బాబోయ్.. బెజవాడ! భాగ్యనగర్ బెస్ట్: ఎందుకు?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

అమరావతి: కోస్తాంధ్రకు చెందిన వారంతా తమ ప్రాంతం గొప్పలు కథలుకథలుగా చెప్పుకుంటారు. కానీ ఆచరణలోకి దిగితే గానీ వాస్తవాలు.. నిష్ఠూర సత్యాలు తెలియవు. దాదాపు ఆరు దశాబ్దాల ఆధిపత్య రాజకీయాలకు 2014లో తెరదించుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంతో తెగతెంపులు చేసుకున్న కోస్తాంధ్రా ప్రభుత్వ ఉద్యోగులు.. ఆ రాష్ట్ర రాజధాని 'అమరావతి'కి సకుటుంబంగా బయలుదేరి వెళ్లారు. కానీ అక్కడకు వెళ్లాక గానీ వారికి అసలు సంగతి అర్థం కాలేదు. క్లర్క్.. యూడీసీ మొదలు సెక్షన్ ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరూ బెజవాడ బాట బట్టారు.

చాలామంది ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే క్లర్క్‌గా పనిచేసే సతీశ్‌ కూడా తన భార్య, ఇద్దరు పిల్లలతో విజయవాడకు మకాం మార్చాడు. విజయవాడ అంటే ఎండలే కాదు.. ఇక్కడ ధరలూ సెగలు పుట్టిస్తాయనే చేదు నిజం అతనికి తొందరగానే అర్థమైంది.

విజయవాడలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటి అద్దె నెలకు రూ.16 వేల వరకు ఉందని తెలిసి.. శివారు కాలనీల్లోకి వెళ్లాడు. కానీ అక్కడా.. రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉన్నాయి. ఇలా ఒక్క అద్దె ఇల్లే కాదు.. స్కూలు ఫీజులు, సినిమా టికెట్‌ ధరలు, ఆస్పత్రి చార్జీల వరకు అన్నీ సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయని సతీశ్‌కు బోధపడింది.

ప్రభుత్వ నియంత్రణ కొరవడినందుకే

ప్రభుత్వ నియంత్రణ కొరవడినందుకే

ఇది సతీశ్ ఒక్కడి పరిస్థితే కాదు. బెజవాడలోని సగటు మానవుడి దుస్థితి. బెజవాడలో బతకడం అంటేనే తలకుమించిన భారంగా మారుతోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా మారిన తర్వాత విజయవాడ జనాభా 14 లక్షలకు చేరి ఉంటుందని అంచనా. ఇక్కడ దాదాపు 80 శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాలే. ధరల పెరుగుదలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. రాజధానిగా రూపాంతరం చెందిన విజయవాడ నవ్య బెజవాడగా మారిందా? అన్న పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ అంతరాయాలు నిత్యక్రుత్యంగా మారింది. వసతుల మాటెలా ఉన్నా హైదరాబాద్ నగరంతో పోలిస్తే విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులు కూడా ఠారెత్తిస్తున్నాయి.

Municipal Fight | Vijayawada - Oneindia Telugu
ఇద్దరు పిల్లలకు రూ. లక్షల్లో ఫీజులు

ఇద్దరు పిల్లలకు రూ. లక్షల్లో ఫీజులు

విజయవాడ కానూరు వాసి సత్యప్రకాశ్ తన కొడుకు ప్రవీణ్‌ను 8వ తరగతి, కూతురు శ్రేష్ఠను 7వ తరగతిలో చేర్పించేందుకోసం నగరంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలకు వెళ్లారు. ‘మాది ఇంటిగ్రేటెడ్‌ సిలబస్‌.. మీ పిల్లలిద్దరికీ కలిపి బోధన రుసుము రూ. 1.50 లక్షలు అవుతుంది' అని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ చెప్పడంతో సత్యప్రకాశ్ అవాక్కయ్యాడు. 8వ తరగతికి రూ.80 వేలు, ఏడో తరగతికి రూ.70 వేలు అని లెక్కచెప్పడంతో ఆయనకు నోట మాట రాలేదు. సమీపంలోని మరో ప్రముఖ కార్పొరేట్‌ పాఠశాలకు వెళ్లారు. అక్కడా అన్నీ కలిపితే ఇద్దరికీ రూ. 3.40 లక్షలు అవుతుందని అనడంతో ఆయన హతాశుడయ్యారు. ఫీజుల విషయం ఇలా ఉంటే.. దుస్తులు, పుస్తకాలు, టై, బెల్టు, యూనిఫామ్స్‌ అన్నీ మా దగ్గరే కొనాలంటూ ముక్కుపిండి మరీ కొనిపిస్తున్నారు.

బెజవాడ స్కూళ్లన్నింటిలోనూ దోపిడీ

బెజవాడ స్కూళ్లన్నింటిలోనూ దోపిడీ

బయట మార్కెట్‌లో రూ.1000కి అందుబాటులో ఉన్న నోట్ పుస్తకాలకు కార్పొరేట్‌ పాఠశాలల్లో రూ.3 వేలు వసూలు చేస్తున్నారు. ఇక వర్క్‌షీట్లు, ఇతరత్రా అని చెప్పి రూ.750 కూడా చేయని పుస్తకాలకు మరో రూ.2000 గుంజుతున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలను మాత్రం కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఓ ఒలింపియాడ్‌ పాఠశాలలో గత ఏడాది ఆరో తరగతి విద్యార్థికి రూ. 40 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం ఏడో తరగతికి వచ్చేసరికి ఫీజు రూ.45 వేలకు చేరుకున్నది. వర్క్‌బుక్స్, దుస్తులు, ఇతర సామగ్రి మరో రూ.7000 ఖర్చు అదనం. కళలు, సాంకేతిక అంశాల్లో శిక్షణ అంటూ వసూలు చేసే మొత్తాలు అదనం. బెజవాడలోని దాదాపు 250 కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇదే తరహాలో దోపిడీ జరుగుతోంది.

భాగ్యనగరిలోనే ఆటో, క్యాబ్ చార్జీలు కనిష్టం

భాగ్యనగరిలోనే ఆటో, క్యాబ్ చార్జీలు కనిష్టం

హైదరాబాద్‌, ఇతర నగరాలతో పోల్చిచూస్తే విజయవాడలో ట్యాక్సీ, ఆటో చార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైల్వేస్టేషన్‌ నుంచి 10 కి.మీ. దూరంలోని కరెన్సీనగర్‌కు ఆటో చార్జీ రూ.150 వసూలు చేస్తున్నారు. ఆటో కనీస చార్జీ రూ.50. నగరంలో దాదాపు 13 వేల ఆటోలు, 3 వేల ట్యాక్సీలు, క్యాబ్‌లు ఉన్నాయి. ఇక ప్రధాన రోడ్డు పాయింట్లలో తప్ప అంతర్గత రోడ్లలో ఆటో స్టాండ్లు తక్కువే. అక్కడ ఆటో డ్రైవర్లు చెప్పినంత ముట్టజెప్పుకోవాల్సిందే.

ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండుకు ఆటోచార్జీ రూ.125, దుర్గగుడి మెట్ల మార్గం వరకు రూ.200 తీసుకుంటున్నారు. విజయవాడ కంటే హైదరాబాద్‌లోనే ఆటో, క్యాబ్‌ చార్జీలు తక్కువగా ఉండటం గమనార్హం. సికింద్రాబాద్‌ నుంచి 8 కి.మీ.దూరం ఉన్న మహాత్మగాంధీ బస్‌ టెర్మినల్‌ (ఎంజీబీఎస్‌)కు ఆటోలో వెళితే రూ.80.సికింద్రాబాద్‌ నుంచి 9 కి.మీ.దూరంలోని ఉప్పల్‌కు ఆటోలో రూ.110. సికింద్రాబాద్‌ నుంచి 19 కి.మీ.దూరంలోని హైటెక్‌ సిటీకి రూ.190 చెల్లిస్తే సరిపోతుంది.

ఇక క్యాబ్‌ల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎంజీబీఎస్‌కు ఒకరు వెళితే రూ.89 నలుగురు వెళితే రూ.158 చెల్లిస్తే గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అదే సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌కు ఒక్కరికి రూ.69, నలుగురికి రూ.129.. సికింద్రాబాద్‌ నుంచి హైటెక్‌ సిటీకి ఒక్కరికి రూ.168, నలుగురికి రూ.288 చెల్లిస్తే ఏం చక్కా క్యాబ్‌లో మనం చేరాల్సిన చోటుకు వెళ్లిపోవచ్చు.

హైదరాబాద్‌లో రూ.10 వేల లోపే

హైదరాబాద్‌లో రూ.10 వేల లోపే

గత రెండేళ్లలో ఇళ్ల అద్దెలు 40 శాతానికి పైగా పెరిగాయి. హైదరాబాద్‌ కంటే విజయవాడలోనే ఇళ్ల కిరాయిలు ఎక్కువగా ఉన్నాయని రాజధాని నుంచి తరలివచ్చిన ఉద్యోగస్తులు చెబుతున్నారు.. హైదరాబాద్‌లో లక్డీకాపూల్, శ్రీనగర్‌ కాలనీ, ఖైరతాబాద్, ఆనంద్‌నగర్‌ కాలనీ తదితర ప్రధాన ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.8000కు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ రూ.13,000కు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ 18,000లకు అద్దెకు లభిస్తున్నాయి. కానీ విజయవాడలోని గాంధీనగర్, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, వన్‌టౌన్, సత్యనారాయణపురం, పటమట తదితర ప్రధాన ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌రూమ్‌ రూ.10,000లకు, డబుల్‌ బెడ్‌రూమ్‌ 16,000కు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.20-22వేలకు అద్దెకిస్తున్నారు.

బెజవాడలో అదీ రూ.15 వేలు చెల్లించాల్సిందే

బెజవాడలో అదీ రూ.15 వేలు చెల్లించాల్సిందే

ఇక హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలైన హయత్‌నగర్, వనస్థలిపురం, చందానగర్, నాగోలు, మల్కాజ్‌గిరి, మౌలాలి వంటి ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రూ.5,500లకు, డబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.7000కు, త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ 10,000లకు కిరాయికి లభిస్తున్నాయి. ఇక విజయవాడలో నగర శివారు ప్రాంతాలైన గంగూరు, కంకిపాడు, నిడమానూరు, గొల్లపూడి, నున్న తదితర ప్రాంతాల్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ రూ.7,000, డబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.10,000లకు, త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ రూ.15,000లకు అద్దెలకు ఇస్తున్నారు. ఇక డీలక్స్‌ ఫ్లాట్స్‌ విజయవాడలో రూ.పాతిక వేలు నుంచి రూ.30 వేల వరకు పలుకుతున్నాయి.

ఏళ్ల తరబడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగదీత

ఏళ్ల తరబడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు సాగదీత

విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లకు విజయవాడ ప్రధాన కూడలిగా ఉంది. రాజధానిగా మారిన తర్వాత వాహనాల సంఖ్య అమాంతంగా పెరిగింది. 2015 లెక్కల ప్రకారం నగరంలో రోజుకు సగటున 3 లక్షలకుపైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వాటి సంఖ్య మరో 50 వేలు పెరిగి ఉంటుందని రవాణా శాఖ అధికారుల అంచనా. ఈ రెండేళ్లలో నగరంలో ఒక్క రోడ్డు కూడా విస్తరించక పోవడం గమనార్హం. ప్రధాన రోడ్లను అనుసంధానించే లింకు రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ఏళ్ల తరబడి సాగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. వన్‌టౌన్‌లో ప్రయాణం అంటేనే హడలిపోవాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డు ప్రధాన రోడ్లను అనుసంధానించే జంక్షన్లలో ట్రాఫిక్‌ జామ్‌ సర్వసాధారణంగా మారిపోయింది.

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌తో పరిస్థితి సంక్లిష్ఠం

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌తో పరిస్థితి సంక్లిష్ఠం

వాహనదారులు ఇష్టానుసారంగా పార్కింగ్‌ చేస్తుండటం కూడా ట్రాఫిక్‌ సంక్లిష్టంగా మారుతోంది. 2015లో నగరంలోని 28 ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై సర్వే నిర్వహించారు. ఆ ప్రాంతాల ద్వారా రోజుకు ప్రయాణించే వాహనాల సంఖ్య, పీక్‌ అవర్‌ (సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల)లో ప్రయాణించే వాహనాలపై సర్వే చేశారు. వాటిలో ప్రధానమైన 5 జంక్షన్లలో పరిస్థితి ఇలా ఉంది.

విజయవాడ శివారులోని పెనమలూరు నుంచి 13 కి.మీ. దూరంలో ఉన్న ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు బస్సు ప్రయాణం గంటన్నర పడుతోంది. ఆదే బైక్‌ మీద అయితే 45 నిమిషాలు, ఆటోలో అయితే గంటసేపు పడుతోంది. కరెన్సీనగర్‌ నుంచి ఏలూరు రోడ్డు ద్వారా రైల్వేస్టేషన్‌కు 10 కి.మీ. బస్సు ప్రయాణం గంటసేపు పడుతోంది. ఆటోలో అయితే 45 నిమిషాలు. నగర శివారులోని ప్రసాదంపాడు నుంచి బెంజ్‌ సర్కిల్‌కు రావడానికి గంటన్నర పడుతోంది. ఇక విజయవాడ పాతబస్తీలో ప్రయాణం అంటేనే హడలిపోవాల్సి వస్తోంది.

నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వన్‌టౌన్‌కు రావడానికి ఆటో డ్రైవర్లు ససేమిరా అంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దాదాపు 50 లక్షల వాహనాలు ఉన్నాయి. కానీ, విజయవాడ కంటే హైదరాబాద్‌ రోడ్లపైన కాస్త త్వరగా గమ్యానికి చేరుకోగలుగుతున్నారు. హైదరాబాద్‌లో 280 కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2,600 మంది సిబ్బందితో ట్రాఫిక్‌ వ్యవస్థను నియంత్రిస్తున్నారు.

రాజధానిగా మారడంతోనే ఇదంతా

రాజధానిగా మారడంతోనే ఇదంతా

విజయవాడలో కూరగాయల ధరలూ భగ్గుమంటున్నాయి. నలుగురు సభ్యులు గల కుటుంబానికి వారానికి సరిపడా చేతి సంచి కూరలు కొనాలంటే ఏడాది క్రితం రూ.150 నుంచి రూ.200 అయ్యేది. ఇప్పుడు రూ.300 ఖర్చు చేయాల్సి వస్తోంది. రిటైల్‌ మార్కెట్‌తో పోల్చితే రైతుబజార్‌లో కూరల ధరలు తక్కువగా ఉన్నా నాణ్యమైన ఆకు, కాయగూరలు లభించడంలేదు. గత్యంతరంలేక ప్రజలు రిటైల్‌ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో పండే క్యాబేజ్, దొండ, దోస, బీర వంటి కూరగాయల ధరలు కేజీ ఐదారు రూపాయలు మించి ఉండేవి కావు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పంటలు వేయకుండా ప్రభుత్వం అడ్డుకుంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే కూరగాయలపైనే ప్రధానంగా ఆధారపడాల్సి వస్తోంది. దాంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకప్పుడు విజయవాడ స్వరాజ్య మైదానానికి రోజు ఆరేడు లారీల కూరగాయలు వచ్చేవి. ప్రస్తుతం రెండు మూడు లారీల సరుకు మాత్రమే వస్తోంది.

వైద్య వసతులు మాత్రం మృగ్యం

వైద్య వసతులు మాత్రం మృగ్యం

ఆస్పత్రుల ఫీజుల విషయంలోనూ హైదరాబాద్‌తో విజయవాడ పోటీపడుతోంది. హైదరాబాద్‌లో పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆస్పత్రులు ఉన్నాయి. అక్కడ చికిత్సలకు ఉపయోగించే పరికరాలు అత్యాధునికమైనవి. నర్సింగ్, కేరింగ్‌తో పాటు ఆస్పత్రుల నిర్వహణ కూడా మెరుగ్గా ఉంటుంది. అక్కడి సౌకర్యాలతో పోలిస్తే విజయవాడ వెనుకబడి ఉన్నా ఫీజుల వసూలులో మాత్రం ఇక్కడి కొన్ని ఆస్పత్రులు హైదరాబాద్‌ ఆస్పత్రులతో పోటీ పడుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Vijawada city in Andhra Pradesh living cost burden sum to general particularly poor people. Home rents to School fees.. Vegetable rates to Hospital charges were higher than Hyderabad. Home rents so much better in Hyderabad here.
Please Wait while comments are loading...