AP Job Calendar: జాబ్ క్యాలెండర్ పై కీలక అప్డేట్- సర్కార్ డెడ్ లైన్..! రేపే ఖరారు..!
ఏపీలో నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ (AP Job Calendar) పై ప్రభుత్వం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈసారి ఉగాదికి ఎలాగైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని భావిస్తున్న కూటమి సర్కార్ ఇందుకోసం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీల గుర్తింపుకు డెడ్ లైన్ ఇవ్వడంతో పాటు రేపు ఆయా శాఖాధిపతులతో ఆర్థికశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో జాబ్ క్యాలెండర్ లో ఇవ్వాల్సిన ఖాళీలను ఖరారు చేస్తారు.
జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు వీలుగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వివరాలు సమర్పించేందుకు ఆయా శాఖలకు ఇవాళ సాయంత్రం తుది గడువుగా కూడా నిర్ణయించింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయి, వీటిలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సినవి ఎన్ని, భవిష్యత్తులో భర్తీ చేయాల్సినవి ఎన్ని.. ఇలా పలు వివరాలను అధికారుల నుంచి సేకరిస్తోంది.

అనంతర భర్తీ చేయాల్సిన ఖాళీల ఖరారుపై రేపు (శుక్రవారం) ఆర్ధిక శాఖ సమావేశం ఏర్పాటు చేస్తోంది. విభాగాల వారీగా ఇప్పటికే ప్రాథమిక పోస్టుల ఖాళీలను సేకరించిన ఆర్థికశాఖ.. రేపు సాయంత్రం 3 గంటలకు అధికారులతో సమావేశం నిర్వహించనుంది. ఇందులో పోస్టులు, ఖాళీల పూర్తి వివరాలను ప్రతి కార్య దర్శి, శాఖాధిపతికి వేర్వేరుగా ఇస్తామని పేర్కొంది. ఖాళీలను ధ్రువీకరించిన తర్వాత ఇవాళ్టి లోగా అందజేయాలని అన్ని విభాగాలనూ నిన్న కోరిన ప్రభుత్వం.. వీటి ఆధారంగా రేపు సమావేశం నిర్వహించి వాటిని ఖరారు చేయనుంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఖాళీల వివరాలను సేకరించి, తుది జాబితాను రూపొందించేందుకు ఆర్థికశాఖ చర్యలు చేపట్టింది.












Click it and Unblock the Notifications