చిన్న చిన్నగా ఉన్నాయని నిర్లక్ష్యం వద్దు... పెద్ద ఆరోగ్యాన్నిస్తాయి
ఆవాలు మన వంటకాల్లో, ముఖ్యంగా పోపులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి కేవలం రుచిని, వాసనను పెంచడమే కాకుండా అనేక పోషకాలు, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఆవాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కు మంచి వనరులు. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్, టోకోఫెరోల్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా దీనివల్ల మేలు కలుగుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
ఆవాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరచడం ద్వారా ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. సెలీనియం, ఐరన్, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సెలీనియం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి
ఆవాలలో ఉండే విటమిన్ ఎ, సి, కె, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచి, మొటిమలను తగ్గిస్తాయి.ఆవనూనెను జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది. ఇది చుండ్రును కూడా నివారిస్తుంది.
గ్లూకోసినోలేట్స్, మైరోసినేస్ వంటి సమ్మేళనాలు వీటిల్లో ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఈ సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆవాల పొడిని వేడి నీళ్లలో కలిపి కాళ్లకు మసాజ్ చేయడం వల్ల పాదాల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.












Click it and Unblock the Notifications