"చిక్కుడు కాయ కూర" ఇలా చేస్తే సూపర్ టేస్ట్ పక్కా..!
చిక్కుడు కాయ వంటకాలకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాచుర్యం ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అన్ని చోట్లా ఈ కూరను బాగా ఇష్టంగా తింటుంటారు. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉండటం వల్ల చిక్కుడు కాయను చాలామంది ఇష్టంగా తింటారు. చిక్కుడు కాయలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, విటమిన్-B, విటమిన్-C సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తహీనత తగ్గించడంలో, శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి కూరగా ఉపయోగపడుతుంది.
కాగా చిక్కుడు కాయతో ఎన్నో రుచికరమైన వంటకాలు చేయవచ్చు. చిక్కుడు కాయ వేపుడు, చిక్కుడు కాయ పప్పు, చిక్కుడు కాయ మసాలా కూర, చిక్కుడు కాయ-కొబ్బరి కూర.. చిక్కుడు కాయ సాంబార్ / చిక్కుడు కాయ కుర్మా.. పండుగల సమయంలో ప్రత్యేకంగా తయారు చేస్తారు. అయితే చిక్కుడు కాయ వండే ముందు నార తీసేయడం ముఖ్యం. లేకపోతే కూర తినేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువగా ఉడికించకుండా మృదువుగా ఉడికిస్తే రుచి, పోషకాలు రెండూ కాపాడబడతాయి. వేడి వేడి అన్నంలో చిక్కుడు కాయ పెట్టుకుని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే. చిక్కుడు కాయ తయారు చేసే విధానం మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు :
చిక్కుడుకాయలు: 250 గ్రాములు (పీచు తీసి, ముక్కలుగా చేసుకున్నవి)
ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నని తరుగు)
పచ్చిమిర్చి: 3-4
టమోటా: 1 పెద్దది (తరుగు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
కారం: 1-2 టీస్పూన్లు (మీ రుచికి తగినట్లు)
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
ధనియాల పొడి: 1 టీస్పూన్
తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు): 1 టీస్పూన్
కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా
నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
ముందుగా చిక్కుడుకాయ ముక్కలను కొద్దిగా ఉప్పు వేసిన నీళ్లలో మెత్తబడే వరకు ఉడికించి, నీటిని వడకట్టి పక్కన పెట్టుకోండి.
బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించండి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించండి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపండి.
టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గనివ్వండి.
ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి బాగా కలపండి.
ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి, మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా 5 నిమిషాల పాటు చిన్న మంటపై వేయించండి.
చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి.
ఈ చిక్కుడుకాయ కూర అన్నం లేదా చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు మరింత రుచి కావాలనుకుంటే చివరలో కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications