గుజరాత్ పరిస్థితి ఇదీ: కాంగ్రెసు దశ తిరగుతుందా...

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ/ గాంధీనగర్: వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీ కొట్టే సామర్థ్యం ప్లస్ ప్రజాదరణ గల నాయకుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో కాగడా వేసి వెతికినా కనిపించడం లేదు.

మరోవైపు ఆరోసారి బీజేపీ విజయానికి వివిధ కులాల సమీకరణాలు అడ్డుగోడలు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 60 శాతం ఓట్లతో మొత్తం 26 స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరిస్థితులు అనుకూలంగా లేవు.

నల్లధనం వెలికితీసేందుకు పెద్ద నోట్ల రద్దు, తాజాగా దేశవ్యాప్తంగా వివిధ పన్నుల స్థానే అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో వివిధ రకాల సమస్యలతో వ్యాపారులు బీజేపీపై గుర్రుగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. నోట్ల రద్దు తర్వాత బీజేపీ కూడా గుజరాత్ రాష్ట్రంలో బ్రాహ్మణులు, ఇతర సామాజిక వర్గాల్లో పునాది బలోపేతం చేసుకోవడానికి చర్యలు చేపట్టింది.

ప్రత్యామ్నాయంగా ఇలా క్షత్రియుల ఏక్తా మిషన్ యాజిటేషన్

ప్రత్యామ్నాయంగా ఇలా క్షత్రియుల ఏక్తా మిషన్ యాజిటేషన్

గుజరాత్ రాష్ట్రంలో ప్రభావిత సామర్థ్యం గల పాటిదార్లు అలియాస్ పటేళ్లు.. హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో 2015 మధ్యలో విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం.. మరోవైపు దీనికి ప్రతిగా ఇతర వెనుకబడిన తరగతుల కులాలు (ఓబీసీ), షెడ్యూల్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల ఆధ్వర్యంలో క్షత్రియుల నేత అల్పేష్ ఠాకూర్ ‘ఓఎస్ఎస్ ఏక్తా మంచ్' పేరిట చేపట్టిన ఆందోళన వారిద్దరినీ ఆయా సామాజిక వర్గాల్లో కీలకమైన నేతలుగా నిలిపాయి. ఈ రెండు ఆందోళనలు బీజేపీ భవితవ్యానికి పరీక్షగా నిలిచాయి. కులాల ఆధారంగా సాగిన ఆందోళనల నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సొమ్ము చేసుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాటిదార్లు, క్షత్రియులు, ఓబీసీలు, ఎస్టీ, ఎస్సీలు రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో పరస్పరం వైరి పక్షాలుగానే వ్యవహరిస్తుండటం ఆసక్తికర పరిణామం.

హార్దిక్ పటేల్‌, రాహుల్ గాంధీ పరస్పరం అభినందనలు

హార్దిక్ పటేల్‌, రాహుల్ గాంధీ పరస్పరం అభినందనలు

పాటిదార్లలో 63 శాతం మంది ఓబీసీ హోదా కోరుతున్నారు. పటేళ్ల ఆందోళనకు కారణమైన రిజర్వేషన్ల అంశంపై ఆచితూచి స్పందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పాటిదార్లపై పోలీసుల కాల్పులు జరుపుతూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది. ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పాటిదార్ల నాయకుడు హార్దిక్ పటేల్ ప్రశంసించారు. హార్దిక్ పటేల్‌నూ రాహుల్ గాంధీ అభినందించారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పటేళ్లు మద్దతు ఇవ్వబోరని హార్దిక్ పటేల్ పేర్కొనడం గమనార్హం.

146 ఉపకులాలను చేరదీసేందుకు జస్టిస్ రోహిణి కమిషన్?

146 ఉపకులాలను చేరదీసేందుకు జస్టిస్ రోహిణి కమిషన్?

ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ సైతం పాటిదార్లకు రిజర్వేషన్ విషయమై మౌనముద్ర వహిస్తున్నా.. వారితో రాజీ కోసం ఇటీవలే హార్దిక్ పటేల్ తదితర పాటిదార్ నాయకులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల కల్పనపై కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. పాటిదార్లలో యువకులపై పోలీసు కేసులను ఎత్తి వేయిస్తామని హామీలు గుప్పించింది. పోలీసు కాల్పుల్లో మరణించిన పాటిదార్ల కుటుంబాలకు అండగా నిలుస్తానని నమ్మ బలికింది. అందుకు అనుగుణంగా ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ రోహిణి సారథ్యంలో ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 146 ఉప కులాల వారికి ఆశల ఊసులు కల్పించాలన్న లక్ష్యంతో ఈ కమిషన్ ఏర్పాటైంది.

 పటేళ్ల రిజర్వేషన్ పోరాటమే కీలకం

పటేళ్ల రిజర్వేషన్ పోరాటమే కీలకం

కానీ మూడుసార్లు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై పటేళ్లు రాళ్లు రువ్వారు. గుజరాత్ రాష్ట్రంలో 15 శాతం మంది ఓటర్ల జనాభా ఆర్థికంగా మెరుగ్గా జీవనం సాగిస్తున్నా.. హార్దిక్ పటేల్ డిమాండ్.. బీజేపీ అభ్యర్థులకు షాక్ కలిగిస్తున్నది. పాటిదార్ల పోరాట సమితి నాయకుడు హార్దిక్ పటేల్, ఓఎస్ఎస్ నాయకుడు అల్పేశ్ ఠాకూర్‌లకు చెందిన ప్రజాసంఘాలు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఇటీవల అమిత్ షాతో అల్పేశ్ ఠాకూర్ సమావేశమైనా మద్దతునిచ్చే విషయమై స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. ప్రత్యేకించి పటేళ్ల రిజర్వేషన్ల పోరాటమే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 ఉనా దాడి తర్వాత ఆనందీబెన్ పటేల్‌కు ఉద్వాసన

ఉనా దాడి తర్వాత ఆనందీబెన్ పటేల్‌కు ఉద్వాసన

ఈ క్రమంలో 2015 డిసెంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లా పంచాయతీలకు 23 జిల్లా పంచాయతీలు, 194 తాలూకా పంచాయతీలకు 113 చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. 2016లో ‘ఉనా'లో దళిత యువకులపై దాడికి నిరసనగా భారీస్థాయిలో చేపట్టిన ఆందోళనతో నరేంద్రమోదీ స్థానే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆనందీబెన్ పటేల్‌ను 2016 ఆగస్టులో తప్పించి విజయ్ రూపానీని గుజరాత్ సీఎంగా నియమించింది బీజేపీ నాయకత్వం. విజయ్ రూపానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత సన్నిహితుడన్న పేరు ఉన్నది. డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్‌ను నియమించినా పటేళ్లలో విశ్వాసం పాదు కొల్పలేకపోయింది బీజేపీ. మరోవైపు ప్రధానిగా నరేంద్రమోదీ వంటి సమర్థ నాయకుడి మద్దతు లేకుండా ఎన్నికల బరిలో నిలుస్తున్నది.

 రాహుల్ రోడ్ షోలో ప్రజల స్పందన బేష్

రాహుల్ రోడ్ షోలో ప్రజల స్పందన బేష్

మరోవైపు పటేళ్ల రిజర్వేషన్ల పోరాటం, ఓఎస్ఎస్ ఆందోళనకు తోడు గత దశాబ్ద కాలానికంటే దూకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ దఫా గట్టి సవాల్ విసురుతోంది. ‘ఖామ్ - క్షత్రియ, హరిజన్, ఆదివాసి, ముస్లిం'ల మద్దతుతో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీకి సమర్థుడైన నాయకుడు లేకున్నా 20 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తనకు అనువుగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. ఇటీవల పటేళ్ల సామాజిక వర్గం నివసిస్తున్న ప్రాంతాల్లో రాహుల్ గాంధీ నిర్వహించిన రోడ్ షోకు అనూహ్య మద్దతు లభించింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాల్లో నాలుగు వేల ఓట్లు కూడా లభించేవి కావు. కానీ రోడ్ షో సందర్భంగా రాహుల్ తో కరచాలనం చేసేందుకు వందల మంది యువత ఆసక్తిగా ఎదురు చూడటం పరిస్థితిలో మార్పును తెలియజేస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు.

 అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించిన ఏఐసీసీ

అన్ని సామాజిక వర్గాలకు చోటు కల్పించిన ఏఐసీసీ

గుజరాత్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (జీపీసీసీ) అధ్యక్షుడు భరత్ సింగ్ సోలంకితోపాటు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాలకు చెందిన నాయకులను జీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. ఆదివాసీ నాయకుడు మాజీ సీఎం అమర్ సింగ్ చౌదరి తనయుడు తుషార్ చౌదరి, పటేళ్ నాయకులు పరేష్ ధానావి, కువార్జి బావాలియా, కర్సన్ దాస్ సొనాలీ వంటి దళిత నాయకులను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, ప్రచార కమిటీ చైర్మన్‌గా సత్యజిత్ గైక్వాడ్‌ను నియమించి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్ని సామాజిక వర్గాల వారిని పరిగణనలోకి తీసుకున్నదని చెబుతున్నారు.

 బీజేపీ విజయంపై సంఘ్ పరివార్‌కు ఉన్న సందేహాలివి

బీజేపీ విజయంపై సంఘ్ పరివార్‌కు ఉన్న సందేహాలివి

కానీ బీజేపీలో పేరొందిన నాయకులు ఉన్నట్లు చెప్తున్నా వారంతా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడానికి కారణమైన సోషల్ మీడియాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూకుడుగా ప్రజల్లోకి దీసుకెళ్తున్నది. ఫేస్ బుక్, వాట్సప్ తదితర వేదికల్లో బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని నమ్మొద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాతీలను పదేపదే కోరడం మారిన పరిస్థితిని తెలియజేస్తున్నదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. తొలి నుంచి బీజేపీకి మార్గదర్శకత్వం వహిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్త ఒకరు మాట్లాడుతూ జీఎస్టీ అమలు అధికార పార్టీకి నష్టం చేకూరుతుందని, యువతలో గణనీయ భాగం ఓటర్లు కమలనాథులకు దూరం అవుతుందన్నారు. 35 ఏళ్లలోపు యువత ఆకాంక్షలను పట్టించుకోకపోవడమే పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తున్నదని అంటున్నారు. ఇటీవల రాహుల్ గాంధీపై బీజేపీ నాయకత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి మరింత బూమరాంగ్ అవుతుందని, ఆయనకు అనవసర ప్రాధాన్యం కల్పిస్తున్నారా? అన్న పరిస్థితి నెలకొంటుందన్నారు.

కమలనాథులను నీరుగారుస్తున్న ఇంటెలిజెన్స్ సర్వేలు

కమలనాథులను నీరుగారుస్తున్న ఇంటెలిజెన్స్ సర్వేలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీ 110 స్థానాల్లోపే పరిమితమవుతుందని తెలుస్తున్నది. ఇటీవలి ఎన్నికల్లో మాదిరిగా అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ఆశలు మాత్రం అంత తేలిక కాదని అంటున్నారు. అయితే సంఘ్ కార్యకర్తలు గెలుపొందడం కష్ట సాధ్యం అంటున్నారే అంత తేలిక కాదని చెప్తున్నారు. కమలనాథులు కూడా పూర్తిగా ప్రధాని మోదీ ప్రభంజనం మీదే ఆధార పడి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు ఓబీసీలతోపాటు వివిధ సామాజిక వర్గాలతో కలిసి గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ప్రత్యేకించి పాటిదార్లు, ఠాకూర్లు, రాజపుత్రులు తదితర సామాజిక వర్గాలతో బీజేపీ నాయకత్వం జట్టు కట్టింది. కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా పని చేసిన మాధవ్ సింగ్ సోలంకి అమలు చేసిన క్షత్రియులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింల సామాజిక వర్గాల మద్దతుతోకూడిన ఫార్ములా ప్రతిపక్ష పార్టీకి దన్నుగా నిలిచింది. గత కొన్నేళ్లుగా నెలకొంటున్న పరిణామాల ప్రకారం ఓబీసీల్లో గణనీయ భాగం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటేసే పరిస్థితులు ఉన్నాయి.

గోరక్షకు వ్యతిరేకంగా దళితుల పోరాటం ఇలా

గోరక్షకు వ్యతిరేకంగా దళితుల పోరాటం ఇలా

నిరుద్యోగ సమస్యకు తోడు వ్యవసాయ రంగంలో సంక్షోభం వంటి సమస్యలకు తోడు పాటిదార్లు, ఠాకూర్ల ఆందోళన రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయా? అన్న ఆసక్తిని రేకెత్తిస్తున్నది. మధ్య గుజరాత్ ప్రాంతంతోపాటు 182 స్థానాలు గల గుజరాత్ అసెంబ్లీలో సౌరాష్ట్ర ప్రాంతంలో 60కి పైగా స్థానాల్లో ఠాకూర్లు, పాటిదార్లు కీలకం. గోరక్ష పేరిట జరుగుతున్న దాడులను పశు విక్రేతలు, పాడి రైతులు పట్టించుకోవడం లేదు. పైపెచ్చు గో రక్ష సాకుతో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళితుల ఆందోళన కూడా కమలనాథులను కష్టాల పాల్జేస్తున్నదని విమర్శకులు చెప్తున్నారు. పటేళ్లు, ఠాకూర్ల ఆందోళన, గోరక్షకుల దాడులకు వ్యతిరేకంగా దళితుల ఆందోళన, వ్యవసాయ రంగంలో సంక్షోభం తదితర అంశాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Lack of a popular Congress leader and inherent contradictions in various caste-based agitations might result in a record victory for the BJP in Gujarat The Bharatiya Janata Party (BJP) got 60% of votes and won all the 26 Lok Sabha seats in Gujarat in the 2014 general elections. Things have not been smooth for the party in the post-2014 phase though.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి