"బెండకాయ కోడిగుడ్డు ఫ్రై" ఎలా చేయాలంటే..?
బెండకాయ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కూరగాయ. దీనిని ఇంగ్లీషులో ఓక్రా (Okra) లేదా లేడీస్ ఫింగర్ (Lady's Finger) అని అంటారు. ముఖ్యంగా భారతీయ వంటకాల్లో కూడా బెండకాయని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో ఉండే పోషక విలువలు అధికంగా ఉండడం.. సులభంగా జీర్ణమయ్యే గుణం కారణంగా దీనిని తరచుగా ఆహారంలో చేర్చుతారు. అయితే బెండకాయ అంటే చాలామందికి ఇష్టముండదు. అయితే బెండకాయ బంకగా ఉంటుందని.. రుచి ఉండదని ఎక్కువ మంది తినడానికి ఆసక్తి చూపరు. కానీ కొందరు మాత్రం బెండకాయ వేపుడు మాత్రమే తింటుంటారు. ఈ తరహా విషయాలు అన్నింటికీ చెక్ పెడుతూ పిల్లలకి అయిన పెద్దలకు అయినా కానీ ఇష్టంగా బెండకాయ తినిపించేందుకు బెస్ట్ ప్లాన్ ఇదే.
ఎలాంటి సీజన్ లో అయినా కానీ మంచిగా తినేలా.. బెండకాయ కోడిగుడ్డు ఫ్రై తినడం ఉత్తమం. గుడ్డు అనేది పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యానికి మేలు చేయడమే.. కాకుండా ఎక్కువగా ఇష్టపడే ఆహారంగా గుర్తింపు పొందింది. అత్యంత పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారంగా కూడా గుడ్డు పరిగణించబడుతుంది. దీని వల్ల ప్రోటీన్, విటమిన్ A, D, E, B12, ఫోలేట్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి. గుడ్డు తినడం వల్ల శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ వంటకం ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్ధాలు..
బెండకాయలు: పావు కిలో (చిన్న ముక్కలుగా తరిగినవి)
కోడిగుడ్లు: 2 లేదా 3
ఉల్లిపాయ: 1 (పెద్దది)
పచ్చిమిర్చి: 2-3
కరివేపాకు: రెండు రెబ్బలు
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర చెంచా
పసుపు: చిటికెడు
కారం: 1 చెంచా (మీ రుచికి తగినట్లు)
ఉప్పు: రుచికి సరిపడా
పోపు దినుసులు: ఆవాలు, జీలకర్ర
నూనె: 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం..
ముందుగా బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించాలి.
ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
ఇప్పుడు బెండకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ జిగురు పోయే వరకు వేయించాలి (మూత పెడితే జిగురు వస్తుంది).
బెండకాయ ముక్కలు వేగాక, వాటిని బాణలిలో ఒక పక్కకు జరిపి, ఖాళీ ఉన్న చోట కోడిగుడ్లను కొట్టి వేయాలి.
కోడిగుడ్డు మిశ్రమం కొంచెం గట్టిపడ్డాక బెండకాయ ముక్కలతో కలిపి బాగా వేయించాలి.
చివరగా కారం, మరికొంచెం ఉప్పు (అవసరమైతే) వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి.
రుచికరమైన బెండకాయ కోడిగుడ్డు ఫ్రై సిద్ధం! ఇది అన్నం లేదా చపాతీలోకి చాలా బాగుంటుంది.












Click it and Unblock the Notifications