ఈ వేసవిలో ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇది తినాల్సిందే..?
సమ్మర్ సీజన్ స్టార్ అయ్యింది. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, జీర్ణక్రియను సక్రమంగా కొనసాగించడం చాలా అవసరం. ఈ సమయంలో పెరుగుతో చేసే వంటకాలు ఆహారంలో ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. ముఖ్యంగా రైతా లాంటి సైడ్ డిష్‌లు భోజనానికి చల్లదనాన్ని, రుచిని మాత్రమే కాకుండా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తాయి. సాధారణంగా బూందీ, దోసకాయ, ఉల్లిపాయ రైతాలు ఎక్కువగా వాడినా, ఇంట్లో అందుబాటులో ఉన్న కూరగాయలతో చేసే మిక్స్ వెజిటబుల్ రైతా మాత్రం ఆరోగ్యకరంగా, రుచికరంగా ఉంటుంది.
మిక్స్ వెజ్ రైతా ప్రత్యేకత ఏమిటంటే, ఇది తక్కువ సమయంలో సులభంగా తయారవ్వడమే కాకుండా, పోషకాలు కూడా సమృద్ధిగా అందిస్తుంది. క్యారెట్, దోసకాయ, టమాటో వంటి కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఫైబర్‌ను అందిస్తాయి. పెరుగు ప్రోబయోటిక్స్‌తో సమృద్ధిగా ఉండి గుట్ హెల్త్‌ను మెరుగుపరుస్తుంది. వేడి వేడి భోజనంతో పాటు చల్లటి రైతా తింటే శరీరానికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కేవలం పదే నిమిషాల్లోనే తయారు చేయగలిగే అద్భుతమైన మిక్స్ వెజ్ రైతా మీకోసం ప్రత్యేకంగా..

తయారీకి కావాల్సిన పదార్థాలు..
- చిక్కటి పెరుగు - 2 కప్పులు
- ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
- టమాటో - 1 (విత్తనాలు తీసి తరిగినది)
- దోసకాయ - 1 (తురిమినది లేదా తరిగినది)
- క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు (తురిమినది)
- పచ్చిమిర్చి - 1-2 (సన్నగా తరిగినవి)
- కొత్తిమీర - కొద్దిగా (అలంకరణకు)
- వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
- నల్ల ఉప్పు - చిటికెడు
- ఉప్పు - రుచికి తగినంత
- ఎర్ర మిరప పొడి లేదా మిరియాల పొడి - చిటికెడు
- నూనె లేదా నెయ్యి - 1 టీస్పూన్
- జీలకర్ర - 1/2 టీస్పూన్
- ఆవాలు - 1/2 టీస్పూన్
- కరివేపాకు - 4-5 ఆకులు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని బాగా గిలకొట్టి స్మూత్‌గా చేసుకోవాలి. పెరుగు మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీరు లేదా పాలు కలిపి సరైన దారానికి తీసుకురావాలి.
- ఇప్పుడు ఈ పెరుగులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటో, దోసకాయ, క్యారెట్, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.
- ఆ తరువాత జీలకర్ర పొడి, నల్ల ఉప్పు, సాధారణ ఉప్పు, మిరప పొడి వేసి మళ్లీ కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర జోడించాలి.
- ఇప్పుడు తాలింపు కోసం చిన్న బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడే వరకు వేయించాలి.
- ఈ వేడి తాలింపును రైతాపై పోసి నెమ్మదిగా కలుపుకోవాలి.
సర్వింగ్ సూచనలు..
తయారైన రైతాను 15-20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే మరింత చల్లగా, రుచిగా ఉంటుంది. బిర్యానీ, పులావ్, రోటీ లేదా అన్నంతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది.
అదనపు చిట్కాలు..
ఈ రైతాలో మీకు నచ్చిన ఇతర కూరగాయలు కూడా జోడించవచ్చు.
బీట్‌రూట్, స్వీట్ కార్న్, కాప్సికమ్ లేదా ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసినా రుచి మరింత పెరుగుతుంది.
డైట్‌లో ఉన్నవారు లో-ఫ్యాట్ పెరుగు ఉపయోగించవచ్చు.












Click it and Unblock the Notifications