'కీర దోసకాయ రోటి పచ్చడి'.. ఇలా చేసుకుంటే రుచితోపాటు ఆరోగ్యం కూడా..!
కీర దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కీర దోసలోని విటమిన్ K, విటమిన్ C, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అలాగే కీర దోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సాయపడుతుంది. కీర దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడమే కాకుండా చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. అయితే కీర దోసకాయతో రోటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..? కీర దోసకాయ రోటి పచ్చడి టేస్టీ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ కీర దోసకాయ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి..?
కీర దోసకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఓ సారి చూస్తే.. కీర దోసకాయలు 3, ఎండుమిర్చి, టమాటోలు 2, ధనియాలు, జీలకర్ర టేబుల్ స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజు, జీలకర్ర తగినంత, ఉల్లిపాయ ఒకటి, నూనె తగినంత, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అర స్పూన్ తీసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి 5, కరివేపాకు తగినంత, ఇంగువ తగినంత తీసుకోవాలి.
తయారీ విధానం చూస్తే.. ముందుగా కీరదోసకాయలను కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కాక అందులో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ మిశ్రమాన్ని పక్కనపెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నూనె వేసి.. అందులో కీరా ముక్కలు, టమోటా ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. అందులో అడుగుమాడకుండా నీళ్లు పోసి చింతపండు వేసి కలుపుకోవాలి. అలా కీరదోస ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు రోటిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసి రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంలోనే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు తగినంత వేసి రుబ్బాలి. ఆ తర్వాత అందులోనే కీరా ముక్కలు వేసి మళ్లీ మెత్తగా రుబ్బుకోవాలి. అంతే టేస్టీ కీరదోస పచ్చడి రెడీ అయినట్టే. దీనిని డైరెక్ట్ గా తినవచ్చు. లేదా తాలింపు పెట్టుకుని తినొచ్చు. తాలింపు కావాలంటే నూనెలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే కీరదోస రోటి పచ్చడి రెడీ అయినట్టే.












Click it and Unblock the Notifications