప్రారంభించాలి. అన్ని సబ్సిడీలను అందులో డిపాజిట్‌ చేయాలి. డిపాజిట్‌పై 90 శాతం లోన్‌ ఇవ్వాలి. ఒక 10 వేలు జమ అయ్యాక లోన్లు తీసుకోవడం మానేస్తారు. ఇంకా పొదుపు చేయాలను కుంటారు. దీనివల్ల సబ్సిడీల ద్వారా జరుగుతున్న 40-60 శాతం దుర్వినియోగం ఆగిపోతుంది. 16 రూపాయల కిలో చొప్పున బియ్యం కొనాల్సిందే. 15 రూపాయలు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేస్తారు. ఇలా అనేక విషయాలను వివరంగా ప్రతిపాదించాను. దీనిపై రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీలో చర్చించారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి బిజెపి రూపొందించిన పిఎఫ్‌ బిల్లు...

అఖిలభారత కిసాన్‌ సంఘ్‌ తరఫున బిజెపి అధిష్టానానికి ఈ ప్రతిపాదన అందడంతో వాళ్లు ఆశ్చర్యపోయారు. రైతులు కూలీల గురించి అడగడ మేమిటి అని ప్రశ్నించారు. మాపై ఆధారపడి బతికే పేదల గురించి మేం పట్టించుకోవడం మా బాధ్యత అని చెప్పారు. చివరకు అసంఘటిత రంగ గ్రామీణ, పట్టణ కార్మికులకు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా ఏర్పాటు గురించి బిజెపి ప్రభుత్వం బిల్లు తయారు చేసింది. అది సెలెక్ట్‌ కమిటీలో ఉండిపోయింది. మహిళా బిల్లు, ప్రావిడెంట్‌ ఫండ్‌ బిల్లు పార్లమెంటులో చర్చకు రాలేదు.

ఈలోపు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు దిగాడు. బిజెపి కూడా పార్లమెంటు రద్దు చేసి ఎన్నికలకు దిగింది. ఎన్నికల తర్వాత మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. ఆ బిల్లు పెండింగ్‌లో పడిపోయింది. సి.పి.ఎం. వారికి ఆ బిల్లు గురించి చెప్తే వాళ్ళు తీసుకొని అనేక మార్పులు చేర్పులు చేసి బెంగాల్‌ శాసనసభలో ఆమోదించి అమల్లోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వంలోని బిల్లు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత దీన్ని నగదు బదిలీ పథకంగా పేరు మార్చారు. ఎన్నికల ఆకర్షణ పథకంగా మార్చేశారు. ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమచేయడం వేరు. నగదు బదిలీ పథకంగా మార్చడం వేరు.

వ్యక్తిత్వ వికాసం కోసం, సమాన అవకాశాలకోసం...

వ్యక్తిత్వ వికాసం కోసం, జీవన ప్రమాణాల కోసం, సమాన అవకాశాల కోసం రేపైనా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు, బీసీ రిజర్వేషన్‌ బిల్లు, అసంఘటిత రంగ గ్రామీణ, పట్టణ కూలీలకు, కార్మికులకు, పనిమనుషు లకు ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతా బిల్లు పార్లమెంటులో ఆమోదించి, అమలు చేయాల్సిందే. అప్పుడే అందరికి సమాన అవకాశాలు, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఉదా||కు యుకె, యుఎస్‌ఏ తదితర దేశాల్లో ప్రజాప్రాతి నిధ్యంలో నిష్పత్తి ప్రకారం తీసుకొంటే పార్లమెంటు సీట్లు 2,200లు చేయవచ్చు. 544 సీట్లు నిర్ణయించిన నాటి జనాభా కూడా ఇలాగే పెరిగింది. అలాగే చట్టసభల సీట్లు కూడా 4 రెట్లు చేయవచ్చు. తద్వారా అందరికి అవకాశాలు పెరుగుతాయి.

కష్టనష్టాల్లో, సాహసాల్లో, కర్తవ్యాల్లో రైతు గొప్ప ఆదర్శం...

ప్రశంస విషయంలో ప్రకృతిపై ఆధారపడే రైతు అందరికీ గొప్ప ఆదర్శం. రైతు కుటుంబం, కష్టాలకు కుంగిపోదు. తిరిగి తొందరలోనే నిలదొక్కు కుంటుంది. ఎవరి ప్రశంసలను ఆశించకుండా తిరిగి వ్యవసాయం చేస్తారు. అకిరోవా తీసిన 'సెవెన్‌ సమురాయ్‌' సినిమాలో యుద్ధం ముగిసిన తర్వాత ఎంతోమంది చనిపోయిన తర్వాత ఏమీ జరగనట్టే రైతులు తిరిగి పొలం పనుల్లో నిమగ్నమవుతారు. అది చూసి సమురాయ్‌లు మనకన్నా రైతులు ఎంతో గొప్పవాళ్ళు అనుకుంటారు. అనేక కష్టనష్టాలకు, ఒడిదుడుకులకు, కరువులకు, వరదలకు, గురిచేస్తున్నప్పటికి ప్రకృతి పై ఆధారపడి వ్యవసాయం చేస్తూ, ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులు గొప్పవాళ్ళు.

ఆధిక్యత... లోప్రొఫైల్‌ వ్యక్తిత్వాల మధ్య సంఘర్షణ...

పరస్పర గౌరవం, ప్రేమ, సంస్కారం, చిత్తశుద్ధిపట్ల విశ్వాసం ఉన్నపుడు ఇలా భిన్నాభిప్రాయాలతో దూరమైనప్పటికీ అనేక విషయాల్లో కలిసి పని చేయవచ్చు. ఎదుటివారిని గౌరవించనపుడే పరస్పరం విమర్శలు మొదలవుతాయి. ఒకరినొకరు కించపర్చుకుంటారు. పరస్పరం గౌరవించు కుంటూ కలిసి పని చేయడంవల్ల ఎన్నో పనులు సాధ్యమవుతాయి. పరస్పరం ఎదుగుతారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An eminent writer BS Ramulu stressed the need of encouragement in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more