బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ.. ఇలా చేస్తే సూపర్ టేస్టీ..
కోడిగుడ్డు కర్రీని ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. కోడిగుడ్డు పులుసు చేసుకున్నా.. ఫ్రై చేసుకున్నా రుచిగానే ఉంటుంది. అయితే ఈజీగా తక్కువ సమయంలో ఈసారి బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఈ కర్రీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..?
బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. కోడి గుడ్లు 4 లేదా 6, ఉల్లిపాయ ఒకటి పెద్దది, పచ్చిమిర్చి మూడు, టమాటాలు రెండు పెద్దవి, అల్లంవెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి నాలుగు, ఎండుమిర్చి రెండు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆవాలు అర స్పూన్ , కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ పై గుడ్లను ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీరను తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో నూనె పోసి అందులో ఉడికించిన గుడ్లు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకూ వేయించుకోవాలి. వాటిని పక్కనపెట్టుకోవాలి.

అదే పాన్ లో ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి, ఆవాలు వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ప్రై చేసుకోవాలి. ఆ మిశ్రమంలో టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. అవి మాడకుండా నీటిని పోయాలి. అలా నూనె తేలేంత వరకూ ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే గుడ్లు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర వేస్తే సరి ఘుమఘుమలాడే బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications