సూపర్ టేస్టీ 'బటానీ మసాలా'.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు..!
రోజూ ఒకే రకమైన కూరగాయలు తిని బోర్ కొట్టిందా..? కూరగాయలు లేకుండా కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఉందా..? అయితే సూపర్ టేస్టీ 'బటానీ మసాలా' కర్రీని ఓసారి ట్రై చేయండి.. తక్కువ పదార్థాలతోనే ఈ కర్రీని రుచికరంగా చేసుకోవచ్చు. బటానీ మసాలా కర్రీని పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. అయితే ఈ టేస్టీ బటానీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బటానీ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పచ్చి బటానీలు ఒక కప్పు, ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్ లు, టమాటోలు రెండు, పచ్చిమిర్చి రెండు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నీళ్లు ఒక కప్పు, కొత్తిమీర తురము తీసుకోవాలి.
బటానీ మసాలా కర్రీ తయారీ విధానం చూస్తే ముందుగా పాన్ లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి మంచి వాసన వచ్చేంత వరకూ కలపాలి. ఇప్పుడు అందులో టమాటో పేస్టు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి మసాలను బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బటానీలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో నీళ్లు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేయాలి. అలా కర్రీ మందంగా అయ్యేంత వరకూ మరిగించుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర తురుముతో కర్రీని గార్నిష్ చేసుకోవాలి అంతే.. సూపర్ టేస్టీ బటానీ మసాలా కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications