నోరూరించే 'కంద పులుసు'.. ఎలా తయారు చేసుకోవాలంటే..?
తెలుగు ప్రజలు కందను ఇష్టంగా తింటారు. కందతో అనేక రకాల వంటలు చేస్తారు. కంద వేపుడు, కంద పులుసు, కంద పచ్చడి, కంద బచ్చలి కూర, కంద వంకాయ పులుసు.. ఇలా పలు విధాలుగా చేసుకుంటారు. అయితే నోరూరించే కంద పులుసును ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
నోరూరించే 'కంద పులుసు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కందగడ్డ అర కిలో, టమాటో ఒకటి, ఉల్లిపాయలు ఒకటి, పచ్చిమిర్చి మూడు, నూనె తగినంత, కరివేపాకు, ఉప్పు తగినంత, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, కారం తగినంత, బెల్లం కొద్దిగా, చింతపండు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్.. తీసుకోవాలి.
కంద పులుసు తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ లో హాఫ్ కిలో కందగడ్డ ముక్కలు, కొంచెం ఉప్పు వేసుకుని ఓ విజిల్ వచ్చేంత వరకూ ఉడికించాలి. మరోవైపు ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటోలను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఓ గిన్నెలో చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు, జీలకర్ర వేసుకుని వేగనివ్వాలి.

ఆ మిశ్రమంలోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోనే టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటోలు మెత్తబడిన అనంతరం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు వేయాలి. పసుపు, ఉప్పు తగినంత వేసి అందులోనే కారం, చింతపండు రసం పోయాలి. పులుసు బాగా మరిగిన తర్వాత అందులోనే కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి. అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో ఉడికించిన కంద గడ్డ ముక్కలను హై ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీర తురుము వేస్తే సరి.. కంద పులుసు తయారైనట్లే..!












Click it and Unblock the Notifications