ఆరోగ్యంగా బరువు తగ్గాలా..? ఇదిగో పోషకాల సూప్.. ఇలా చేసుకోండి..
ఎత్తుకు తగిన బరువు ఉండాలని చాలామంది వైద్యులు చెబుతుంటారు. కానీ మనలో చాలామంది అలా ఉండరు. అధిక బరువుతో ఇబ్బందులు పడుతుంటారు. ఉరుకులు, పరుగులు ఉన్న నేటి జీవితంలో ఊబకాయుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. దాంతో బరువు తగ్గించుకోవడానికి చాలా మంది అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. జిమ్ లలో గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. మరికొందరు డైటింగ్ పేరిట ఏమీ తినకుండా ఒంట్లో ఉన్న కేలరీలను కరిగిస్తుంటారు. అయితే ఈ రెండూ ప్రమాదమేనని వైద్యులు చెబుతున్నారు. మోతాదు మించిన వ్యాయామం చేయోద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా బరువు తగ్గాలని మీరు కోరుకుంటున్నారా..? అయితే మీరు ఈ సూప్ ను ఇంట్లోనే ఎంచక్కా తయారు చేసుకుని తాగొచ్చు. వేపుళ్లు, అధిక కొవ్వు పదార్థాల జోలికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రతిరోజూ ఈ సూప్ తాగడం ద్వారా మీరు ఊహించని విధంగా బరువు తగ్గుతారు. మరి ఈ పోషకాల సూప్ ఎలా తయారు చేసుకోవాలి..? ఏఏ పదార్థాలు కావాలి..?
పోషకాల సూప్ తయారీ ఎలా అంటే.. ముందుగా మూడు టేబుల్ స్పూన్ ల జొన్న పిండిని సన్నని సెగ మీద కలుపుతూ.. మంచి సువాసన వచ్చేంత వరకూ వేయించుకోవాలి. ఇక్కడ రాగిపిండి కూడా తీసుకోవచ్చు. ఆ తర్వత మరో గిన్నెలో ముప్పావు లీటరు నీళ్లు పోసుకోవాలి. మరుగుతున్న నీటిలో తగినన్ని గుమ్మడి ముక్కలు.. ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అవి బాగా మరిగాక అందులో అరకప్పు పుదీనా ఆకులు వేయాలి. ఆ తర్వాత నీటిని వడకట్టాలి.
నీరంతా వేరే గిన్నెలోకి జల్లెడ పట్టాక.. గుమ్మడి ముక్కలు, ఉల్లి, పుదీనా మిశ్రమాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించుకున్న జొన్న పిండి వేసుకోవాలి. అందులో గుమ్మడికాయ ఉడికించిన నీళ్లను కొంచెం కొంచెంగా వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి తీసుకుని స్టవ్ ఆన్ చేయాలి. గిన్నెలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.

ఇప్పుడు మరో గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకుని అది మరిగాక.. అందులో వాము వేసుకోవాలి. వాము మరిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి అవి వేగాక ఆ మిశ్రమాన్ని గుమ్మడి కాయ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చివరిగా పైన నిమ్మకాయ రసం పిండుకోవాలి. దాంతో పోషకాల సూప్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications