బీరకాయ ఎగ్ బుర్జీ.. నిమిషాల్లో సూపర్ కర్రీ రెడీ..!
సాధారణంగా ఉల్లిపాయలతో ఎగ్ బుర్జీ చేస్తారు. కానీ బీరకాయతో ఎప్పుడైనా ఎగ్ బుర్జీ చేశారా..? కేవలం నిమిషాల్లోనే పూర్తయ్యే ఈ వంట సూపర్ టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ అలాగే ఆఫీస్ లకు వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. మరి సూపర్ టేస్టీ బీరకాయ ఎగ్ బుర్జీ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
బీరకాయ ఎగ్ బుర్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బీరకాయలు అర కిలో, కోడి గుడ్లు నాలుగు లేదా ఐదు, ఉల్లిపాయలు రెండు, పచ్చిమిర్చి రెండు, నూనె తగినంత, అల్లం పేస్టు కొద్దిగా, ఎండు మిర్చి రెండు, కరివేపాకు రెండు రెమ్మలు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, ధనియాల పొడి ఒక టీస్పూన్, గరం మసాలా చిటికెడు, కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి.
బీరకాయ ఎగ్ బుర్జీ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా బీరకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి. వాటితోపాటు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు మిర్చిని తుంపి వేయాలి. ఇప్పుడు అందులో అల్లం తరుగు వేసి వేయించాలి.

ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలిపి కుక్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో బీరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద బీరకాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికించుకున్నాక ఆ మిశ్రమంలో కారం, ధనియాల పొడి వేయాలి. ఒకసారి బాగా కలిపి మూతపెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి.
ఇప్పుడు ఆ మిశ్రమంలో గుడ్లను కొట్టి పోయాలి. అలా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాలపాటు మగ్గించుకోవాలి. అలా కర్రీలో నూనె పైకి తేలేదాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక చివరిగా కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ బీరకాయ ఎగ్ బుర్జీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications