"కోడిగుడ్డు తురుము కూర" ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోవాల్సిందే..!
కోడిగుడ్డు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే వనరు కావడమే దీని ప్రత్యేకత. కేవలం రుచికే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడంలో గుడ్డును మించిన ఆహారం లేదని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే.. కాకుండా ఎక్కువగా ఇష్టపడే ఆహారంగా గుర్తింపు పొందింది.
కాగా అత్యంత పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారంగా కూడా గుడ్డు పరిగణించబడుతుంది. దీని వల్ల ప్రోటీన్, విటమిన్ A, D, E, B12, ఫోలేట్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి.
గుడ్డు తినడం వల్ల శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా భారతదేశంలో గుడ్డుతో చేసే వంటకాలకు విశేష ప్రాధాన్యం ఉంది. అయితే ఈ సమ్మర్ సీజన్ లో గుడ్డు తురుము కూర అన్నం, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్లను తురిమి, ఉల్లిపాయలు మరియు మసాలాలతో కలిపి ఈ కూరను కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన గుడ్లు: 4
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి: 2 (చీలికలు)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
టమాటాలు: 1 (తురిమినది లేదా పేస్ట్)
కారం: 1 టీస్పూన్
పసుపు: టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది)
తయారీ విధానం:
ఉడకబెట్టిన గుడ్ల పెంకు తీసి, గ్రేటర్ (Grater) సహాయంతో గుడ్లను తురిమి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
ఇప్పుడు టమాటా తురుము, ఉప్పు, పసుపు వేసి టమాటాలు మెత్తగా ఉడికే వరకు వేయించాలి.
తరువాత కారం, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేంత వరకు మసాలాని ఉడికించాలి.
ఇప్పుడు తురిమిన గుడ్డును మసాలాలో వేసి, అడుగంటకుండా 3-4 నిమిషాల పాటు చిన్న మంటపై బాగా కలుపుకోవాలి.
చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.












Click it and Unblock the Notifications